ఆరోగ్య కేంద్రాలకు అనారోగ్యం!

ABN , First Publish Date - 2022-06-01T07:07:26+05:30 IST

పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రులు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. వీటి పరిష్కారానికి కృషి చేయాల్సిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీల జాడ లేకుండా పోయాయి. ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలో విధులు నిర్వర్తించాల్సిన వైద్యులు ప్రైవేట్‌ సేవలకు ప్రాధాన్యతనిస్తుండటంతో

ఆరోగ్య కేంద్రాలకు అనారోగ్యం!
సుంకినిలో నిరుపయోగంగా మారిన పీహెచ్‌సీ ఇదే..

సమస్యల వలయంలో కొట్టామిట్టాడుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు

సొంత భవనాలు లేక కొన్ని.. శిథిలావస్థలో మరికొన్ని..

ప్రైవేటు సేవలకు ప్రాధాన్యతనిస్తున్న పలువురు సర్కారు వైద్యులు

వైద్య సేవలు అందక అల్లాడుతున్న గ్రామీణ రోగులు

నామమాత్రంగా మారిన అభివృద్ధి కమిటీల నిర్వహణ తీరు

రోజురోజుకు దయనీయంగా మారుతున్న ప్రభుత్వ వైద్యం

కోటగిరి, మే 31: పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రులు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. వీటి పరిష్కారానికి కృషి చేయాల్సిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీల జాడ లేకుండా పోయాయి. ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలో విధులు నిర్వర్తించాల్సిన వైద్యులు ప్రైవేట్‌ సేవలకు ప్రాధాన్యతనిస్తుండటంతో ప్రభుత్వ వైద్యం ప్రశ్నార్థంగా మారుతోంది. ఆరోగ్య సిబ్బందిని అడిగే వారు లేక.. వచ్చిన వారికి వైద్యం అందక గ్రామీణ రోగులు అల్లాడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కోటగిరి మండలంలో 24 గంటల ఆసుపత్రి, పొతంగల్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు పదకొండు సబ్‌ సెంటర్లు ఉన్నాయి. సుంకిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహణ లేక నిరుపయోగంగా మారింది. విద్యుత్‌ పరికరాలు మాయమయ్యాయి. భవనం శిథిలావస్థకు చేరుతోంది. కల్లూరు గ్రామంలోనూ ఆరోగ్య కేంద్రంలో సమస్యలు నెలకొన్నాయి. మరికొన్ని సబ్‌ సెంటర్లు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఎత్తొండలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 

సమావేశాలే కరువాయే..

ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా ఎంపీపీ వ్యవహరిస్తారు. సామాజిక ఆసుపత్రులకు ఎమ్మె ల్యే, జిల్లా ఆసుపత్రికి జడ్పీ చైర్మన్‌ అధ్యక్షత వహిస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రతియేటా రెండు పర్యాయాలు రూ.లక్షా 70 వేలు మంజూరవుతాయి. వీటిని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఆమోదంతో ఆసుపత్రిలో అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రతీ పీహెచ్‌సీలో అభివృద్ధి కమిటీలు మూడు నెలలకోసారి సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నా అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. మంజూరైన నిధులను ఏయే పనులకు ఖర్చు చేయడంతో పాటు ఆసుపత్రికి వచ్చే రోగులకు ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సమావేశాల్లో నిర్ణయించాల్సి ఉంటుంది. కోటగిరి మండలంలో గత రెండేళ్లుగా అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించకపోవడం పాలకుల పనితీరుకు నిదర్శనం.

ప్రైవేట్‌ వైపు రోగుల మొగ్గు 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు కూడా అంతంత మాత్రంగానే అందుతుండటంతో రోగులు ప్రైవేట్‌ వైద్యానికి మొగ్గు చూపుతున్నారు. మండలంలోని కోటగిరి, పొతంగల్‌, ఎత్తొండతో పాటు పలు గ్రామాల్లో ఆర్‌ఎంపీల వైద్య సేవలే వినియోగించుకునే పరిస్థితి నెలకొంది. అమాయక రోగులను ఆసరా చేసుకుని ఆర్‌ఎంపీలు అందిన కాడికి దోచుకునే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మెడికల్‌ షాప్‌లతో ఆర్‌ఎంపీలు కుమ్మక్కై అవసరం లేని మందులను ఇస్తూ పేదల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీలను భర్తీ చేసి మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

నిరుపయోగంగా పీహెచ్‌సీ

సుంకిని గ్రామంలో లక్షలు వెచ్చించి నిర్మించిన పీహెచ్‌సీ భవనం నిరుపయోగంగా మారింది. గ్రామంలోని పాఠశాల ఆవరణలో నిర్మించగా, దీని పరిధిలో ఐదు గ్రామాలు ఉన్నాయి. ఆరోగ్య కేంద్రంలో వసతులు లేకపోవడంతో రోగులు ప్రైవేట్‌ వైద్యంకే మొగ్గు చూపుతున్నారు. వైద్య సిబ్బంది గర్భిణులు, బాలింతలకు అవసరమైన సేవలను మాత్రమే ఇంటింటికీ వెళ్లి అందిస్తున్నారు. ప్రస్తుతం భవనం శిథిలావస్థకు చేరింది. ఎత్తొండలో నిర్మిస్తున్న భవనం సైతం నత్తనడకన సాగుతోంది. ఆసుపత్రి అభివృద్ధి కమిటీలు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. 

Updated Date - 2022-06-01T07:07:26+05:30 IST