ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులు... రాష్ట్రాలకు మోదీ సరికొత్త సలహా...

ABN , First Publish Date - 2022-02-26T21:40:33+05:30 IST

రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్‌లో పెద్ద ఎత్తున విద్యార్థులు చిక్కుకున్న

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులు... రాష్ట్రాలకు మోదీ సరికొత్త సలహా...

న్యూఢిల్లీ : రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్‌లో పెద్ద ఎత్తున విద్యార్థులు చిక్కుకున్న విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వైద్య విద్యను ప్రోత్సహించేందుకు విధానాలను రూపొందించాలని పిలుపునిచ్చారు. వైద్య, ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు పెద్ద నగరాలకు మాత్రమే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే విధంగా పరిపూర్ణ వ్యవస్థను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. 


దేశంలో వైద్య,  ఆరోగ్య రంగాన్ని పటిష్టపరిచే లక్ష్యంలో భాగంగా కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించిన వెబినార్‌లో మోదీ మాట్లాడుతూ, ‘వన్ ఇండియా, వన్ హెల్త్’  (ఒక భారత దేశం, ఒకే రకమైన ఆరోగ్య సదుపాయాలు) స్ఫూర్తితో పరిపూర్ణ ఆరోగ్య మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.  పెద్ద నగరాలకు వెలుపల ఆరోగ్య సంరక్షణ సంబంధిత మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని తన ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. జిల్లా, బ్లాక్ స్థాయిలో గ్రామాలకు సైతం అత్యవసర ఆరోగ్య సదుపాయాలను చేరువ చేయడమే ఈ పథకం లక్ష్యమని చెప్పారు. వీటి నిర్వహణ, ఆధునికీకరణలో ప్రైవేటు రంగం కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. 


ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవలసిన అవసరం ఉందని, దీనివల్ల మౌలిక సదుపాయాల రంగంలో విప్లవం వస్తుందని చెప్పారు. కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా స్వస్థతకు కూడా తన ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. బడ్జెట్‌లో మూడు అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. ఆధునిక మౌలిక సదుపాయాలు, మానవ వనరుల విస్తరణ, పరిశోధనను ప్రోత్సహించడం, ఆధునిక, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీని వాడుకోవడంపై దృష్టి పెట్టామన్నారు. 


రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్‌లో పెద్ద ఎత్తున విద్యార్థులు చిక్కుకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వైద్య విద్యను ప్రోత్సహించేందుకు విధానాలను రూపొందించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ డిమాండ్‌ను సైతం తీర్చే స్థాయిలో రానున్న సంవత్సరాల్లో వైద్యులను, పారామెడిక్స్‌ను సిద్ధం చేయడానికి తగిన పథకాలకు రూపకల్పన చేయాలన్నారు. వైద్య కళాశాలల ఏర్పాటు కోసం భూములను కేటాయించాలన్నారు. నేడు మన పిల్లలు చదువుకోవడం కోసం, మరీ ముఖ్యంగా వైద్య విద్యను అభ్యసించేందుకు, చిన్న దేశాలకు వెళ్తున్నారన్నారు. అక్కడ భాషా సమస్య ఉందని, అయినప్పటికీ వెళ్తున్నారని చెప్పారు. ఈ రంగంలోకి ప్రైవేటు రంగం భారీ స్థాయిలో ప్రవేశించడం సాధ్యం కాదా? అని అడిగారు. భూ కేటాయింపుల కోసం మంచి విధానాలను రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించడం సాధ్యం కాదా? అన్నారు. 


Updated Date - 2022-02-26T21:40:33+05:30 IST