Abn logo
Sep 15 2021 @ 11:31AM

Road Accident జరిగిందా.. బాధితుల తరలింపులో జాగ్రత్త.. తేడాలొస్తే సమస్యే.. ఇలా చేయండి..!

  • సరైన పద్ధతి అవలంబించకపోతే ప్రాణాలకు ముప్పు
  • తరలించడంలో తేడాలొస్తే సమస్యే

హైదరాబాద్‌ సిటీ : అసలే వర్షాకాలం. రోడ్లు మట్టి, ఇసుకతో నిండిపోయి ఉన్నాయి. ఏకాస్త ఏమరుపాటుగా ఉన్నా, వేగంగా వెళ్లినా జారి పడాల్సిందే. ప్రమాదాల్లో పలువురు గాయాలపాలవుతున్నారు. చనిపోతున్న ఘటనలూ ఉన్నాయి. రోడ్డు ప్రమాద మృతుల్లో 35 సంవత్సరాల లోపు వారు ఎక్కువగా ఉంటున్నారు. ప్రమాదంలో గాయపడిన బాధితులను ఆస్పత్రికి తరలించే విధానంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. 


ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే భుజంపై ఎత్తుకుని హడావిడిగా ఆస్పత్రికి తీసుకుపోతాం. లేదా ఇద్దరు, ముగ్గురు కలిసి బాధితుడి చేతులు, కాళ్లు పట్టుకుని తీసుకువెళ్తుంటారు. ఇలా చేయడం సరికాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలా తరలిస్తే బాధితుడి ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశముందని చెబుతున్నారు. పద్ధతి ప్రకారం తరలిస్తేనే బాధితుడిని రక్షించడానికి అవకాశముందని పేర్కొంటున్నారు.

FILE PHOTO

చేయాల్సినవి...

- సృహతప్పి లేచిన వ్యక్తిని తప్పనిసరిగా వైద్యుడి వద్దకు తీసుకుపోవాలి.

- చెవి వెనుక నల్లటి చారలున్నా, తలనొప్పిగా ఉన్నా, వాంతులు అవుతున్నా, ఫిట్స్‌ వచ్చినా వెంటనే ఆస్పత్రికి తీసుకుపోవాలి.

- ముక్కుకు ఏదైనా అడ్డుపడితే తీసేయాలి.

- రక్తం కారుతుంటే ఆపడానికి వస్త్రంతో కట్టుకట్టాలి.

- ముక్కు నుంచి నీరు కారుతుందా అనిగమనించాలి.

- దీని వల్ల బ్యాక్టీరియా వెనక్కి వెళ్లి మెదడుకు ఇన్‌ఫెక్షన్‌ వచ్చే ప్రమాదముంది.

- గుండెపైన చెవి పట్టి గమనించాలి. ఆగినట్లు అనుమానం వస్తే రోగి నోట్లో నోరు పెట్టి గట్టిగా ఊదాలి.

- గుండెపై అయిదారు సార్లు వత్తాలి. 

- చెవిలోంచి రక్తం వస్తుందా గమనించాలి. 

- ప్రమాదంలో గాయపడిన వారికి ఎముకలు విరిగే అవకాశముంటుంది.

- అటు, ఇటు కదిలించకుండా జాగ్రత్తగా బాధితుడిని స్ర్టెచర్‌పైకి చేర్చాలి.

- స్ర్టెచర్‌పై నిటారుగా పడుకోబెట్టి తలను ఎత్తుగా ఉంచి ఆస్పత్రికి తరలించాలి.

- గాలి తగిలే విధంగా ఉంచాలి. శ్వాస ఆడేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇలా చేయవద్దు...

- రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి వెంటనే నీళ్లు ఇవ్వరాదు. 

- నీళ్లు ఇస్తే ఊపిరితిత్తులకు ప్రమాదం వాటిల్లే అవకాశముంది.

- కిందపడితే తలకు దెబ్బతగిలిందేమో గమనించాలి. 

- బాధితుడిని ఇతరులు తమ చేతులు, భుజాలపై వేసుకుని ఆస్పత్రికి తరలించకూడదు. 

- బాధితుడి తల వేలాడేలా ఉంచవద్దు.

వేగ నియంత్రణ కీలకం.. 

వర్షాకాలంలో తడిసిన రోడ్లపై వేగంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్‌ వేగం కంటే వెళ్లకూడదు. వేగ నియంత్రణ వల్ల 70 శాతం ప్రమాదాలను నివారించవచ్చు. కారులో ఎయిర్‌బ్యాగ్‌, రెగ్యులర్‌ సర్వీస్‌ ఉంటే ప్రమాదంలో ముప్పు తక్కువగా ఉంటుంది. నాణ్యమైన హెల్మెట్‌ ధరిస్తే 50 శాతం ప్రమాదాలను తగ్గించవచ్చు. కారులో ముందు కూర్చున్న వారు బెల్ట్‌ పెట్టుకోవడం, ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్‌ పెట్టుకోవడం వల్ల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. ఫ్రాక్చర్స్‌ వంటి వాటిని నయం చేయడానికి వీలుంటుంది. కానీ.. తలకు బలమైన దెబ్బ తగిలితేవారి పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. - డాక్టర్‌ అంకిత ఆర్‌ చౌలా, ఎమర్జెన్సీ మెడిసిన్‌ విభాగం అధిపతి, స్టార్‌ ఆస్పత్రి

మొదటి గంటలోనే చికిత్స అందిస్తే...

ప్రమాదంలో గాయపడిన బాధితులకు తక్షణమే ఆక్సిజన్‌ అందించి శ్వాస తీసుకునేటట్టు చేయాలి. అవసరమైతే శ్వాస నాళంలోకి గొట్టాన్ని ఏర్పాటు చేయడం, రక్తస్రావాన్ని ఆపడం వంటివి చేస్తే ప్రాణాపాయం నుంచి రక్షించవచ్చు. దీనిని వైద్య పరిభాషలో అడ్వాన్స్‌డ్‌ ట్రామా లైఫ్‌ సపోర్ట్‌ (ఎటిఎల్‌ఎ్‌స)గా వ్యవహరిస్తాం. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రోగిని బతికించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదంతా మొదటి గంటలోనే చేసినట్లయితే బతికే అవకాశాలు మెరుగుపడుతాయి. - డాక్టర్‌ పవన్‌కుమార్‌, అత్యవసర విభాగం అధిపతి, కేర్‌ ఆస్పత్రి.


గోల్డెన్‌ అవర్‌..

ఓ పది నిమిషాలు మీరు ఆలస్యంగా వచ్చి ఉంటే ప్రాణాలు దక్కేవి కావు’.. ప్రమాదాల్లో గాయపడ్డ బాధితులను ఆస్పత్రికి తరలించిన సమయంలో ఇటువంటి మాటలు వింటుంటాం. ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో చూస్తుంటాం. రోడ్డుపై ప్రమాదం జరిగినా, అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చినా, బ్రెయిన్‌ స్ట్రోక్‌తో కొట్టుమిట్టాడుతున్నా రోగిని వెంటనే ఆస్పత్రికి తరలించడం చాలా ముఖ్యం. అలా తరలించాల్సిన వ్యవధిని వైద్యులు గోల్డెన్‌ అవర్‌గా పేర్కొంటారు.

ప్రతి నిమిషం విలువైందే..

రోడ్డు ప్రమాదాలలో గాయపడిన బాధితులను ఎంత త్వరగా తరలిస్తే అంత మెరుగైన చికిత్స అందించడానికి అవకాశముంటుందని వైద్యులు వివరిస్తున్నారు. ప్రతి నిమిషం ఎంతో విలువైందంటున్నారు. ప్రమాదాలలో తలకు బలమైన గాయాలు తగిలి, ఎముకలు విరిగి, అంతర్గత రక్తస్రావాలు ఏర్పడుతుంటాయి. వాటిని గమనించి వెంటనే అత్యవసర చికిత్స అందించకపోతే ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. కొందరికి మెదడులో రక్తస్రావం జరిగి తీవ్ర ప్రమాదం ఏర్పడుతుంది. త్వరగా వచ్చిన రోగికి అవసరమైన స్కాన్స్‌ చేసి ముప్పును నివారించడానికి ఆస్కారముంటుందని వైద్యులు వివరించారు. గుండె నొప్పి వచ్చిన వారిని 90 నిమిషాల లోపు ఆస్పత్రికి తరలిస్తే థ్రోంబోలైసిస్‌ మందులు ఇవ్వడం ద్వారా ముప్పును తప్పించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.