పుంజుకుంటున్నాం... పెట్టుబడులతో రండి.. స్వాగతం : మోదీ

ABN , First Publish Date - 2020-07-09T21:53:00+05:30 IST

భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్‌లో

పుంజుకుంటున్నాం... పెట్టుబడులతో రండి.. స్వాగతం : మోదీ

న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ‘‘ఇండియా గ్లోబల్ వీక్-2020’’ ని పురస్కరించుకొని ఆయన ప్రసంగించారు.


‘‘భారత దేశంలో పెట్టుబడులు పెట్టి, తమ ఉనికిని చాటుకోడానికి గ్లోబల్ కంపెనీలకు రెడ్ కార్పెట్‌ పరుస్తూ స్వాగతం పలుకుతున్నాం. ఈ రోజు భారతదేశం అందించే ఈ అవకాశాలను చాలా కొద్ది దేశాలు మాత్రమే అందిస్తాయి. రక్షణ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టడానికి పుష్కలంగా అవకాశాలున్నాయి. అంతరిక్ష రంగంలోనూ ప్రైవేట్ పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు అవకాశాలు వచ్చాయి.’’ అని ఆయన పేర్కొన్నారు.


ఈ కాలంలో పునరుజ్జీవనం గురించి మాట్లాడటం అత్యంత సహజమని, ప్రపంచ పునరుజ్జీవంతో పాటు భారత దేశ పునరుజ్జీవాన్ని అనుసంధానించడం కూడా సహజ ధోరణే అని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడంలో భారత పాత్రం చాలా ప్రముఖమైందని ఆయన స్పష్టం చేశారు. భారతదేశానికి చెందిన టెకీలు కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచానికి మార్గం చూపిస్తూనే ఉన్నారని, అలాంటి వారిని ఎవరు, ఎలా మరిచిపోగలరని ప్రశంసించారు.


భారత్ విజ్ఞానానికి అధికార కేంద్రమని, తమ విజ్ఞానాన్ని ప్రపంచానికి పంచేందుకు సదా సిద్ధంగానే ఉందని ఆయన ప్రకటించారు. భారతీయలు సహజ సంస్కర్తలని, సాంఘికంగా గానీ, ఆర్థికంగా గానీ వచ్చే సవాళ్లను అధిగమించిన చరిత్ర తమకుందని ఆయన ప్రకటించారు. భారత్ ఓ పక్క కరోనా మహమ్మారితో పోరాడుతూనే... మరోపక్క ప్రజల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెడుతోందని, ఆరోగ్యం, ఆర్థికం రెండింటీపై ఫోకస్ పెట్టామని మోదీ  తెలిపారు. 

Updated Date - 2020-07-09T21:53:00+05:30 IST