ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు అన్యాయం

ABN , First Publish Date - 2021-12-01T05:35:36+05:30 IST

జిల్లావ్యాప్తంగా రైతులు సాగు చేసిన వేరుశనగ, పప్పుశనగ వంటి పంటలకు సంబంధించి ఈ క్రాప్‌ నమోదులో ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులకు తీరని అన్యాయం జరిగిందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు అన్యాయం
మాట్లాడుతున్న మాజీ మంత్రి కాలవ

మాజీ మంత్రి కాలవ 

కణేకల్లు, నవంబరు 30: జిల్లావ్యాప్తంగా రైతులు సాగు చేసిన వేరుశనగ, పప్పుశనగ వంటి పంటలకు సంబంధించి ఈ క్రాప్‌ నమోదులో ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులకు తీరని అన్యాయం జరిగిందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. మంగళవారం కణేకల్లులోని మాజీ ఎంపీపీ ఫాతిమాబీ స్వగృహంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇప్పటివరకు ఖరీఫ్‌, రబీలకు సంబంధించి కేవలం 30 శాతం మాత్రమే ఈ క్రాప్‌ బుకింగ్‌ నమోదు చేశారన్నారు. మిగతా 70 శాతం చేయలేదన్నారు. రైతులకు సంబంధించి నష్టపరిహారాలు కేవలం ఈ క్రాప్‌ నమోదు ఆధారంగానే వచ్చే అవకాశం వుండటంతో ఆ సొమ్మును అందుకోలేని పరిస్థితిలో రైతన్నలు వున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంకు జిల్లా కలెక్టర్‌ నష్టపోయిన పంట అంచనాకు ఆదేశాలివ్వాలని లేఖ రాయడం జరిగిందన్నారు. వేరుశనగ పంట మొత్తం నష్టపోయి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెడుతున్న నేపథ్యంలో ఇప్పుడు పంట నమోదు చేస్తే నష్టపోయిన రైతుల వివరాలెలా తెలుస్తాయని ప్రశ్నించారు. సీఎం తాను చెప్పేదొకటి చేసేదొకటిలా వుందని, ప్రజలకు అసత్యాలు చెబుతూ ఇప్పటికే తీవ్రస్థాయిలో మోసం చేశారన్నారు. రైతులకు నష్టపరిహారం అందించడంలో మీనమేషాలు లెక్కిస్తూ రోజుకోమాట చెబుతున్నారన్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సానుభూతి మాటలు చెబుతూ రైతుల నుంచి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ముందు రైతులకు నష్టపరిహారం అందించి వారిని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ తరపున తాము 15 రోజుల వరకు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నామని అంతలోపు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో టీడీపీ నాయకులు లాలెప్ప, షేక్‌ ఫకృద్దీన, ఆనంద్‌ రాజ్‌, మాబూసాబ్‌, మారుతి, చాంద్‌ బాషా, వెంకటేశులు, షేక్‌ ముజ్జు, జిలాన, వన్నూరుస్వామి, అల్తాఫ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-12-01T05:35:36+05:30 IST