మతతత్వ రాజకీయ పార్టీ డిమాండ్లకు తలొగ్గిన ఇమ్రాన్ ఖాన్

ABN , First Publish Date - 2021-04-08T19:17:09+05:30 IST

ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రభుత్వం ఓ

మతతత్వ రాజకీయ పార్టీ డిమాండ్లకు తలొగ్గిన ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్ : ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రభుత్వం ఓ మతతత్వ రాజకీయ పార్టీ డిమాండ్లకు తలొగ్గింది. దైవాన్ని దూషించేవిధంగా క్యారికేచర్ల ప్రచురణ నేపథ్యంలో ఫ్రెంచ్ రాయబారిని పాకిస్థాన్ నుంచి బహిష్కరించాలనే డిమాండ్‌‌పై పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో చర్చించేందుకు సన్నాహాలు చేస్తోంది. 


పాకిస్థాన్ మీడియా కథనాల ప్రకారం, తెహరీక్ ఈ లబాయక్ పాకిస్థాన్ (టీఎల్‌పీ) అనే మతతత్వ రాజకీయ పార్టీ గత ఏడాది నవంబరులో రావల్పిండిలో ధర్నా చేసింది. దైవాన్ని దూషించే విధంగా క్యారికేచర్ల ప్రచురణ నేపథ్యంలో ఫ్రెంచ్ రాయబారిని పాకిస్థాన్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేసింది. తమ డిమాండ్ల అమలు కోసం ఇస్లామాబాద్‌లో ధర్నా చేస్తామని హెచ్చరించింది. రెలిజియస్ అఫైర్స్ మినిస్టర్ ఖాద్రి నేతృత్వంలోని ప్రభుత్వ కమిటీ ఫిబ్రవరి 10న టీఎల్‌పీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డిమాండ్లపై ఏప్రిల్ 20నాటికి పార్లమెంటు ఆమోదం కోరుతామని హామీ ఇచ్చింది. 


టీఎల్‌పీ డిమాండ్లు ఏమిటంటే, ఫ్రెంచ్ రాయబారిని పాకిస్థాన్ నుంచి బహిష్కరించడం, ఫ్రాన్స్‌కు పాకిస్థాన్ రాయబారి నియామకాన్ని నిలిపేయడం, అరెస్టయిన టీఎల్‌పీ కార్యకర్తలందరినీ విడుదల చేయడం, ధర్నాను విరమించిన తర్వాత టీఎల్‌పీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేయరాదు. 


ఈ డిమాండ్ల అమలు కోసం నేషనల్ అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని ప్రతిపాదించాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. ఈద్-ఉల్-ఫితర్‌కు ముందే ఫ్రెంచ్ రాయబారిని పాకిస్థాన్ నుంచి బహిష్కరించడంపై ఇతర రాజకీయ పార్టీలతో కూడా చర్చించాలని నిర్ణయించింది. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో న్యాయ శాఖ మంత్రి ఫరోగ్ నసీం, ఇంటీరియర్ మినిస్టర్ షేక్ రషీద్, రెలిజియస్ అఫైర్స్ మినిస్టర్ నూరుల్ హక్ ఖాద్రి, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. 


భావ ప్రకటన ముసుగులో, ప్రభుత్వ మద్దతుతో దైవ దూషణతో కూడిన చిత్రాలను ప్రచురించడం సహించరానిదని పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ, సెనేట్ 2020 అక్టోబరులో ఓ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఫ్రాన్స్‌లో ఈ చిత్రాల పునర్ముద్రణ జరగడంతో ఈ తీర్మానాన్ని ఆమోదించింది.  


Updated Date - 2021-04-08T19:17:09+05:30 IST