విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యంతో యువకుడికి గాయాలు

ABN , First Publish Date - 2021-01-16T05:57:29+05:30 IST

విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చిత్రియాల్‌ గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.

విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యంతో యువకుడికి గాయాలు
గాయాలతో గౌస్‌మియా

పాపన్నపేట, జనవరి 15: విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చిత్రియాల్‌ గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్రియాల్‌ గ్రామంలో విద్యుత్‌ సమస్య నెలకొనడంతో సర్పంచ్‌ సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చాడు. ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకు వచ్చి తలెత్తిన లోపాలను సరి చేయకుండా.. విద్యుత్‌ శాఖతో ఎలాంటి సంబంధం లేని గౌస్‌మియాతో మరమ్మతులు చేయించేందుకు జూనియర్‌ లైన్‌మెన్‌, ఇతర సిబ్బంది ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కించేందుకు పురమాయించారు. సంబంధిత లైన్‌మెన్‌ సబ్‌స్టేషన్‌ నుంచి గ్రామానికి ఎల్‌సీ తీసుకోవాల్సి ఉంది. కానీ, అజాగ్రతతో వ్యవసాయానికి సంబంధించిన లైన్‌కు ఎల్‌సీ తీసుకున్నాడు. ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కిన గౌస్‌మియా కరెంటు ఉన్న విషయం తెలియక ఓ బోల్టును బిగించడానికి వైరును పట్టుకున్నాడు. షాక్‌కు గురై ట్రాన్స్‌ఫార్మర్‌పైనే ఇరుక్కొని విలవిలలాడుతుండగా.. గ్రామస్థులు గమనించి కర్రలతో వైర్లను కొట్టడంతో కింద పడ్డాడు. కానీ అప్పటికే తీవ్ర గాయాలపాలైన గౌస్‌మియా అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. మెదక్‌ ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు. ఇదిలా ఉండగా చిత్రియాల్‌ గ్రామానికి కరెంటు సరఫరా అయ్యే సబ్‌స్టేషన్‌లో కూడా నిబంధనలకు విరుద్ధంగా మూడు రోజుల క్రితం కొత్త ఆపరేటర్లను నియమించినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 


Updated Date - 2021-01-16T05:57:29+05:30 IST