అసంపూర్తిగా చెత్త సంపద కేంద్రం

ABN , First Publish Date - 2022-01-23T04:44:42+05:30 IST

సముద్ర తీర మత్స్యకార గ్రామాల్లో అతిపెద్దది బందరువానిపేట. ఈ గ్రా మంలో నిర్మిస్తున్న చెత్తతో సంపద సృష్టి కేంద్రం అసంపూర్తిగా ఉండిపోయింది.

అసంపూర్తిగా చెత్త సంపద కేంద్రం
పూర్తికాని చెత్త కేంద్రం పనులు:



  నిధుల లేమితో నిలిచిన పనులు  

  మూడేళ్లుగా ఇదే పరిస్థితి

 బందరువానిపేటలో పేరుకుపోతున్న చెత్త

 గార, జనవరి 22: సముద్ర తీర మత్స్యకార గ్రామాల్లో అతిపెద్దది బందరువానిపేట. ఈ గ్రా మంలో నిర్మిస్తున్న చెత్తతో సంపద సృష్టి కేంద్రం అసంపూర్తిగా ఉండిపోయింది. నిధుల లేమితో గత మూడేళ్లుగా ఈ పనులు పూర్తికావడం లేదు. ఫలితంగా గ్రామంలో, రోడ్డుపక్కన చెత్త పేరుకుపోతుం ది.  సుమారు 5వేల జనాభాగల ఈ గ్రామంలో వీధులన్నీ దగ్గరదగ్గరగా ఉంటాయి. స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామంలో తడిచెత్త, పొడిచెత్తను సేకరించేందుకు గత ప్రభుత్వ హయాంలో చెత్త సంపద కేంద్రాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. రూ.లక్షా50వేల నిధులు కేటాయించారు. ఈ నిధులతో చెత్త కుండీలు,  ప్రహరీని నిర్మించి షెడ్‌ కోసం పిల్లర్లు ఏర్పాటు చేశారు. ఆ తరువాత నిధులు చాలకపోవడంతో పైకప్పు వేయకుండా వదిలేశారు. అప్పటి నుంచి  ఆ పనులు నిలిచిపోయాయి. ఫలితంగా గ్రామంలో ప్రధాన రోడ్లుపక్కనే పెద్దపెద్ద చెత్తపోగులు కనిపిస్తున్నాయి. పెద్దగ్రామం కావడంతో ఈ ఇబ్బంది మరీ ఎక్కువగా ఉంది. చెత్తపోగులు కారణంగా ఈగలు, దోమలు పెరిగి వ్యాధుల బారిన పడుతున్నా మని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.  పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు చెత్తపోగులను కాల్చడం.. మళ్లీ నిల్వలు పెరిగి పోవడం పరిపా టిగా మారింది.ఇప్పటికైనా పనులను పూర్తి చేసి చెత్త సంపద కేంద్రాన్ని అందుబాటులోకి తేవాలని  గ్రామస్థులు కోరుతున్నారు. 

 అంచనాలు తయారు చేశాం

బందరువానిపేటలో చెత్త సంపద కేంద్రం నిర్మాణానికి నిధులు సరిపోలేదు. దీనివల్ల కొంత వరకే పనులు జరిగాయి.  మిగతా పనులు పూర్తి చేసేందుకు రూ.2.5 లక్షలతో రివైజ్‌డ్‌ అంచనాలు తయారుచేసి అధికారుల అనుమతికోసం పంపించాం. 

-పొట్నూరు శ్రీనివాసరావు, ఈవోపీఆర్‌డీ, గార 





Updated Date - 2022-01-23T04:44:42+05:30 IST