డార్క్‌ నెట్‌లో భారతీయుల ఆధార్, పాన్ వివరాల అమ్మకం!

ABN , First Publish Date - 2020-06-03T23:23:51+05:30 IST

దాదాపు లక్ష మంది భారతీయులకు చెందిన ఆధార్, పాన్ కార్డు వివరాలు డార్క్ నెట్‌లో అమ్మకానికి వచ్చినట్టు ప్రముఖ సైబర్ నిఘా సంస్థ సిబిల్ వెల్లడించింది.

డార్క్‌ నెట్‌లో భారతీయుల ఆధార్, పాన్ వివరాల అమ్మకం!

ముంబై: దాదాపు లక్ష మంది భారతీయులకు చెందిన ఆధార్, పాన్ కార్డు వివరాలు డార్క్ నెట్‌లో అమ్మకానికి వచ్చినట్టు ప్రముఖ సైబర్ నిఘా సంస్థ సిబిల్ వెల్లడించింది. అయితే ప్రభుత్వం నుంచి ఈ సమాచారం బయటకు పొక్కలేదని సంస్థ స్పష్టం చేసింది. మూడో వ్యక్తి లేదా సంస్థ ద్వారా ఈ విరాలు లీకై ఉంటాయనే అనుమానం వ్యక్తం చేసింది.


‘లక్ష మంది భారతీయులకు సంబంధించిన ఆధార్, పాన్ కార్డు వివరాలను అమ్మకానికి ఉన్నాయన్న ఆఫర్‌ను మేము డార్క్ నెట్‌లో గుర్తించాము. ఆఫర్ ఇచ్చిన వ్యక్తి లేదా సంస్థ అంతగా పాపులర్ కాకపోవడంతో తొలుత మేము పట్టించుకోనప్పికీ.. అందులోని వివరాలు మా దృష్టిని ఆకర్షించాయి. దేశంలో వివిధ ప్రాంతాలని నుంచి దాదాపు లక్ష మంది సమాచారాన్ని సేకరించినట్టు అందులో ఉంది. దీంతో 1000 ఐడీలను మేము సేకరించి పరిశీలించగా అవి భారతీయులవేనని ప్రాథమికంగా తేలింది. దీనిపై మరింత లోతుగా విచారణ చేపడుతున్నాం’ అని సదరు సంస్థ ప్రకటించింది ప్రకటనలో తెలిపింది.


ప్రైవేటు కంపెనీలు కేవైసీ నిబంధనలు పాటించే సందర్భంలో ఇవి లీకై ఉండొచ్చని భావిస్తోంది. ఇలాంటి వివరాలను నిందితులు అనేక అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించే అవకాశం ఉందని తెలిపింది. పూర్తిగా తనిఖీ చేయకుండా పౌరులు వ్యక్తిగత గుర్తింపుకు సంబంధించిన వివరాలను ఇతర వ్యక్తులు లేదా సంస్థలతో ఎట్టి పరిస్థితుల్లో పంచుకోవద్దని హెచ్చరించింది. 


డార్క్ నెట్ అంటే..

గూగుల్, మోజిల్లా వంటి సెర్జింజన్ల ద్వారా మనకు పరిచయమైన ఇంటర్నెట్‌కూ పూర్తి భిన్నమైనది డార్క్ నెట్. ఈ బ్రౌజర్ల ద్వారా డార్క్ నెట్‌ను చేరుకోవడం సాద్యం కాదు. ఇందుకోసం ప్రత్యేకమైన సాఫ్టవేర్లు అవసరమవుతాయి. సాధారణంగా మనకు అందుబాటులో ఉండని సమాచారం ఇక్కడ లభ్యమవుతుందని సైబరు నిపుణులు చెబుతారు. ఈ సమాచారమంతా ప్రమాదకరమైనది కాకపోయినప్పటికీ.. ప్రభుత్వ అజమాయిషీ లేని డార్క్ నెట్‌తో  ప్రమాదాలే ఎక్కువని వారు హెచ్చరిస్తున్నారు. 

Updated Date - 2020-06-03T23:23:51+05:30 IST