లడఖ్‌లో సొరంగాల సంరక్షణకు భారత సైన్యం ప్రత్యేక చర్యలు

ABN , First Publish Date - 2020-11-22T21:52:32+05:30 IST

చైనా దురాగతాల నుంచి లడఖ్‌లోని సొరంగాలను కాపాడేందుకు

లడఖ్‌లో సొరంగాల సంరక్షణకు భారత సైన్యం ప్రత్యేక చర్యలు

న్యూఢిల్లీ : చైనా దురాగతాల నుంచి లడఖ్‌లోని సొరంగాలను కాపాడేందుకు భారత సైన్యం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. శత్రువు అతిక్రమణలను నిరోధించడంలో భాగంగా సొరంగాల సంరక్షణ చర్యలు చేపట్టింది. రెండో చైనా-జపాన్ యుద్ధంలో చైనా ఇటువంటి చర్యలను అమలు చేసింది. లాసా ఎయిర్ బేస్‌లో విమానాలను రక్షించేందుకు సొరంగాలను చైనా నిర్మించింది. దక్షిణ చైనా సముద్రంలో హైనన్ దీవుల్లో న్యూక్లియర్ మిసైల్ బాలిస్టిక్ సబ్‌మెరైన్లను ఉంచేందుకు భూగర్భంలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది. తాజాగా భారత్ కూడా అదే విధంగా భద్రత కల్పిస్తోంది. 


భారత సైనిక కమాండర్లు తెలిపిన సమాచారం ప్రకారం, భారీ వ్యాసంగల హ్యూమ్ రీఇన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్ పైపులను సొరంగాల్లో పెట్టారు. శత్రు దాడుల నుంచి దళాలను కాపాడుకోవడానికి ఇవి దోహదపడతాయి. ఈ కాంక్రీట్ పైపుల వ్యాసం 6 నుంచి 8 అడుగులు ఉంటుంది. కాబట్టి దళాలు సులువుగా ఒక చోటు నుంచి మరొక చోటుకు ప్రయాణించగలవు. శత్రువు నుంచి కాల్పులకు గురికాకుండా ఈ సొరంగాల్లో ప్రయాణించవచ్చు. ఈ సొరంగాల ద్వారా చలి, మంచు నుంచి కూడా దళాలను కాపాడవచ్చు. 


ఇదిలావుండగా, భారత్-చైనా మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకు 9వ రౌండ్ చర్చలు త్వరలో జరిగే అవకాశం ఉంది. దళాల ఉపసంహరణ మొదట ప్రారంభించవలసినది చైనాయేనని భారత దేశం సుస్పష్టంగా ఉంది. ఈ ఏడాది మేలో పాంగాంగ్ సో సరస్సు తీరంలో అతిక్రమణలకు పాల్పడినది చైనాయేనని, కాబట్టి దళాల ఉపసంహరణ చైనాతోనే ప్రారంభం కావాలని అంటోంది. 


Updated Date - 2020-11-22T21:52:32+05:30 IST