విద్యుత్‌ సంస్కరణల్లో 30 ఏళ్ల ఒప్పందాలు రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-01-20T07:04:31+05:30 IST

రాష్ట్రంలో సీఎం జగన్‌ అమలు చేయనున్న 30ఏళ్ల విద్యుత్‌ ఒప్పందాలను రద్దు చేసేలా కమిషన్‌ చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యవర్గసభ్యుడు కందారపు మురళి కోరారు.

విద్యుత్‌ సంస్కరణల్లో 30 ఏళ్ల ఒప్పందాలు రద్దు చేయాలి

 ప్రజాభిప్రాయ సేకరణలో కందారపు మురళి డిమాండ్‌ 


తిరుపతి(ఆటోనగర్‌), జనవరి 19: రాష్ట్రంలో సీఎం జగన్‌ అమలు చేయనున్న 30ఏళ్ల విద్యుత్‌ ఒప్పందాలను రద్దు చేసేలా కమిషన్‌ చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యవర్గసభ్యుడు కందారపు మురళి కోరారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఏపీఈఆర్‌సీ నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలో రెండో రోజైన మంగళవారం ఆయన తిరుపతి నుంచి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పోరేటర్లకు అనుకూలంగా తీసుకొచ్చిన విద్యుత్‌ సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం గుడ్డిగా ప్రజలపై రుద్దడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఇవి అమలైతే రాష్ట్రంలో 1.85 కోట్ల వినియోగదారులపై నెలకు రూ.370 కోట్ల భారం పడుతుందన్నారు. కమిషన్‌ చైర్మన్‌ హోదాలో ప్రజలపై ఈ భారం పడకుండా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని కోరారు. గతంలో టీడీపీ ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోళ్ళ అంశంలో పాతికేళ్లకు చేసుకున్న ఒప్పందాలపై ప్రస్తుత ముఖ్యమంత్రి గగ్గోలు పెట్టారని గుర్తు చేశారు. ఇప్పుడదే 30ఏళ్లకు ఒప్పందాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. దీనిని విరమించుకోవాలని ఆయన డిమాండు చేశారు. గృహ వినియోగదారులపై విధించే ఫిక్స్‌డ్‌ చార్జీలు రద్దు చేయాలన్నారు. అపార్టుమెంట్లకున్న ఎల్‌టీ సర్వీసుల మార్పులను కూడా విరమించుకోవాలన్నారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యుత్‌ సంస్కరణలను అమలుచేస్తే ఈఆర్‌సీ కమిషన్లు కూడా ఉండవని చెప్పారు. 


ఉద్యోగ సంఘ నేతకు లభించని అవకాశం 

ప్రజాప్రాయ సేకరణలో ఏపీఎస్‌ఈబీ ఇంజనీరింగ్‌ సంక్షేమ సంఘ నేత జానకిరామ్‌ తన అభిప్రాయాలను కమిషన్‌ ముందుంచడానికి ప్రయత్నించారు. దీనిపై కమిషన్‌ చైర్మన్‌ మాట్లాడుతూ.. చెప్పదలచిన సమస్యలు, సూచనలు, అభ్యంతరాల నివేదిక తమకు అందలేదన్నారు. ఉద్యోగ సంఘ నేతగా కీలక పదవిలో ఉండి అభిప్రాయాలు వెల్లడించే నిబంధనలు తెలీవా అని ప్రశ్నించారు. కొవిడ్‌ కారణంగా ముందస్తుగా ప్రతిపాదనలు పంపలేకపోయామని, మరో రెండు రోజుల్లో చేరవేస్తానని అనుమతి కోరారు. నివేదిక లేని సమయంలో తామెలా అభిప్రాయాలను గుర్తించుకోవాలని చైర్మన్‌ తిరిగి ప్రశ్నించడంతో ఆయన వెనుదిరిగారు. సదరన్‌ డిస్కం ఎస్‌ఈ వెంకటచలపతి, ఈఈలు కృష్ణారెడ్డి, వాసురెడ్డి, డీఈఈలు జయప్రకాష్‌, సతీష్‌, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-20T07:04:31+05:30 IST