అప్పుడే కరోనా అంతం : డాక్టర్ హర్షవర్ధన్
ABN , First Publish Date - 2021-05-21T01:41:22+05:30 IST
కరోనా మహమ్మారి అంతం కావాలంటే మరిన్ని కోవిడ్ వ్యాక్సిన్లను అభివృద్ధి పరచాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి అంతం కావాలంటే మరిన్ని కోవిడ్ వ్యాక్సిన్లను అభివృద్ధి పరచాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు. ఆ వ్యాక్సిన్ల సమర్థత పరీక్షించిన తర్వాత ప్రపంచం మొత్తానికి వాటిని అతి వేగంగా పంపిణీ చేయాలని పేర్కొన్నారు. ఆరోగ్య శాఖా మంత్రుల 33 వ కామన్ వెల్త్ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. కరోనా అంతానికి డబ్ల్యూహెచ్‌వో సారథ్యంలో అన్ని దేశాలూ క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. వ్యాక్సిన్ ఉత్పత్తికి, అభివృద్ధికి, అందరికీ అందుబాటులోకి రావడానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2021 నాటికి 2 బిలియన్ల వ్యాక్సిన్లను ఉత్పత్తి లక్ష్యంగా ‘కోవ్యాక్స్’ ముందుకు సాగుతోందని తెలిపారు. అందరికీ ఆరోగ్యం అందించాలన్న లక్ష్యంతోనే భారత్ అడుగులు వేస్తోందని, ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కింద ఈ దిశగా వెళ్తున్నామని ఆయన తెలిపారు. జాతీయ టెలిమెడిసిన్ ప్లాట్‌ఫాం ‘ఈ సంజీవని ఓపీడీ’ కింద 14 నెలల స్వల్ప వ్యవధిలో 5 మిలియన్లకు పైగా సంప్రదింపులకు వీలు కల్పించినట్లు తెలిపారు. ‘వసుదైవ కుటుంబకం’ అన్న సూత్రాన్ని తాము శతధా విశ్వసిస్తున్నామని, అందుకే ‘వ్యాక్సిన్ మైత్రి’ కింద ఇతర దేశాలకు వ్యాక్సిన్లను పంపామని హర్షవర్ధన్ ప్రకటించారు.