Abn logo
Sep 25 2020 @ 00:57AM

ప్రభావశాలురు

అమెరికా నుంచి వెలువడే అంతర్జాతీయ వార్తావారపత్రిక ‘టైమ్’ ప్రపంచ వ్యాప్తంగా ప్రభావశీలురుగా ఉన్న వందమందిని ఈ ఏడాది కూడా ప్రకటించింది. దశాబ్దకాలంగా ‘టైమ్’ ఈ ఎంపిక చేస్తున్నది. ఈ సంవత్సరం ఎంపికైన 100 మందిలో ఐదుగురు భారతీయులు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు ఢిల్లీ షహీన్‌బాగ్ ఆందోళనకు ప్రతీకగా మారిన బిల్కిస్ బానో కూడా ఈ అయిదుగురిలో ఉండడం సంచలనం కలిగిస్తున్నది. 82 సంవత్సరాల బిల్కిస్ బానో పౌరసత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన ఆందోళనలో ప్రతిరోజూ క్రమం తప్పకుండా పాల్గొని స్థానికులకు, విద్యార్థి నాయకులకు, సందర్శకులకు స్ఫూర్తిదాతగా నిలబడ్డారు. సినీనటుడు ఆయుష్మాన్ ఖురానా; హెచ్ఐవి, ఎయిడ్స్ చికిత్స పరిశోధనలో కృషి చేసిన జీవశాస్త్రవేత్త డాక్టర్ రవీంద్ర గుప్తా; గూగుల్ సిఇవో సుందర్ పిచాయ్ కూడా ‘టైమ్’ జాబితాలో ఉన్నారు. రవీంద్ర గుప్తా, సుందర్ పిచాయ్ ఇద్దరూ భారతీయ సంతతికి చెంది, విదేశాలలో పనిచేస్తున్నవారు. వీరిని ప్రభావశాలురుగా ప్రకటించడమే కాకుండా, ఎందుకు వారు ప్రభావశాలురుగా ఎంపికయ్యారో కూడా వివరించే వ్యాసాలను కూడా ‘టైమ్’ ప్రచురించింది.


నరేంద్రమోదీ ‘టైమ్’ ప్రభావశాలుర జాబితాలో ఎంపిక కావడం ఇది మొదటిసారి కాదు. 2014లో, 2015లో, 2017లో కూడా ఆయన ఆ జాబితాలోకి ఎక్కారు. 2015లో మోదీ ఎంపికయినప్పుడు, అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మోదీపై వ్యాసం రాశారు. ‘టైమ్’ జాబితా అల్లాటప్పా జాబితా కాదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్; డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులు జో బిడెన్, కమలా హారిస్; కరోనా సందర్భంగా ప్రఖ్యాతి పొందిన అమెరికా ఆరోగ్యరంగ నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫాసి; జర్మనీ అధ్యక్షురాలు ఎంజెలా మెర్కెల్ వంటి మహామహులు ఈ ఏటి జాబితాలో ఉన్నారు. ఇంతటి ప్రఖ్యాతులు కొలువుతీరిన జాబితాలో తమకు కంటగింపుగా ఉండిన పౌరసత్వ చట్ట వ్యతిరేక ఉద్యమ ప్రతినిధిని చేర్చడం, భారత ప్రధాని గురించిన వ్యాసంలో అప్రియమైన వ్యాఖ్యలు చేయడం భారత ప్రభుత్వ పెద్దలకు, జాతీయ అధికారపక్ష నేతలకు అభ్యంతరకరంగా ఉన్నది. ‘టైమ్’ పత్రికను బహిష్కరించాలన్న నినాదాలు అక్కడక్కడ సామాజిక మాధ్యమాలలో మొదలయ్యాయి. 


పోయిన సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన ఆగ్నేయ ఢిల్లీలో, నోయిడాకు వెళ్లే దారిలో ఒక అర కిలోమీటర్ మేర ఉన్న కాళిందికుండ్ రోడ్‌ను పదిహేను ఇరవై మంది మహిళలు ఆక్రమించుకుని ధర్నా మొదలుపెట్టారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థులపై పోలీసుల దాష్టీకానికి నిరసనగా మహిళల నిరసన మొదలయింది. ఆ నిరసన శిబిరమే అతి కొద్దిరోజులలోనే పెద్ద ఉద్యమకేంద్రం షహీన్‌బాగ్‌గా మారింది. ఆ నిరసనకు బిల్కిస్ బానో ముఖచిత్రంగా మారారు. స్వాతంత్ర్యానికి పూర్వం జన్మించి, ఎంతో జీవితాన్ని చూసిన అనుభవం, ముఖం ముడుతలుదేరినా కాంతి తగ్గని వర్చస్సు, అభిప్రాయాలను కథలుగా, ఆసక్తికరంగా చెప్పగలిగిన నేర్పు బిల్కిస్ బానో సొంతం. ‘‘ఈ దేశం మాది. మేం ఇక్కడే పుట్టాము. నా దగ్గర అన్ని పత్రాలు ఉన్నాయి, కానీ, నేను పోరాడుతున్నది ఏ కాయితాలూ లేకుండా ఈ దేశంలో చిరకాలంగా ఉంటున్న వారి గురించి’’ అని ఆమె చెబుతున్నప్పుడు ఆమె చేతిలో మువ్వన్నెల జెండా ఒక నైతిక ఆయుధంగా భాసిల్లింది. భారత రాజ్యాంగం షహీన్‌బాగ్ శిబిరంలో తరచు స్మరించుకునే, ఉటంకించే పవిత్రగ్రంథమైంది. జామియా మిలియా విశ్వవిద్యాలయం విద్యార్థులపైన, జెఎన్‌యు విద్యార్థి నాయకులపైన ‘ఉపా’ చట్టం ప్రయోగించి, షహీన్‌బాగ్ ఉద్యమాన్ని దేశవ్యతిరేక కార్యకలాపంగా ఢిల్లీ పోలీసులు చిత్రిస్తున్న వేళ, బిల్కిస్ బానోను అంతర్జాతీయ మీడియా గుర్తించడం విశేషం. బానోపై పరిచయ వ్యాసాన్ని, సుప్రసిద్ధ సాహసిక పాత్రికేయురాలు రానా అయ్యూబ్ రాశారు. 


 ప్రధాని మోదీపై వ్యాసాన్ని ‘టైమ్’ పత్రిక ప్రత్యేక సంపాదకుడు కార్ల్ విక్ రాశారు. ‘‘ప్రజాస్వామ్యానికి ఎన్నికలు స్వేచ్ఛగా జరగడం ఒక్కటే కొలమానం కాదు. మహా అయితే, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయని మాత్రమే ఎన్నికలు చెబుతాయి. విజేతలకు ఓటు వేయని వారి హక్కులు అసలు సమస్య. భారతదేశంలో అనేక మతవర్గాల వారు ఉన్నారు. ఒక శరణార్థిగా తన జీవితంలో అధికభాగం భారత్‌లోనే గడిపిన దలైలామా -సామరస్యానికి, సుస్థిరతకు భారతదేశం చిహ్నమని అన్నారు... నరేంద్రమోదీ వచ్చి దీన్నంతా సందేహాస్పదం చేశారు..’’ అని కార్ల్ విక్ వ్యాఖ్యానించారు. మోదీకి చెందిన అధికారపార్టీ బాహుళ్యవాదాన్ని తిరస్కరిస్తూ, ముస్లిములను లక్ష్యంగా పెట్టుకున్నదని, కరోనా వాతావరణాన్ని అడ్డుపెట్టుకుని అసమ్మతిని అణచివేస్తున్నదని కూడా విక్ వ్యాఖ్యానించారు. అంటే, 2014లో, 2015లో ‘టైమ్’ పత్రిక చూసిన నరేంద్ర మోదీకి, ఇప్పుడు 2020లో చూసిన మోదీకి తేడా ఉన్నదన్న మాట. 


భారతదేశంలో ప్రత్యామ్నాయ స్వరాలను, ప్రభావశీలమైన ప్రజా ఉద్యమాలను ఇక్కడి ప్రతిపక్షాలు, మీడియా భయంతోనో, భక్తితోనో పెద్దగా పట్టించుకోకపోయినా, అవి ప్రపంచం దృష్టిలో పడుతూనే ఉన్నాయని తెలిసినప్పుడు కొంత ఊరట కలుగుతుంది. ఏ పార్టీ అయినా, ఏ భావజాలమైనా ప్రజాస్వామ్య వర్తన లేకుండా, ఏకపక్ష, ఆధిపత్య ధోరణులను ప్రదర్శిస్తే, 


ఆ అహంకారానికి అధికారం కూడా తోడయితే, ఆ సమాజంలోని ప్రజలకు నిత్యం నరకమే. ప్రజలందరినీ ఆవేశాలలో, ఉద్వేగాలలో ఉర్రూతలూగిస్తూ, వాటి వెనుక ఒక సామాజిక సాంస్కృతిక నియంతృత్వాన్ని స్థాపించాలనుకునే శక్తుల వల్ల భారతీయ ఆత్మకే చేటు వాటిల్లుతుంది. నూటా ముప్పై కోట్ల మంది, వేర్వేరు మతాలకు, కులాలకు, సంస్కృతులకు, భాషలకు చెందినవారు, ఒక దేశం గొడుగు కింద సామరస్యంగా ఉండగలగడానికి ఏదో ఒక గట్టి పునాది ఉండి ఉండాలి. ఆ పునాదికే ప్రమాదం వాటిల్లినప్పుడు, మొత్తంగా జనజీవనమే అతలాకుతలమవుతుంది. సాంప్రదాయిక విలువలు, ఆధునికంగా సమకూర్చుకున్న విలువలు అన్నీ దెబ్బతింటాయి. 


‘టైమ్’ పత్రిక రాసినదానితో ఏకీభవించవలసిన పనిలేదు. కానీ, ప్రపంచంలో మన దేశం గురించి ఇట్లా అనుకుంటున్నారని తెలియడం అవసరం. మన సమాజం మీద, ప్రభుత్వం మీద, పాలకపక్షాల మీద, ఉద్యమాల మీద ఇతరులు చేసే విమర్శలను తెలుసుకుని, సమీక్షించుకుని, మన ప్రయాణాన్ని దిద్దుకోవడం మేలు చేస్తుంది తప్ప, విమర్శ చేసినవారిని బహిష్కరిస్తే ఉపయోగం లేదు. 

Advertisement
Advertisement
Advertisement