Advertisement
Advertisement
Abn logo
Advertisement

బీమా కొందరికేనా..?

సగం మందికి అందని వైనం

వరి మినహా ఇతర పంటలకు దక్కని బీమా

ఖాజీపేట, నవంబరు 27: నష్టపోయిన ప్రతి రైతుకు బీమా అందజేస్తామని ప్రభుత్వం భారీ ప్రకటనలు ఇస్తుంటుంది. క్షేత్ర స్థాయిలో మాత్రం కొందరికే బీమా అందుతోంది. గత ఏడాది నివర్‌ తుఫాను జిల్లాను అతలాకుతలం చేసింది. కోతకొచ్చిన వరపంట కయ్యల్లోనే నీట మునిగి మోసులొచ్చింది. అప్పట్లో అధికారులు పొలాలన్నీ తిరిగి నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు  ఖాజీపేట మండల పరిధిలో 4,130 మంది వరి రైతులకు బీమా వర్తిస్తుందని చెప్పారు. అప్పటి నుంచి రైతులు బీమాసొమ్ముకోసం ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల రైతులకు రూ.5వేల నుంచి రూ.25 వేల వరకు బీమా సొమ్ము వారి అకౌంట్లలో పడింది. అయితే మండలంలో బీమా సొమ్ము కేవలం 2,792 మందికి మాత్రమే వచ్చింది. దీంతో మిగిలిన 1338 మంది వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది నివర్‌ తుఫాన దెబ్బతీసిందని అయునా అప్పులు చేసి ఈ వరి సాగుచేస్తే ఏడాది మళ్లీ జావాద్‌ తుఫాను తమను నిలువునా ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా కొందరికే బీమా ఇచ్చిందని తమను పట్టించుకోలేదని ఇలా అయితే తాము కోలుకోవడం కష్టమని వారు వాపోతున్నారు.

పత్తి, పసుపు, అరటి రైతులకు మొండిచేయి

ఖాజీపేట మండలంలో ప్రధాన పంట వరికాగా పత్తి, పసుపు, అరటి, బొప్పాయి, పూలతోటలు కూడా ఎక్కువగానే సాగు చేస్తారు. వ్యవసాయాధికారులు వీటికి కూడా నష్టపరిహారం అందుతుందని రైతులకు చెప్పారు. అయితే ఆ ఊసే కనిపించలేదు. గత ఏడాది లాగే ఈ ఏడాదీ అన్ని రకాల పంటలూ వర్షంతో తుడుచుపెట్టుకుపోయాయి. కనీసం ఈ ఏడాది అయినా తమ గోడు ప్రభుత్వం అర్థం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. పెట్టుబడులు అంతకంత పెరిగిపోతుండడంతో వ్యవసాయం తలకు మించిన భారంగా మారిందని ప్రభుత్వం ఆదుకోకపోతే తాము ఇక వ్యవసాయం వదిలేయాల్సి ఉంటుందని అంటున్నారు. కాగా.. కొందరు రైతులకు ఇంకా బీమా అందని విషయాన్ని మండల వ్యవసాయ అధికారి శివశైలజ దృష్టికి తీసుకుపోగా త్వరలోనే అందరికీ బీమా సొమ్ము వస్తుందని అన్నారు. 


బీమా కోసం ఎదురుచూస్తున్నా

- మాబూ, రైతు, కొమ్మలూరు, ఖాజీపేట

గత ఏడాది వర్షం వల్ల రెండు ఎకరాల్లో సాగు చేసిన వరి పంట పూర్తిగా దెబ్బతినింది. అధికారులు వచ్చి పంట నష్టం రాసుకునిపోయారు.  వేలి ముద్ర వేయించుకున్నారు. కానీ బీమా మాత్రం రాలేదు. ఈ ఏడు నోటికాడికి వచ్చే సమయంలో వరి పంట పూర్తిగా కోల్పోయాం. ప్రభుత్వ పెద్దలు రైతులను ఆదుకోవాలి.

Advertisement
Advertisement