Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎంతో అనుకుంటే.. ఇంతే మిగిలింది!

- గెలుపు కోసం పోరాడితే ఫలితం శూన్యం

- ఒక్క పని చేయలేకపోయామన్న దిగుల

- వైసీపీ శ్రేణుల్లో అంతర్మథనం

- సొంత పార్టీలో రేగుతున్న అసంతృప్తి సెగలు

- నిర్వేదంలో స్థానిక సంస్థల ప్రతినిధులు

- కార్పొరేషన్‌ చైర్మన్లు, డైరెక్టర్లదీ అదే పరిస్థితి

- ప్రజాగ్రహం తప్పదని వెంటాడుతున్న భయం

(ఇచ్ఛాపురం రూరల్‌)

- ‘పనుల కోసం మా వద్దకు తిరగొద్దు, ఒకవేళ చేసినా బిల్లులు రావడం లేదు. పనులు మంజూరు చేశాక బిల్లుల కోసం మాపై ఒత్తిడి చేస్తే మేమేమీ చేయలేం. ప్రస్తుత పరిస్థితి చూస్తున్నారు కదా. ఇక మీ ఇష్టం’..అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల వద్ద ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు చెబుతున్న మాటలివి. 


- ‘వైసీపీ ఆవిర్భావం నుంచి కష్టపడుతున్నాం. అధికారంలోకి తెచ్చేందుకు అహోరాత్రులు శ్రమించాం. లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి పంచాయతీ ఎన్నికల్లో గెలిచాం. తీరా ఇప్పుడు పంచాయతీలకు వచ్చే ఆర్థిక సంఘం నిధులను సైతం ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది. ఇంతలా పరిస్థితులు  దారుణంగా ఉంటాయనుకోలేదు’..అధికార పార్టీకి చెందిన సర్పంచ్‌ల వ్యథ ఇది.


- ‘రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉంది. అప్పులు పెరుగుతున్నాయి తప్ప అభివృద్ధి లేదు. పరిశ్రమల జాడలేదు. ఉద్యోగాల ఊసులేదు. ప్రత్యేక హోదాను పక్కన పెట్టేశారు. రాజధాని అంశాన్ని జఠిలం చేశారు’.. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, విద్యాధికుల అంతర్గత సమావేశాల్లో చర్చలివీ.  


... ఇలా రెండున్నరేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వంపై అన్నివర్గాల్లో అసంతృప్తి నెలకొంది. తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జిల్లాకు ఒక్క శాశ్వత ప్రాజెక్ట్‌ అయినా రాకపోవడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. వ్యవసాయాధారిత జిల్లా. ఉన్నది అందరూ చిన్నసన్నకారు రైతులే. స్థానికంగా ఉపాధి లేక ఎక్కువ మంది వలసబాట పడుతున్నారు. వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో జిల్లాకు కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ప్రత్యేక ప్రాజెక్టులేవీ లేవు. సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితీ అదే. టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైనవి, నిధులు కేటాయింపుల చేసిన వాటి పనులే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వంశధార ఫేజ్‌-2 రిజర్వాయర్‌ నిర్మాణం నత్తనడకన సాగుతోంది. వంశధార-నాగావళి నదుల అనుసంధానం  తీరూ అంతే. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలకు తాగునీరందించే సమగ్ర తాగునీటి ప్రాజెక్టు పైపులైన్‌ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆఫ్‌షోర్‌తో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టుల పనులు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నాయి. తితలీ బాధితుల రెట్టింపు పరిహారం విషయం ప్రభుత్వం మరిచిపోయింది. రహదారుల పరిస్థితి దారుణంగా మారింది. పంచాయతీల్లో పారిశుధ్య పనులు లేవు. చిన్న సమస్య పరిష్కారానికైనా నిధుల కొరత వెంటాడుతోంది. రాజ్యాంగబద్ధ చెల్లింపులు సైతం నిలిచిపోయాయి.  ఉపాధి హామీ వేతనదారులకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. సచివాలయ వ్యవస్థ ప్రారంభించి రెండేళ్లు అవుతున్నా సేవలు మెరుగుపడడం లేదు. కొత్త భవనాల నిర్మాణాలు ఎక్కడికక్కడే అసంపూర్తిగా నిలిచిపోయాయి. రైతుభరోసా కేంద్రాలు ఆశించిన స్థాయిలో ఫలితమివ్వలేదు. ఇలా అన్నింటా ప్రభుత్వ వైఫల్యాలు కనిపిస్తున్నాయి. 


ద్వితీయ శ్రేణి నేతల్లో గందరగోళం

ప్రజల మాట అలా ఉంచితే... వైసీపీ శ్రేణుల్లో సైతం అంతర్మథనం ప్రారంభమైంది. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తే అందుకు తగ్గట్టు ప్రతిఫలం లేదని వారు నిట్టూరుస్తున్నారు. కొద్దిమందికి నామినేటెడ్‌ పదవులు దక్కినా.. వాటితో వారు కాలక్షేపం చేస్తున్నారు తప్ప ఎటువంటి విధులు, నిధులు లేవు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చేసిన అప్పులే మిగిలాయని సర్పంచ్‌లు పెదవి విరుస్తున్నారు. నిధులు కేటాయించడం లేదు సరికదా..కేంద్రం అందించే ఆర్థిక సంఘం నిధులు సైతం మళ్లిస్తుండడంపై ఆగ్రహంతో ఉన్నారు. ఎమ్మెల్యేలను మినహాయిస్తే..మండల స్థాయిలో పార్టీ గెలుపునకు కష్టించి పనిచేసిన ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇప్పుడు గందరగోళంలో పడింది. పేరుకే అధికార పార్టీ కానీ..తామ పరిస్థితి దయనీయంగా మారిందని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం కోసం దారులు వెతుక్కుంటున్నారు. ఏం చేసినా డబ్బులు రావడంలేదు. ఏడాది క్రితం కొందరు నేతలు జగనన్న కాలనీ లేఅవుట్లకు మట్టి వేసి చదును చేశారు. ఆ బిల్లులు కూడా పూర్తిగా రాలేదని చెబుతున్నారు. ఇతర శాఖల్లో పనులు ఏమీ లేవు. నేతలకు నామినేటెడ్‌ పద్ధతిపై ఇచ్చే పనులు ఎక్కడా కనిపించడం లేదు. గత ప్రభుత్వం నీరు- చెట్టు పథకం ద్వారా నియోజకవర్గానికి రూ. 30 కోట్ల నుంచి రూ.40 కోట్లు కేటాయించింది. అప్పట్లో టీడీపీ నేతలకు ఇదొక ఆదాయవనరుగా మారింది. మండల స్థాయి నేతలకు పనులు భారీగా ఇచ్చారు. కోట్లాది రూపాయిల బిల్లులు వచ్చాయి. చివరిలో చేసిన పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వంలో ఇటువంటి పనులు లేవు. కేంద్రం నుంచి వచ్చిన నిధులకు మ్యాచింగ్‌ చేసి పనులు కూడా చేయడం లేదు. కేవలం సంక్షేమ పథకాలపైనే ప్రభుత్వం దృష్టిపెడితే తమ పరిస్థితి ఏమిటని వారు పెదవివిరుస్తున్నారు. 


పనులు చేసేందుకు వెనుకడుగు

మండలాల్లో ప్రభుత్వ పరంగా పనులు చేయడానికి నేతలు భయపడుతున్నారు. ఒక వేళ చేసినా బిల్లులు ఎప్పుడు వస్తాయో కూడా తెలియడం లేదు. అధికారులు కూడా స్పష్టత ఇవ్వడం లేదు. రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, హెల్త్‌ క్లీనిక్‌ల నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటి పనులు చేస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులు బిల్లులు రాక అప్పుల ఊబిలో మునిగిపోతున్నారు. ఎప్పుడు బిల్లులు వస్తాయోనని తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఆదాయాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిల దృష్టిలో పడేందుకు పాట్లు పడుతున్నారు. ప్రభుత్వం మాత్రం  నవరత్నాల పేరిట సంక్షేమానికే ప్రాధాన్యమిస్తోంది. వైసీపీ క్యాడర్‌కు మాత్రం ఏదీ దక్కలేదనే అసంతృప్తిలో రగిలిపోతోంది.


నిధులు లేని పదవులు

రాష్ట్రస్థాయిలో వివిధ కార్పొరేషన్లకు సంబంధించి జిల్లాకు పదవులు దక్కాయి. చైర్మన్లతో పాటు డైరెక్టర్‌ పదవులు పదుల సంఖ్యలో దక్కించుకున్న నాయకులు నిధులు లేక నిట్టూరుస్తున్నారు. గతంలో వివిధ కులాల కార్పొరేషన్లు, ఆర్థిక సంస్థలకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించేవారు. ఆ కార్పొరేషన్లు ప్రత్యేకంగా ఆ వర్గాలకు చెందిన వారికోసం కార్యక్రమాలు అమలు చేసేవి. వైసీపీ అధికారంలోకి వచ్చాక వాటిని రాజకీయ పునరావాస కేంద్రాలుగా మాత్రమే మార్చేశారు. వాటి ‘ఆర్థిక రెక్కలు’ విరిచేశారు. 

Advertisement
Advertisement