10 రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల

ABN , First Publish Date - 2021-08-01T07:15:16+05:30 IST

దేశంలో 10 రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కొన్ని వారాల నుంచి 46 జిల్లాల్లో పాజిటివ్‌ రేటు 10పైనే ఉందని తెలిపింది.

10 రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల

  • జాబితాలో ఏపీ, కేరళ, కర్ణాటక, తమిళనాడుఠి
  • కట్టడికి కఠిన ఆంక్షలు విధించండి: కేంద్రం

న్యూఢిల్లీ, జూలై 31(ఆంధ్రజ్యోతి): దేశంలో 10 రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కొన్ని వారాల నుంచి 46 జిల్లాల్లో పాజిటివ్‌ రేటు 10పైనే ఉందని తెలిపింది. అలసత్వం వహిస్తే పరిస్థితి చేజారుతుందని హెచ్చరించింది. ఈ జిల్లాల్లో ప్రజల రద్దీని తగ్గించేందుకు కఠిన ఆంక్షలు విధించే అంశం పరిశీలించాలని సూచించింది. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఆంధ్రప్రదేశ్‌, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు సహా ఈశాన్యంలోని 5 రాష్ట్రాల ఉన్నతాధికారులతో శనివారం కేంద్ర ఆరోగ్య శాఖకార్యదర్శి రాజేశ్‌భూషణ్‌, ఐసీఎంఆర్‌ డీజీ బలరాం భార్గవ సమీక్ష నిర్వహించారు. 53 జిల్లాల్లో పాజిటివిటీ 5-10 మధ్య ఉందని, పరీక్షల సంఖ్యను పెంచాలన్నా రు. యాక్టివ్‌ కేసుల్లో 80ు హోం ఐసోలేషన్‌లో ఉన్నారని.. వీరు ఇతరులను కలవకుండా పటిష్ఠ నిఘా అవసరమని స్పష్టం చేశారు. ‘‘చికిత్స అవసరమైన వారిని సకాలంలో ఆస్పత్రిలో చేర్పించండి. 10 కంటే పాజిటివిటీ తక్కువగా ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టి వ్యాక్సినేషన్‌ను వేగిరం చేయండి. ప్రైవేటు ఆస్పత్రుల్లో పీఎ్‌సఏ ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటును పరిశీలించండి’’ అని రాజేశ్‌ భూషన్‌ రాష్ట్రాలకు సూచించారు. కరోనా మృతుల్లో సీనియర్‌ సిటిజన్లు, 45-60 ఏళ్ల మధ్యవారు 80% ఉన్నారని, వీరికి వ్యాక్సిన్‌ ఇవ్వడంపై దృష్టి పెట్టాలని  బలరాం భార్గవ అన్నారు. ముఖ్యంగా రెండో డోసు వారికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.


బెంగళూరులో మళ్లీ లాక్‌డౌన్‌?

కేసుల పెరుగుదల నేపథ్యంలో కర్ణాటక రాజధాని బెంగళూరులో మళ్లీ ఆంక్షలు తప్పేలా లేవు. రాత్రి కర్ఫ్యూ లేదా వారాంత లాక్‌డౌన్‌ను అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, దేశంలో  శుక్రవారం సైతం కరోనా కొత్త కేసులు 40 వేలపైనే నమోదయ్యాయి. 593 మంది చనిపోయారు. యాక్టివ్‌ కేసులు 4.08 లక్షలకు చేరాయి. కేరళలో ఐదో రోజూ బాధితులు 20 వేల పైనే ఉన్నారు. రాష్ట్రాల వద్ద 3.14 కోట్ల టీకాలు నిల్వ ఉన్నాయని కేంద్రం పేర్కొంది. 


జపాన్‌లో 6 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ

కరోనా డెల్టా వేరియంట్‌ విజృంభణతో జపాన్‌ వణుకుతోంది. రోజూ 11 వేల కేసులు నమోదవుతున్నాయి. వారం క్రితంతో పోలిస్తే పాజిటివ్‌లు 60ు పెరిగాయి. నెల రోజుల్లో ఆస్పత్రుల్లో చేరికలు రెట్టింపయ్యాయి. దీంతో ఒలింపిక్‌ క్రీడలు జరుగుతున్న రాజధాని నగ రం టోక్యో, సైటామా, చిబా, కనగావా, ఒసాకా, ఒకినావాల్లో ప్రభుత్వం ఆగస్టు నెల మొత్తం ఎమర్జెన్సీ విధించింది. మరో 5 చోట్ల ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అత్యవసరం కాని ప్రయాణాలను రద్దు చేసుకోవాలని సూచించింది. వేసవి సెలవుల్లో స్వస్థలాలకు వచ్చే విషయంలో ఆలోచించి నిర్ణ యం తీసుకోవాలని కోరింది. కాగా, టోక్యోలో జూలై 8 నుంచే ఎమర్జెన్సీ అమల్లో ఉంది. తాజాగా దానిని పొడిగించారు. వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తోందని, జాగ్రత్తగా ఉండాలని ప్రధాని యోషిహిడె సుగా ప్రజలను హెచ్చరించారు. టోక్యోలో రోజుకు 3 వేల వరకు పాజిటివ్‌లు వస్తున్నాయి. అయితే, దీనికి ఒలింపిక్స్‌ క్రీడలు ఏమాత్రం కారణం కాదని ప్రధాని ప్రకటించారు. ఇంట్లోంచే క్రీడలను చూడాలని అభ్యర్థించారు.


‘సీరం’ చైర్మన్‌ సైరస్‌ పూనావాలాకు లోకమాన్య తిలక్‌ జాతీయ అవార్డు 

ప్రఖ్యాత టీకా ఉత్పత్తి సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) చైర్మన్‌ సైరస్‌ పూనావాలాకు 2021 సంవత్సరానికిగానూ ప్రతిష్ఠాత్మక లోనమాన్య తిలక్‌ జాతీయ అవార్డును ప్రకటించారు. కొవిడ్‌ సంక్షోభ తరుణంలో కొవిషీల్డ్‌ టీకాను వేగవంతంగా ఉత్పత్తి చేసి ఎంతో మంది ప్రజల ప్రాణాలు రక్షించేందుకు సైరస్‌ చేసిన కృషికి ఈ అవార్డును ప్రకటించినట్లు లోకమాన్య తిలక్‌ ట్రస్టు అధ్యక్షుడు దీపక్‌ తిలక్‌ తెలిపారు. ఆగస్టు 13న నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డు జ్ఞాపిక, రూ.లక్ష నగదు పారితోషికాన్ని సైర్‌సకు ప్రదానం చేస్తామన్నారు.

Updated Date - 2021-08-01T07:15:16+05:30 IST