పాజిటివ్‌ వస్తే హోం ఐసోలేషనే..!

ABN , First Publish Date - 2021-05-17T05:39:29+05:30 IST

కరోనా టెస్టింగ్‌ల్లో పాజిటివ్‌ వచ్చిందా.. అయితే హోం ఐసోలేషనలో ఉండండి. ఇదీ ప్రస్తుత పరిస్థితి. కరోనా ట్రీట్‌మెంటు కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్ల కొరత లేదని ప్రభుత్వం చెబుతోంది. రోజూ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించే హెల్త్‌ బులెటినలో కూడా బెడ్లు ఖాళీ ఉన్నట్టు చూపిస్తున్నారు.

పాజిటివ్‌ వస్తే హోం ఐసోలేషనే..!


ఆసుపత్రుల్లో ఆక్సిజన బెడ్ల కొరత

హెల్త్‌ బులెటినలోనే ఖాళీలు

కరోనా బాధితులకు దొరకని బెడ్లు

ఇంట్లో చికిత్స పొందుతున్న 9073 మంది

సరిగా అందని కిట్లు

వారిపై పర్యవేక్షణ కరవు

కడప, మే 16 (ఆంధ్రజ్యోతి): కరోనా టెస్టింగ్‌ల్లో పాజిటివ్‌ వచ్చిందా.. అయితే హోం ఐసోలేషనలో ఉండండి. ఇదీ ప్రస్తుత పరిస్థితి. కరోనా ట్రీట్‌మెంటు కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్ల కొరత లేదని ప్రభుత్వం చెబుతోంది. రోజూ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించే హెల్త్‌ బులెటినలో కూడా బెడ్లు ఖాళీ ఉన్నట్టు చూపిస్తున్నారు. అయితే బాధితుడు ఆసుపత్రికి వెళితే బెడ్లు దొరకడం గగనంగా మారింది. మొదటి దశ కరోనాలో హోం ఐసోలేషనలో తక్కువ మందికి చికిత్స అందించేవారు. రెండో దశలో మాత్రం మొదట ప్రయార్టీ హోం ఐసోలేషనకే ఇస్తున్నారు. దీంతో ప్రత్యేక గది లేకపోవడం, మరుగుదొడ్డి లేకపోవడంతో కుటుంబ సభ్యులు మొత్తం వైరస్‌ బారిన పడుతున్నారు. జిల్లాలో 11064 యాక్టివ్‌ కేసులు ఉంటే 9073 మంది హోం ఐసోలేషనలో ఉన్నారు. ఆసుపత్రుల్లో 1991 మంది మాత్రమే ట్రీట్‌మెంటు తీసుకుంటున్నారు.


ఇంట్లోనే ఉండండి

రెండో దశ కరోనా మొదలైనప్పటి నుంచి పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులను ఇంట్లోనే ఉండమంటున్నారు. అయితే బీపీ, షుగరు, ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉన్న వారిని కూడా కొందరిని హోం ఐసోలేషనలో ఉంచుతున్నట్లు విమర్శలున్నాయి. హోం ఐసోలేషనలో ఉండే వారికి ఇంట్లో విడిగా ఉండేందుకు మరుగుదొడ్డి ఉన్న ప్రత్యేక గది ఉండాలి. బాఽధితులను 24 గంటలు చూసుకునే సంరక్షణ ఉండాలి. అలాగే 60 ఏళ్ల పైబడ్డ వారు ఇతర అనారోగ్య సమస్యలున్న వారు హోం ఐసోలేషనలో ఉండడం అంత మంచిది కాదని చెబుతున్నారు. అయితే వీరందరినీ డాక్టర్లు ఫోన ద్వారా ఆరోగ్య సమస్యలు తెలుసుకుంటూ బాధితుడికి సలహాలు, సూచనలు ఇవ్వాలి. అవసరమైన మెడికల్‌ కిట్‌ను అందజేయాలి. అయితే ప్రత్యేక గది లేని వారిని కూడా హోం ఐసోలేషన పేరిట ఇంట్లో ఉంచుతున్నట్లు చెబుతున్నారు. ఇరుకు గదుల్లో ఉండడంతో ఆ కుటుంబ సభ్యులు కూడా వైరస్‌ బారిన పడుతున్నారు. కొందరు హోం ఐసోలేషనలో ఉంటూ పరిస్థితి విషమించడంతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నట్లు తెలుస్తోంది. హోం ఐసోలేషనలో ఉన్న వారిపై పర్యవేక్షణ కొరవడినట్లు చెబుతున్నారు. లక్షణాలు లేవని కొందరు విచ్చలవిడిగా బయట తిరుగుతుండడంతో వైరస్‌ వ్యాప్తికి కారణమవుతోంది.


‘ఆక్సిజన’ కోసం అల్లాడుతున్నారు.

ఇప్పుడు జిల్లాలో ఆక్సిజన పెట్టి ఊపిరి పోయండంటూ కరోనా బాఽధితులు, వారి కుటుంబీకుల నుంచి విజ్ఞప్తులు పెరుగుతున్నాయి. జిల్లాలో కరోనా సెకండ్‌వేవ్‌ రాకెట్‌ వేగంతో చుట్టేస్తోంది. వైరస్‌ బారిన పడ్డ వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఆసుపత్రిలో జాయిన అయ్యేవారిలో 40 శాతం మందికి ఆక్సిజన అవసరమతోంది. పాజిటివ్‌ కేసులకు తగ్గట్లు ఆక్సిజన బెడ్లు లేవు. ఇది ఇప్పుడు జిల్లావాసులకు శాపంగా మారింది. రిమ్స్‌, ఫాతిమా, ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రులు, ప్రైవేటు కలిపి మొత్తం 20 చోట్ల కరోనా చికిత్స చేస్తున్నారు. వైద్యఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన బెడ్లు 998, నాన ఆక్సిజన బెడ్లు 2642 ఉన్నాయి. ఆదివారం నాటికి మొత్తం 1991 బెడ్లు నిండాయి. 1649 బెడ్లు ఖాళీ ఉన్నట్లు హెల్త్‌ బులిటినలో లెక్కలు చూపించారు.


బెడ్లెక్కడ?

పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పాజిటివ్‌ కేసుల్లో స్వల్ప లక్షణాలు ఉన్న వారిని హోం ఐసోలేషన చేస్తున్నారు. ఇంట్లో వసతి లేని వారిని కేర్‌ సెంటర్లలో ఉంచుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. కడప రిమ్స్‌లో 350 ఆక్సిజన బెడ్లు ఉండగా  ఆదివారం నాటికి అన్నీ ఫుల్‌ అయ్యాయి. ప్రొద్దుటూరులో 120 ఆక్సిజన బెడ్లు, 20 ఐసీయూ బెడ్లు ఉన్నాయి. ఐసీయూ 18 బెడ్లలో చికిత్స పొందుతున్నారు. అంటే ఇక్కడ 2 బెడ్లు ఖాళీ ఉన్నాయి. ఇక ఫాతిమాలో కూడా బెడ్లు దొరకడం కష్టంగా మారింది. ఇక్కడ ఆక్సిజన 110, నాన ఆక్సిజన 340 బెడ్లు ఉన్నాయి. వీటిలో ఆక్సిజన బెడ్లన్నీ రోగులతో నిండిపోయాయి. నాన ఆక్సిజన బెడ్లు 20 మాత్రమే ఖాళీ ఉన్నాయి. 


ఆక్సిజన కోసం తంటాలు..

ఆక్సిజన కొరత కారణంగా ఆసుపత్రుల్లో బెడ్లు లేవని చెబుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా బాఽధితులకు రోజూ 20 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన అవసరమవుతోంది. అందుబాటులో 19 ఎంటీ ఉన్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం 24 మెట్రిక్‌ టన్నుల డిమాండ్‌ ఉండడంతో అధికారులు నానా అగచాట్లు పడి ఇతర జిల్లాల నుంచి తెప్పించారు. రిమ్స్‌ 13 కేఎల్‌, ఫాతిమా 5, ప్రొద్దుటూరు 5 కేఎల్‌, పులివెందుల కొవిడ్‌ ఆసుపత్రికి సిలిండర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. కడప ఇండసి్ట్రయల్‌ ఎస్టేట్‌లో మాత్రమే 5 కేఎల్‌ సామర్థ్యం గల ఆక్సిజన ప్లాంట్లు ఉండగా అక్కడ 3 కేఎల్‌ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. దీంతో డిమాండ్‌కు తగ్గట్లు ఆక్సిజన సరఫరా లేకపోవడం కలవరపాటుకు గురి చేస్తోంది.

Updated Date - 2021-05-17T05:39:29+05:30 IST