రెండంకెల వృద్ధి దిశగా భారత్ : నీతీ ఆయోగ్ వీసీ

ABN , First Publish Date - 2021-07-11T20:35:54+05:30 IST

భారత దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల

రెండంకెల వృద్ధి దిశగా భారత్ : నీతీ ఆయోగ్ వీసీ

న్యూఢిల్లీ : భారత దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి రేటును నమోదు చేస్తుందని, పెట్టుబడుల ఉపసంహరణ వాతావరణం కూడా బాగుందని నీతీ ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ చెప్పారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి ఇబ్బందులను మనం అధిగమిస్తున్నామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో అర్ధ భాగంలోకి ప్రవేశించామని, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని చెప్పారు. 


ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా కోలుకుంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ అంచనాలను దిగువకు సవరించిన సంస్థలు ఇక ఎగువకు సవరించవలసి రావచ్చునన్నారు. దీనికి కారణాన్ని వివరిస్తూ, ‘‘ఈ (ఆర్థిక) సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు రెండు అంకెల్లో (డబుల్ డిజిట్) ఉంటుందని నేను అంచనా వేస్తున్నాను’’ అన్నారు. 


2021 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం తగ్గింది. ఎస్&పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ భారత దేశ జీడీపీ వృద్ధి రేటును 11 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించింది. ఫిచ్ రేటింగ్స్ అంతకుముందు జీడీపీ వృద్ధి రేటు 12.8 శాతం అని చెప్పింది, దీనిని తాజాగా సవరించి 10 శాతానికి తగ్గించింది. 


ప్రైవేటు పెట్టుబడులు ఎప్పుడు పుంజుకుంటాయని అడిగినపుడు రాజీవ్ కుమార్ స్పందిస్తూ, ఉక్కు, సిమెంట్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో సామర్థ్య విస్తరణ కోసం చెప్పుకోదగ్గ స్థాయిలో పెట్టుబడులు ఇప్పటికే వస్తున్నాయన్నారు. 


Updated Date - 2021-07-11T20:35:54+05:30 IST