ఈ మెలకువలు పాటిస్తే.. బొప్పాయితో సిరుల పంటే!

ABN , First Publish Date - 2021-09-01T16:48:32+05:30 IST

వాణిజ్య పంటైనా, ఆహార పంటైనా..

ఈ మెలకువలు పాటిస్తే.. బొప్పాయితో సిరుల పంటే!

విత్తన ఎంపిక కీలకం.. దోర్నాలలో వంద ఎకరాల్లో సాగు


పెద్దదోర్నాల(ప్రకాశం): వాణిజ్య పంటైనా, ఆహార పంటైనా దాని పంట కాలం నాలుగు నెలల నుంచి ఏడాది లోపుంటుంది. బొప్పాయి మాత్రం తొమ్మిది నెలల నుంచి రెండున్నరేళ్ల వరకు దిగుబడులు ఇస్తూనే ఉంటుంది. వాతావరణం అనుకూలిస్తే ఎకరానికి 24 టన్నుల నుంచి 30 టన్నుల దిగుబడి వస్తుంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో బొప్పాయికి మంచి గిరాకీ ఉంది. పంట సాగులో విత్తనం ఎంపికే కీలకం. కొద్దిపాటి మెలకువలు పాటిస్తే బొప్పాయితో మంచి లాభాలు అర్జించవచ్చని ఆ శాఖాధికారులు తెలిపారు.


అధిక ఉష్ణోగ్రత అవసరం

బొప్పాయి పంటకు అధిక ఉష్ణోగ్రత అవసరం. ఎక్కువ వేడి ఉన్న ప్రదేశాల్లో బాగా పండుతుంది. జిల్లాలోని పశ్చిమ ప్రాంతం ఈ పంటకు అనుకూలంగా ఉంది. ఈక్రమంలోనే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఈ పంట సాగు చేస్తారు. దోర్నాల మండలంలో వంద ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ పంట సాగుకు ఎర్రగరప నేలలు, నీరు బాగా ఇంకే మధ్యరకం నేలలు అనుకూలం. 


బొప్పాయిలో విత్తనం ఎంపిక కీలకం. వాష్టింగన్‌, కోయంబత్తూర్‌ -1,  కో-2, కో-4, కో-5, కో-6, పూసాడ్యూ, రకాలు అనుకూలంగా ఉంటాయి.


సాగు ఇలా..

పాలిథిన్‌ సంచిని పశువుల ఎరువు, ఇసుక కలిపిన మట్టితో నింపి విత్తనాన్ని నాటుకోవాలి. 40-60 రోజుల వయస్సున్న మొక్కలను ప్రధాన పొలంలో మొక్కల మధ్య 2-2.5 మీటర్ల దూరం ఉండేలా 60 సెంటీమీటర్ల పొడవు, వెడల్పుతో తీసిన గుంతల్లో నాటుకోవాలి. ఆ గుంల్లో మట్టి, పశువుల ఎరువు, సూపర్‌ ఫాస్ఫేట్‌ కలిపిన మిశ్రమాన్ని నింపాలి. 


ఎరువులు వినియోగం ఇలా..

బొప్పాయి మొక్కలు నాటడానికి ముందు ఒక్కో గుంతలో 5కిలోల పశువుల ఎరువు, కిలో వేపపిండి, 20 గ్రాముల ఆజోస్పెర్లిం, 20 గ్రాముల ఫాసోఫ బ్యాక్టీరియా, 250 గ్రాముల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ వేసుకోవాలి. నాటిన తర్వాత ప్రతి రెండు నెలలకు ఒక్కో మొక్కకు 90 గ్రాముల యూరియా, 200 గ్రాముల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌, 140 గ్రాముల మ్యారేట్‌ అఫ్‌ పొటాష్‌ వేసుకోవాలి. ఉద్యాన అధికారుల సూచనల మేరకు పిచికారి మందులు వినియోగించి, సస్య రక్షణ చర్యలు చేపట్టినట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు. 

Updated Date - 2021-09-01T16:48:32+05:30 IST