Abn logo
Oct 12 2021 @ 20:53PM

Railways: ఆ మరకల క్లీనింగ్‌కి ఏటా రూ.12 వందల కోట్లు

న్యూఢిల్లీ: రైల్వే స్టేషన్లలో పరిశుభ్రతకు భారతీయ రైల్వే ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఇటీవల ఈ విషయంలో మరింత దృష్టిసారించిన రైల్వే స్టేషన్లను అద్దంలా ఉంచుతోంది. అయితే, ఎంత శుభ్రం చేస్తున్నా కొన్ని ‘మరక’లను మాత్రం వదిలించుకోలేకపోతోంది. అవే గుట్కా మరకలు.


గుట్కాలు తిని స్టేషన్లలో ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేయద్దని ప్రచారం చేస్తున్నా కొందరు ప్రయాణికులు ఆ మాటలు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్లగలం కానీ, దానితో నీళ్లు తాగించగలమా? అన్న సామెతను ఈ సందర్భంగా రైల్వే గుర్తు చేసుకుంటోంది. 

మతిపోయే విషయం ఏమిటంటే.. స్టేషన్ పరిసరాల్లో గుట్కా, పాన్ మరకలను వదిలించేందుకు రైల్వే సాలీనా రూ. 1200 కోట్లు ఖర్చుచేస్తోంది. నిజానికి రైల్వే పరిసరాల్లో చెత్త వేయడం, ఉమ్మివేయడం, రైలు ప్లాట్‌ఫామ్‌పై ఆగి ఉన్నప్పుడు టాయిలెట్‌ను ఉపయోగించడం వంటి వాటికి రైల్వే అధికారులు రూ. 500 జరిమానా విధిస్తున్నారు. 


ఈ మరకలను వదిలించుకోలేకపోతున్న రైల్వే ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఈజీ స్పిట్’ పేరుతో పశ్చిమ, ఉత్తర, మధ్య రైల్వేల్లో జేబు సంచుల్లాంటి వాటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవి పునర్వినియోగ, బయోడీగ్రేడబుల్ స్పిటూన్స్. వీటిని పారవేసినప్పుడు అందులోని విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా పెరుగుతాయి. ఒక్కో సంచి ధరను రూ. 5, రూ. 10గా నిర్ణయించారు. ప్రస్తుతం 42 స్టేషన్లలో వీటి కోసం కియోస్క్‌లు ఏర్పాటు చేశారు.  


ఈ ‘ఈజీస్పిట్’ సంచులను జేబులో పెట్టుకుని తీసుకెళ్లొచ్చు. వారు కావాలనుకున్నప్పుడు ఆ సంచులను తీసి వాటిలో ఉమ్మివేసుకోవచ్చు. రైలు ప్లాట్‌ఫామ్ దాటిన తర్వాత వాటిని విసిరేయవచ్చు.    స్థూలకణ గుజ్జు సాంకేతికతను ఉపయోగించి ఈ సంచులను తయారుచేశారు.


సంచుల తయారీకి వాడిన మెటీరియల్ లాలాజలంలో ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లను లాక్‌చేసేస్తుంది. వివిధ పరిమాణాల్లో తయారుచేసిన ఈ సంచులను 15 నుంచి 20 సార్లు ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఉమ్మివేసిన వెంటనే అది ఘన పదార్థంగా మారిపోతుంది.


వాడకం పూర్తయి పారేసిన తర్వాత అది మట్టిలో కలిసిపోతుంది. ఆ తర్వాత అందులోని విత్తనాలు మొలకెత్తుతాయి. రైల్వే ఆలోచన ఆద్భుతంగా ఉన్నా.. ఉమ్మివేయడానికి డబ్బులిచ్చి సంచులు కొట్టారా? అన్నదే అసలు ప్రశ్న.

ప్రత్యేకంమరిన్ని...

క్రైమ్ మరిన్ని...