‘ర్యాపిడ్‌’ మాయ

ABN , First Publish Date - 2021-08-05T07:15:08+05:30 IST

ప్రభుత్వ వైద్యకేంద్రాల్లో కరోనా నిర్ధారణ కోసం చేసే ర్యాపిడ్‌ పరీక్షలను నిలిపివేశారు. ఇదే అదునుగా ప్రైవేటు ల్యాబ్‌లు అనధికారికంగా టెస్టులు చేస్తూ ప్రజలను దోపిడీ చేస్తున్నాయి.

‘ర్యాపిడ్‌’ మాయ
రాపిడ్‌ యాంటిజన్‌ కిట్‌ పాతచిత్రం

ప్రైవేట్‌ ల్యాబుల దోపిడీ 


వారం క్రితం ఓ రిమాండ్‌ ఖైదీకి కరోనా పరీక్ష చేయాల్సి వచ్చింది. పది రోజుల క్రితం వరకు రిమాండ్‌ ఖైదీలకు ర్యాపిడ్‌ పరీక్ష ద్వారా ఫలితాలు  నిర్ధారించుకుని ఉపకారాగారాలకు తరలించేవారు.ప్రభుత్వ కేంద్రాల్లో ర్యాపిడ్‌ పరీక్షలు లేకపోవడంతో అటు పోలీసులు, ఇటు వైద్యసిబ్బంది ఉన్నతాధికారుల సలహా కోసం ఆపసోపాలు పడ్డారు. 

  శ్రీకాళహస్తి చెంచులక్ష్మికాలనీకి చెందిన మునిలక్ష్మి ఇటీవల ఏరియా ఆస్పత్రిలో కాన్పు కోసం చేరింది. చేరే సమయంలోనే రక్తస్రావం కావడంతో కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం కూడా లేక సిబ్బంది కాన్పు చేశారు. అనంతరం ఆర్టీపీసీఆర్‌ ద్వారా నమూనా సేకరించి తిరుపతికి పంపారు. రెండు రోజుల తరువాత  మునిలక్ష్మికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆమెకు వైద్యసేవలందించిన సిబ్బంది,బాలింతల వార్డులో అడ్మిషన్‌లో  ఉన్న మహిళలు, వారి  సంబంధీకులు ఆందోళనకు గురయ్యారు.


 శ్రీకాళహస్తి అర్బన్‌, ఆగస్టు 4: జిల్లాలోని ప్రభుత్వ వైద్యకేంద్రాల్లో రెండువారాలుగా కరోనా నిర్ధారణ కోసం చేసే ర్యాపిడ్‌ పరీక్షలను నిలిపివేశారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో పరీక్షలు అవసరమైన రోగులు, వారికి వైద్యం అందించే సిబ్బంది అవస్థలకు గురవుతున్నారు.ఇదే అదునుగా భావించిన ప్రైవేటు ల్యాబ్‌లు, వైద్యశాలల  నిర్వాహకులు అనధికారికంగా ర్యాపిడ్‌ టెస్టులు  చేస్తూ ప్రజలను బహిరంగంగా దోపిడీ చేస్తున్నారు. 

 కరోనాను కట్టడి చేయగలిగిన మార్గాలు కొన్ని మాత్రమే. వీటిలో ప్రధానమైంది సకాలంలో పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌ కేసులను గుర్తించడం. అలాగే పాజిటివ్‌ కేసులకు సంబంధించిన కాంటాక్టులను గుర్తించి వైరస్‌ వ్యాప్తి చెందకుండా అరికట్టడం. వీటితో పాటు పాజిటివ్‌ కేసులు వెలుగు చూసిన  ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడం. నిజానికి కరోనా మొదటి దశలో వైరస్‌పై అవగాహన పెద్దగా లేకపోయినప్పటికీ దశలవారీగా పరీక్షల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోవడం.....పాజిటివ్‌ కేసులతో పాటు కాంట్రాక్టు ట్రేసింగ్‌ ప్రక్రియ ఆశాజనకంగా సాగింది. గత యేడాది మే నుంచి ట్రూనాట్‌, ఆర్టీపీసీఆర్‌, ర్యాపిడ్‌ యాంటీజన్‌ పద్ధతుల ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు విస్తృతంగా నిర్వహించారు. అయితే ఈ యేడాది ఫిబ్రవరి మాసంలో ర్యాపిడ్‌ పరీక్షలను నిలిపివేశారు. అదే సమయంలో ట్రూనాట్‌ పరీక్షలు కూడా నిలిపివేసి ఆర్టీపీసీఆర్‌ మాత్రమే చేస్తూ వచ్చారు. సరిగ్గా అదే సమయంలో రెండవ దశ కరోనా వ్యాప్తి మొదలైంది. దీంతో మళ్లీ మేలుకున్న అధికారులు మార్చి నుంచి మూడు పద్ధతుల ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలను తిరిగి చేపట్టారు.  ప్రస్తుతం మూడవ దశ కరోనా వ్యాప్తి చెందడం తప్పదని  నిపుణులు హెచ్చరిస్తుండగా ఇన్ని రోజుల పాటు కొనసాగిన ట్రూనాట్‌, ర్యాపిడ్‌ పరీక్షలకు రెండువారాలుగా అధికారులు మంగళం పాడారు. అత్యవసర పరిస్థితుల్లో విధిలేక జిల్లాలో రెండుమూడు చోట్ల కొందరు వైద్యసిబ్బంది ర్యాపిడ్‌ పరీక్షలు చేశారు. దీనిపై తీవ్ర పరిణామాలు తప్పవని అధికారులు హెచ్చరించినట్లు సమాచారం. ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వైద్యశాలలో ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించకూడదని అఽధికారులు ఆదేశాలిచ్చారు.అంతేకాకుండా వారం రోజుల కిందట జిల్లావ్యాప్తంగా అన్ని కేంద్రాల్లోను ర్యాపిడ్‌ కిట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఇకపోతే సుమారు నెలరోజుల ముందు నుంచే ట్రూనాట్‌ కిట్ల సరఫరా నిలిచిపోయింది. ప్రభుత్వ వైద్యశాలల్లో ర్యాపిడ్‌ పరీక్షలపై నిర్బంధం ఉండడంతో ప్రైవేటు ల్యాబుల్లో, ఆస్పత్రుల్లో ర్యాపిడ్‌ కిట్ల ద్వారా అనధికారికంగా పరీక్షలు నిర్వహించే దందా వేళ్లూనుకుంది. జిల్లావ్యాప్తంగా 500వరకు ప్రైవేటు ల్యాబ్‌లున్నాయి. వీటిలో సగానికి పైగా కేంద్రాల్లో యధేచ్చగా ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బహిరంగంగా ఒక్కో టెస్టుకు సుమారు రూ.వెయ్యి నుంచి రూ.2,500 వరకు వసూలు చేస్తున్నారు.కనీసం రిపోర్టులు కూడా ఇవ్వడంలేదు. ప్రైవేటు కేంద్రాల్లో చేసే ర్యాపిడ్‌ పరీక్షల ఫలితాలను ప్రామాణికంగా తీసుకోలేమని అధికారులు చెబుతున్నారు.ఇపుడు ఈ దందా మరింత ప్రమాదకరంగా తయారైంది. కనీస అర్హతలు కూడా లేని వ్యక్తులు కరోనా పరీక్షల్లో వచ్చే లాభాలపై దృష్టి పెట్టారు.ఒక్కో పరీక్షకు రూ.వెయ్యికి పైగా ఆదాయం ఉండడంతో ఏమాత్రం అవగాహన లేనివారు కూడా ల్యాబ్‌ టెక్నిషీయన్లుగా అవతారమెత్తుతున్నారు. ప్రైవేటు సర్జికల్స్‌ ద్వారా ప్రస్తుతం మార్కెట్‌లో అనధికారికంగా మూడు రకాల ర్యాపిడ్‌ కిట్లు అమ్ముడవుతున్నాయి. వీటి ధర ఒకో కిట్టు రూ.175, రూ.250, రూ.275గా ఉన్నట్లు తెలిసింది. వీటిని సర్జికల్‌ స్టోర్స్‌, మెడికల్‌ డిస్ర్టిబ్యూటర్స్‌ ద్వారా ల్యాబ్‌లు,ప్రైవేటు వైద్యశాలల నిర్వాహకులు సరఫరా చేసుకుంటున్నారు.మరికొందరు ఇంటి వద్దకే వచ్చి ర్యాపిడ్‌ పరీక్షలు చేస్తామంటూ జేబులో ర్యాపిడ్‌కిట్లు తెచ్చుకుని పరీక్షలు చేస్తున్నారు.అనధికారికంగా పాజిటివ్‌గా నిర్ధారించుకున్న బాధితులు సొంత వైద్యం చేసుకుంటున్నారు. కొందరు వైరస్‌ ఎక్కువై తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు.జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ వైద్యకేంద్రాల్లో ర్యాపిడ్‌ పరీక్షలు నిలిపిపోవడంతో ప్రైవేటు వ్యక్తులకు ర్యాపిడ్‌ పరీక్షలు కాసులవర్షం కురిపిస్తున్నాయి.ఇకనైనా అధికారులు మాఫియాగా మారిన అనధికార పరీక్షలపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Updated Date - 2021-08-05T07:15:08+05:30 IST