పెరిగిన మిర్చి.. తగ్గిన కంది!

ABN , First Publish Date - 2021-10-23T07:18:22+05:30 IST

జిల్లాలో ఖరీఫ్‌ సాగు సమయం ముగిసింది. సాధారణ విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి.

పెరిగిన మిర్చి.. తగ్గిన కంది!
బల్లికురవ ప్రాంతంలో సాగులో ఉన్న మిర్చి

ముగిసిన ఖరీఫ్‌ సీజన్‌ 

సాధారణ విస్తీర్ణంలో పంటల సాగు

ఒంగోలు, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఖరీఫ్‌ సాగు సమయం ముగిసింది. సాధారణ విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. అయితే ఈసారి పలు మార్పులు జరిగాయి. కీలక ఖరీఫ్‌ మెట్ట పంటలైన కంది విస్తీర్ణం తగ్గిపోగా మిర్చి భారీగా పెరిగింది. అదేసమయంలో పత్తి, వరి సాధారణ విస్తీర్ణంలోనే వేశారు.  సీజన్‌ మొత్తంగా వర్షపాతం నమోదు సాధారణంగానే ఉన్నప్పటికీ క్రమపద్ధతిలో కురవక పంటల సాగు గతితప్పింది. జిల్లాలో జూన్‌ నుంచి సెప్టెంబరు ఆఖరు వరకు వరి మినహా ఇతర పంటల సాగును ఖరీఫ్‌ సీజన్‌గా లెక్కిస్తారు. ఒక్క వరిని మాత్రం అక్టోబరు 15 వరకు సాగు చేసే విస్తీర్ణాన్ని కూడా ఖరీఫ్‌ కిందనే పరిగణిస్తారు.  


గతితప్పిన పంటల సాగు

ఈ ఏడాది తొలకరి పంటలతోపాటు కంది సాగు గణనీయంగా తగ్గిపోయింది. అయితే తొలకరితోపాటు సెప్టెం బరులో వర్షాలు సరిలేక పోవడంతో పంటల సాగు గతితప్పింది. సాధారణంగా జూన్‌లో కురిసే జల్లులతో సజ్జ, నువ్వు, పెసర వంటి తొలకరి పైర్లు.. జూలైలో కురిసే వర్షాలతో పత్తి, కంది విస్తారంగా సాగుచేస్తారు. అయితే జూలై రెండోపక్షం వరకు వర్షాభావ వాతావరణమే కొనసాగింది. తీరా జూలై ఆఖరులో కురిసిన వర్షాలతో పంటల సాగుకు సిద్ధమైన రైతు లకు ఆగస్టులో సాధారణ వర్షం మాత్రమే కురవడంతోపాటు సెప్టెంబరులో లోటు వర్షపాతంతో పంటల సాగు తీరు మారిపోయింది. మొత్తంగా కీలకమైన తొలకరి పంటలతోపాటు కంది సాగు తగ్గిపోగా మెట్టరైతులు ఎక్కువమంది మిర్చి వైపు దృష్టిసారించడంతో దాని విస్తీర్ణం పెరిగింది. 


ఎండుముఖం పట్టిన పంటలు

ఈసారి  ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణంలో వరి సాగు జరిగింది. కాగా ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న వాతావరణ పరిస్థితులతో ఖరీఫ్‌లో సాగు చేసిన పలురకాల ఖరీఫ్‌ పంటలు ఎండు ముఖం పట్టి రైతులు ఆందోళన చెందు తున్నారు. 

మొత్తం ఖరీఫ్‌ సాధారణ 

సాగు విస్తీర్ణం : 5,25,003 ఎకరాలు

ఈ సీజన్‌లో సాగైన విస్తీర్ణం: 5,19,546 ఎకరాలు

గతేడాది సాగైన విస్తీర్ణం: 5,02,082 ఎకరాలు 


Updated Date - 2021-10-23T07:18:22+05:30 IST