చైనా నుంచి చీపురుపుల్ల కూడా అక్కర్లేదు: గడ్కరీ

ABN , First Publish Date - 2020-12-01T04:41:30+05:30 IST

పొరుగు దేశం చైనా నుంచి మనదేశంలోకి ఏ ఒక్కటీ దిగుమతి చేసుకోవాల్సిన అవసరమే లేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ..

చైనా నుంచి చీపురుపుల్ల కూడా అక్కర్లేదు: గడ్కరీ

న్యూఢిల్లీ: పొరుగు దేశం చైనా నుంచి మనదేశంలోకి ఏ ఒక్కటీ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. భారత్‌లోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలు ఎగుమతి చేసే శక్తిని పెంచుకోవడమే కాకుండా దేశం సాధికారత సాధించేలా తోడ్పడుతున్నాయని ఆయన కొనియాడారు. ‘‘ఆటో మొబైల్ రంగంతో పాటు అనేక రంగాల్లో ప్రస్తుతం వ్యవసాయం, ఆటోమొబైల్స్ సహా ప్రతి దానికి మనకు పరిష్కారాలు దొరికాయి. కాబట్టి మనం ఇప్పుడు చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు..’’ అని మంత్రి పేర్కొన్నారు. దిగుమతి చేసుకోవడానికి బదులు భారత్ ఇప్పుడు లెక్కకుమిక్కిలి వస్తువులు విదేశాలకు ఎగుమతి చేస్తోందని ఆయన అన్నారు.


‘‘కాబట్టి చైనా సహా ఇతర విషయాల గురించి నేను ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదు. ఎందుకంటే ప్రతి దేశానికి సొంతగా కొన్ని విధానాలు ఉంటాయి. కానీ భారత విధానాల విషయానికి వస్తే.. మనం టెక్నాలజీని వాడుకుంటూ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడమే కాకుండా మరింత నాణ్యమైన వస్తువులు ఉత్పత్తి చేస్తున్నాం. భారత దేశంలో అందుబాటులో ఉన్న యువశక్తే మనకున్న గొప్ప బలం...’’ అని గడ్కరీ పేర్కొన్నారు.అదే సమయంలో దేశంలోని ఐఐటీలు, ఇంజినీరింగ్ కాలేజీలు, పరిశోధనా కేంద్రాలు అనేక ఆవిష్కరణలు చేస్తున్నాయనీ... తద్వారా ప్రపంచం మొత్తానికి అవసరమైనవన్నీ భారత్ అందించగలదన్న విశ్వాసం మరింత పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగానే చాలా దేశాలు ఇప్పుడు చైనాతో ఒప్పందాలు చేసుకునేదానికంటే భారత్‌తో జతకలిసేందుకే మొగ్గుచూపుతున్నాయన్నారు. 

Updated Date - 2020-12-01T04:41:30+05:30 IST