Gifts అమ్ముకుంటున్న ఇమ్రాన్ !....

ABN , First Publish Date - 2021-10-22T00:55:08+05:30 IST

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఇతర దేశాల అధినేతలు ఇచ్చిన బహుమతులు అమ్మేసుకుంటున్నారని

Gifts అమ్ముకుంటున్న ఇమ్రాన్ !....

ఇస్లామాబాద్: ఇతర దేశాల అధినేతలు ఇచ్చిన బహుమతులను ఇమ్రాన్  అమ్మేసుకుంటున్నారని ఆ దేశంలో ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇమ్రాన్ అమ్మేస్తున్న వాటిలో మిలియన్ డాలర్ల విలువైన వాచీ కూడా ఉందని పేర్కొన్నాయి. సాధారణంగా ఇతర దేశాధినేతలు పర్యటనకు వచ్చినప్పుడు బహుమానాలు ఇచ్చి పుచ్చుకోవడం తప్పనిసరి. వీటిని ‘తోషఖానా’ (గిఫ్ట్ డిపాజిటరీ) ప్రకారం.. బహిరంగ వేలంలో విక్రయిస్తే తప్ప అవన్నీ ప్రభుత్వ ఆస్తి కిందికే వస్తాయి. అయితే, ఆ బహుమతి విలువ రూ. 10 వేలు లోపు ఉంటే మాత్రం ఎలాంటి రుసుము చెల్లించకుండా పొందినవారు తమ వద్ద ఉంచుకోవచ్చు.  


ఇతర దేశాల నుంచి అందిన బహుమానాలను ఇమ్రాన్ అమ్మేసుకుంటున్నారని పీఎంఎల్-ఎ ఉపాధ్యక్షుడు మర్యమ్ నవాజ్ ట్వీట్ చేశారు. తోషఖానా నుంచి విదేశీ బహుమతులను లూటీ చేసిన వ్యక్తి మదీనా ఏర్పాటు గురించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఓ యువరాజు నుంచి బహుమానంగా అందుకున్న అత్యంత విలువైన వాచీని ప్రధాని అమ్మేసినట్టు వార్తలు వస్తున్నాయని పాకిస్థాన్ డెమొక్రటిక్ మూవ్‌మెంట్ (పీడీఎం) అధ్యక్షుడు మౌలానా ఫజ్లూర్ రెహమాన్ పేర్కొన్నారు. ఇది సిగ్గుచేటని అన్నారు. 


ఇమ్రాన్ ఆ వాచ్‌ను అమ్మేసినట్టు సోషల్ మీడియా కూడా కోడై కూస్తోంది. ఇమ్రాన్ తనకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ద్వారా దుబాయ్‌లో అమ్మేశారని, తాను గిఫ్ట్‌గా ఇచ్చిన వాచీని ఇమ్రాన్ అమ్మేసుకున్న విషయం యువరాజుకు కూడా తెలుసని నెటిజన్లు చెబుతున్నారు. ప్రధాని ఇమ్రాన్ తీరుతో దేశం పరువు మంటగలిసిపోతోందని పీఎంఎల్-ఎన్ పంజాబ్ అధ్యక్షుడు రానా సనౌల్లా మండిపడ్డారు. 


ప్రధాని ఇమ్రాన్ తనకు అందే బహుమతులను తోషఖానాలో డిపాజిట్ చేస్తారని, ఒకవేళ వాటిని తనతో ఉంచుకోవాలనుకుంటే కనుక దాని విలువను చెల్లించాల్సి ఉంటుందని ప్రధాని పొలిటికల్ కమ్యూనికేషన్ స్పెషల్ అసిస్టెంట్ డాక్టర్ షాబాజ్ గిల్ తెలిపారు.  

Updated Date - 2021-10-22T00:55:08+05:30 IST