భారత దేశ మ్యాప్‌ను తప్పుగా చూపిస్తున్న డబ్ల్యూహెచ్ఓపై అసంతృప్తి!

ABN , First Publish Date - 2021-01-14T19:42:45+05:30 IST

భారత దేశ మ్యాప్‌ను తప్పుగా చూపిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

భారత దేశ మ్యాప్‌ను తప్పుగా చూపిస్తున్న డబ్ల్యూహెచ్ఓపై అసంతృప్తి!

న్యూఢిల్లీ : భారత దేశ మ్యాప్‌ను తప్పుగా చూపిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)పై భారత ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. డబ్ల్యూహెచ్ఓ వెబ్ పోర్టల్స్‌లో భారత దేశ సరిహద్దులను తప్పుగా చూపిస్తుండటం సరైనది కాదని, దీనిని వెంటనే సరిదిద్దాలని కోరింది. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసుస్ కరోనా వైరస్ విషయంలో చైనాకు అనుకూలంగా వ్యవహరించారని అమెరికా ఆరోపిస్తున్న నేపథ్యంలో మన దేశ మ్యాప్‌ను మార్చి చూపించడం గమనార్హం. 


సక్రమమైన భారత దేశ మ్యాప్‌ను వెబ్ పోర్టల్స్‌లో పెట్టాలని, తప్పులను సరిదిద్దాలని కోరుతూ డబ్ల్యూహెచ్ఓకు గత ఏడాది డిసెంబరు 30, ఈ ఏడాది జనవరి 3, 8 తేదీల్లో భారత ప్రభుత్వం లేఖలు రాసినట్లు జాతీయ మీడియా తెలిపింది. ఐక్య రాజ్య సమితికి భారత దేశ శాశ్వత ప్రతినిధి ఇంద్ర మణి పాండే ఈ విషయాన్ని టెడ్రోస్ అధనోమ్ వద్ద లేవనెత్తినట్లు పేర్కొంది. 


ఈ నెల 8న డబ్ల్యూహెచ్ఓకు ఇంద్రమణి పాండే రాసిన లేఖలో, డబ్ల్యూహెచ్ఓకు చెందిన వివిధ వెబ్ పోర్టల్స్‌లో భారత దేశ మ్యాప్‌లలో భారత దేశ సరిహద్దులను తప్పుగా చూపడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి తప్పులను ఎత్తి చూపుతూ గతంలో రాసిన లేఖలను ప్రస్తావించారు. ఈ మ్యాప్‌లను తొలగించడం కోసం తక్షణమే జోక్యం చేసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసుస్‌‌ను కోరారు. 


డబ్ల్యూహెచ్ఒకు చెందిన వివిధ వెబ్ పోర్టల్స్‌లో జమ్మూ-కశ్మీరు, లడఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాలను భారత దేశంలోని మిగిలిన ప్రాంతాల కన్నా భిన్నమైన రంగులో చూపించారు. 1963లో చైనాకు పాకిస్థాన్ చట్టవిరుద్ధంగా ఇచ్చిన 5,168  చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని షక్స్‌గం వ్యాలీని చైనాలో భాగంగా చూపించారు. 1954లో చైనా ఆక్రమించుకున్న ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని లేత నీలం రంగు గళ్లలో చూపించారు. చైనా భూభాగాన్ని చూపించడానికి ఉపయోగించిన రంగు కూడా ఇదే కావడం గమనార్హం. 


కోవిడ్-19 ట్రాకర్ కోసం తప్పుడు భారత దేశ మ్యాపును వాడటం దురదృష్టకరమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సరైన మ్యాపులనే వాడే విధంగా చర్యలు తీసుకోవడానికి డబ్ల్యూహెచ్ఓ, తదితర వ్యవస్థలతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుందని తెలిపాయి. మ్యాపులను సరిదిద్దడంలో రాజకీయాల జోక్యాన్ని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసుస్‌ అనుమతించబోరని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాయి. 


Updated Date - 2021-01-14T19:42:45+05:30 IST