టూల్‌కిట్ కేసు నిందితులకు బెయిలు పొడిగింపు

ABN , First Publish Date - 2021-03-09T22:14:47+05:30 IST

టూల్‌కిట్ కేసు నిందితులు నికిత జాకోబ్, శాంతను ములుక్ ఢిల్లీ

టూల్‌కిట్ కేసు నిందితులకు బెయిలు పొడిగింపు

న్యూఢిల్లీ : టూల్‌కిట్ కేసు నిందితులు నికిత జాకోబ్, శాంతను ములుక్ ఢిల్లీ కోర్టులో ఊరట పొందారు. వీరిద్దరికీ మార్చి 15 వరకు అరెస్టు నుంచి రక్షణ లభించింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులకు సంఘీభావం తెలపడం గురించి ఈ టూల్‌కిట్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. 


టూల్‌కిట్‌ను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన కేసులో దిశ రవి, నికిత జాకోబ్, శాంతను ములుక్ నిందితులు. వీరిపై దేశద్రోహం, ఇతర నేరారోపణలు నమోదయ్యాయి. నికిత జాకోబ్, శాంతను ములుక్‌లకు గతంలో ట్రాన్సిట్ ఇంటెరిమ్ బెయిలు మంజూరైంది. ఈ కేసులో ఢిల్లీ పోలీసుల ఆరోపణలకు సమాధానాన్ని దాఖలు చేయడానికి నిందితులకు  సమయం కావాలని న్యాయవాదులు బృంద గ్రోవర్, రెబెకా జాన్ ఢిల్లీ కోర్టుకు తెలిపారు. దీంతో మంగళవారం అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా వీరిద్దరి తాత్కాలిక బెయిలు గడువును మార్చి 15 వరకు పొడిగించారు. వీరిద్దరిపైనా నిర్బంధ చర్యలు చేపట్టవద్దని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణ మార్చి 15న జరుగుతుందని తెలిపారు. 


నికిత్ జాకోబ్‌కు ఫిబ్రవరి 17న బోంబే హైకోర్టు తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. ఫిబ్రవరి 25న ఢిల్లీ కోర్టు శాంతనుకు తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో దిశ రవికి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 


ఖలిస్థాన్ అనుకూల సంస్థ అయిన పొయిటిక్ జస్టిస్ ఫౌండేషన్ 2021 జనవరి 11న నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో నికిత జాకోబ్, శాంతను ములుక్ పాల్గొన్నారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా నిర్వహించవలసిన కార్యక్రమాల గురించి ఓ టూల్‌కిట్‌ను రూపొందించారని పోలీసులు ఆరోపించారు. ఈ టూల్‌కిట్‌ను గ్లోబల్ క్లైమేట్ యాక్టివస్ట్ గ్రెటా థన్‌బర్గ్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. శాంతను క్రియేట్ చేసిన ఈ-మెయిల్ అకౌంట్ ద్వారా దీనిని రూపొందించారని, దీనిని మిగిలినవారు ఎడిట్ చేశారని పోలీసులు ఆరోపించారు.


Updated Date - 2021-03-09T22:14:47+05:30 IST