Minister KTR మాటను గ్రేటర్ మేయర్ లెక్కచేయట్లేదా..!?

ABN , First Publish Date - 2021-07-31T20:53:35+05:30 IST

స్వయంగా మున్సిపల్‌ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పినా...

Minister KTR మాటను గ్రేటర్ మేయర్ లెక్కచేయట్లేదా..!?

జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మీతో అటు అధికారులకు, ఇటు అధికార పార్టీ కార్పొరేటర్లకు గ్యాప్‌ వచ్చిందా?  మేయర్‌ అంతా నా ఇష్టం అంటున్నారా? లేదంటే ఆమెకు తెలియకుండానే గ్రేటర్‌లో అన్నీ జరుగుతున్నాయా? కమిషనర్‌, ఎమ్మెల్యేలు కూడా మేయర్‌ పర్యటనల్లో పాల్గొనకపోవడానికి కారణమేంటి? స్వయంగా మున్సిపల్‌ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పినా ఏ ఒక్కరిలో మార్పు రావడం లేదా? మున్ముందు గులాబీలో వార్‌ జరుగనుందా? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌‌సైడ్‌లో చూద్దాం.


గద్వాలపై అసంతృప్తి..!

గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి వ్యవహారశైలిచూస్తున్న కార్పొరేటర్లు ఆమె నా రూటే సఫరేటూ అన్నట్లు ప్రవర్తిస్తోందని అనుకుంటున్నారట. కార్పొరేటర్లకే కాదు కనీసం ఎమ్మెల్యేలకు, ఎంపీలకూ విషయం చెప్పకుండానే ఆకస్మిక పర్యటనలు, అప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తోందని ఆమెపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారట.


విజయలక్ష్మి హుకుం..!

ప్రొటోకాల్ ప్రకారం మేయర్ కార్పొరేషన్‌లోని నియోజకవర్గాల్లో పర్యటించేటప్పుడు స్దానిక ఎమ్మెల్యే, కార్పోరేటర్లకు సమాచారం ఉండాలి. కానీ మేయర్ విజయలక్ష్మి షెడ్యూల్‌కు సంబంధించి కార్పొరేటర్లకు విషయం తెలియకుండా కార్యక్రమాలు ముగించేస్తున్నారట. దీంతో కార్పొరేటర్లు మేయర్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. కార్పొరేటర్లు తమ సమస్యలు చెప్పుకునేందుకు మేయర్‌ సమయం కూడా ఇవ్వడం లేదని బాధపడుతున్నారట. కార్పొరేటర్లే కాదు స్థానిక శాసనసభ్యులు కూడా మేయర్‌ విజయలక్ష్మి తీరుపై ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. జీహెచ్‌ఎంసీ నిధులతో చేపట్టే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు తాను వచ్చేవరకు చేయొద్దంటూ విజయలక్ష్మి హుకుం జారీచేశారట. దీంతో ఎమ్మెల్యేలు సైతం గుర్రుగా ఉంటున్నారట.


సమన్వయం కొరవడిందా..!

మేయర్‌కు, బల్దియా అధికారులకు  మధ్య సమన్వయం కొరవడిందని జీహెచ్ఎంసీ సిబ్బంది అనుకుంటున్నారట. ఇటీవల కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో మేయర్‌కు తెలియకుండా కొన్ని ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేసిన ఇంజినీర్లపై సీరియస్ అయ్యారట. సంబంధిత అధికారులకు మోమోలు కూడా జారీ చేశారు. ఇక కమిషనర్ లోకేష్ కుమార్ సైతం మేయర్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారట.ఎల్బీనగర్ జోన్ పరిధిలోని పలు లోతట్టు ప్రాంతాల్లో విజయలక్ష్మీ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాజాగా కొవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు ఆరోగ్య పరిరక్షణ కోసం  పీపీఈ కిట్లను పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు. ఈ ఏ ఒక్క కార్యక్రమానికి  కూడా కమిషనర్ హాజరుకాలేదు. ఇలా మేయర్ కార్యక్రమాలకు సంబంధించి కమిషనర్‌కు సమాచారం లేకపోవడం,  కమిషనర్ సైతం దూరంగా ఉండటం చూస్తుంటే ప్రథమ మహిళ ఎవరిని కలుపుకొని వెళ్లడం లేదనే ప్రచారం జరుగుతోంది. మేయర్ పర్యటన అంటేనే అయోమం గందరగోళం అని అధికారులు చెప్పుకుంటున్నారంట.


కేటీఆర్ ఆదేశించినా..!

నగరంలో వర్షం కురిసినపుడు, ప్రజల సమస్యలనుపరిష్కరించటంలో, నగరాన్ని  వరదల ముంపు నుంచి కాపాడేందుకు చేపట్టిన నాలాల పూడికతీత పనులను మేయర్, కమిషనర్ కలిసి సమిష్టిగా తనిఖీలు చేయాలని కొద్ది రోజుల క్రితం ప్రగతి భవన్‌‌లో నిర్వహించిన సమీక్షలో మంత్రి కేటీఆర్ ఆదేశించారు. అయినా.. ఇప్పటి వరకు మేయర్, కమిషనర్ ఈ పనులను తనిఖీ చేసిన సందర్భాల్లేవు. అసలు విషయానికొస్తే కార్పొరేషన్‌లో ప్రజల పక్షాన మేయర్, అధికారుల పక్షాన కమిషనర్‌ భాగస్వామ్యం కరువైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


మంత్రి మాటంటే లెక్కలేదా..!

నేరుగా మున్సిపల్ మంత్రి ఆదేశించినా వీరిద్దరు కలిసి గానీ, వేర్వేరుగా గానీ పనుల తనిఖీలు చేయకపోవటంతో పాలక మండలి, అధికార యంత్రాంగాల మధ్య దూరం పెరుగుతుందనే విషయం అర్థం అవుతోందని గ్రేటర్‌ వ్యవహారాలను గమనిస్తున్న నేతలు అనుకుంటున్నారట. మేయర్ కార్యక్రమాలకు కమిషనర్‌కే  సరైన సమాచారం ఉండడం లేదని అందుకే మేయర్ పర్యటనల్లో కమిషనర్ హాజరు కాలేకపోతున్నారని కమిషనర్ కార్యాలయం సిబ్బంది చెబుతున్నారు. ఇలా ఓ పక్కా  అధికారులతో, మరో పక్క ప్రజాప్రతినిధులతో మేయర్ దూరంగా ఉంటుండటంపై సొంత పార్టీ నేతలు సైతం ప్రథమ మహిళపై అసహనంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.



Updated Date - 2021-07-31T20:53:35+05:30 IST