పెరిగిన భూగర్భ జలాలు

ABN , First Publish Date - 2021-10-09T06:54:45+05:30 IST

మెట్ట ప్రాంతం కరువు తీరింది. నిత్యం సాగు, తాగునీటి కోసం ఎదురు చూసే రాజన్న సిరిసిల్ల జిల్లా జలకళను సంతరించుకుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో గోదావరి జలాలు, మండుటెండలోనూ పరవళ్లు తొక్కాయి.

పెరిగిన భూగర్భ జలాలు
శ్రీ రాజరాజేశ్వర మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌

  - 1.18 మీటర్లు పైకి 

- 2.80 మీటర్లలోనే నీళ్లు 

- నీటిహబ్‌గా మారిన మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌ 

- మండు టెండలోనే మత్తడి దూకిన ఎగువ మానేరు 

- జిల్లాలో 1406.6 మిల్లీమీటర్ల వర్షం నమోదు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

మెట్ట ప్రాంతం కరువు తీరింది. నిత్యం సాగు, తాగునీటి కోసం ఎదురు చూసే రాజన్న సిరిసిల్ల జిల్లా  జలకళను సంతరించుకుంది.  కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో గోదావరి జలాలు, మండుటెండలోనూ పరవళ్లు తొక్కాయి. శ్రీ రాజరాజేశ్వర మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌తో జిల్లా నీటి హబ్‌గా మారింది. మరోవైపు భారీ వర్షాలు, గోదావరి జలాలతో భూగర్భ జలాలు పెరిగాయి. దేశంలోనే భూగర్భజలాలు పెరిగిన జిల్లాగా గుర్తింపును పొందింది. ప్రస్తుతం జిల్లాలో 1.18 మీటర్లపైకి నీళ్లు చేరాయి. గత సంవత్సరం సెప్టెంబరులో 3.98లో ఉంటే ప్రస్తుతం 2.80 మీటర్లకు చేరుకుంది. చందుర్తి మండలంలో  0.90 మీటర్ల లోపల నీళ్లు ఉన్నాయి. జిల్లాలో భూగర్భ జలాలు భారీగా పెరగడానికి తోడు    666 చెరువుల్లోకి నీరు చేరి నిండుకుండను తలపిస్తున్నాయి. భారీ వర్షాలపై అధారపడిన నర్మాల ఎగువమానేరు ప్రాజెక్ట్‌ను మండుటెండలో గోదావరి జలాలతో నింపి మత్తడి దూకించారు. దీని ద్వారా చెరువులను నింపారు. ఎల్లంపల్లి ద్వారా వేములవాడ నియోజకవర్గంలోకి సిరిసిల్ల మిడ్‌ మానేరు ద్వారా కాళేశ్వరం జలాల రాకతో జల దృశ్యం ఆవిష్కృతమైంది. దీనికి అనుసంధానంగా మల్కపేట రిజర్వాయర్‌ పనులు చివరి దశకు చేరుకున్నాయి.   అన్నపూర్ణ అనంతారం ప్రాజెక్ట్‌ ద్వారా రంగనాయక సాగర్‌, మల్లన్నసాగర్‌, కొండ పోచమ్మసాగర్‌ వరకు నీటిని తీసుకెళ్లారు. సిరిసిల్ల ఇప్పుడు కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కూడలిగా మారింది. మరోవైపు భారీ వర్షాలకు జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 89 శాతం అదనంగా నమోదైంది. జిల్లాలో ప్రస్తుతం  సాధారణ వర్షం 743.4 మిల్లీమీటర్లు ఉండగా 1406.6 మిల్లీమీటర్లు కురిసింది. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ అధిక వర్షపాతం నమోదైంది. 

 పెరిగిన సాగు విస్తీర్ణం 

కాళేశ్వరం జలాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో   సాగు విస్తీర్ణం పెరిగింది. వానాకాలంలో 30 వేల ఎకరాల్లో అదనంగా పంటలు వేశారు.  జిల్లాలో 2.41 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా వరి 1.65 లక్షల ఎకరాలు, పత్తి 69,225 ఎకరాలు, ఇతర పంటలు 7357 ఎకరాల్లో వేశారు. మరోవైపు వర్షాలు సమృద్ధిగా కురవడం,  భూగర్భ జలాలు అందుబాటులోకి రావడం వంటివి ఉన్న యాసంగిలో పంట మార్పిడి చేయాలని ప్రభుత్వ నిర్ణయించడం రైతులను అయోమయానికి గురి చేస్తోంది. ఇందుకోసం అవగాహన సమావేశాలు కూడా నిర్వహించారు.




Updated Date - 2021-10-09T06:54:45+05:30 IST