కశ్మీర్ స్వర్గమే అయితే..: సువేంధు వ్యాఖ్యలపై ఒమర్ ఫైర్

ABN , First Publish Date - 2021-03-07T21:45:33+05:30 IST

శనివారం నందిగ్రామ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సువేంధు అధికారి మాట్లాడుతూ ‘‘నేను నందిగ్రామ్ రైతు బిడ్డను. మమతా బెనర్జీ బయటి వ్యక్తి. ఆమెను ఓడించి మళ్లీ కోల్‌కతాకు పంపించండి’’ అని అన్నారు

కశ్మీర్ స్వర్గమే అయితే..: సువేంధు వ్యాఖ్యలపై ఒమర్ ఫైర్

శ్రీనగర్: పశ్చిమ బెంగాల్‌లో మరోసారి తృణమూల్ కాంగ్రెస్ గెలిస్తే.. రాష్ట్రం కశ్మీర్‌లా తయారవుతుందని భారతీయ జనతా పార్టీ నేత సువేంధు అధికారి చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్ మరో స్వర్గమైందని బీజేపీ నేతలు జబ్బలు చరిచారు, మరి ఇప్పుడు ఎందుకు కశ్మీర్‌లా బెంగాల్ అవుతుందని అంటున్నారని అన్నారు. ఆదివారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా సువేంధుపై విమర్శలు గుప్పించారు.


‘‘2019 ఆగస్టులో కశ్మీర్ మరో స్వర్గమైందని అన్న బీజేపీ నేతలు ఇప్పుడెందుకు బెంగాల్‌ను మరో కశ్మీర్ అవుతుందా అని వ్యాఖ్యానిస్తున్నారు? ఏదైతేనేమి బెంగాలీలు కశ్మీర్‌ను ప్రేమిస్తారు. ఇక్కడికి పెద్ద సంఖ్యలో బెంగాలీలు వస్తారు. మీరు మాపై పిచ్చి వ్యాఖ్యలు చేశారు, అయినా మేము వాటిని క్షమిస్తాం’’ అని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు.


శనివారం నందిగ్రామ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సువేంధు అధికారి మాట్లాడుతూ ‘‘నేను నందిగ్రామ్ రైతు బిడ్డను. మమతా బెనర్జీ బయటి వ్యక్తి. ఆమెను ఓడించి మళ్లీ కోల్‌కతాకు పంపించండి’’ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘టీఎంసీ అధికారంలోకి వస్తే బెంగాల్ మరో కశ్మీర్‌లా తయారవుతుంది’’ అని సువేంధు అన్నారు. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ ఒమర్.. కశ్మీర్‌ను స్వర్గమన్న బీజేపీ నేతలు బెంగాల్‌ను కశ్మీర్ అవుతుందని వ్యాఖ్యలు చేయడమేంటని అభ్యంతరం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-03-07T21:45:33+05:30 IST