వారంలో సాగునీరు

ABN , First Publish Date - 2021-08-25T06:04:38+05:30 IST

జిల్లాలో సాగునీటి అవసరాలకు మరో వారంలో సాగర్‌ నీరు అందనుంది.

వారంలో సాగునీరు
ఏబీసీలోని వల్లాపల్లి వద్ద సాగర్‌కాలువలో నీటి ప్రవాహం

సాగర్‌ నుంచి ఇచ్చేందుకు సిద్ధం

వచ్చేనెల 1 నుంచి సరఫరాకు అవకాశం

ఇప్పటికే తాగునీటి వనరులకు చేరిక

గతేడాది 3.05 లక్షల ఎకరాల్లో సాగు

సాగు, తాగునీటికి 67 టీఎంసీలు

ఒంగోలు, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సాగునీటి అవసరాలకు మరో వారంలో సాగర్‌ నీరు అందనుంది. గతేడాది కన్నా మూడు వారాలు ముందే ఈసారి ఇవ్వనున్నారు. ఇప్పటికే పది రోజులకుపైగా సాగర్‌ కాలువల ద్వారా నీరు వస్తుండగా తాగునీటి వనరులు నింపుతున్నారు. సాగర్‌ డ్యాం ఇంచుమించు పూర్తిస్థాయిలో నిండి ఉండటం, స్థానికంగా రైతుల నుంచి వస్తున్న డిమాండ్‌ నేపథ్యంలో సాగుకు నీటి విడుదలపై ప్రభుత్వం దృష్టిసారించింది. అధికారికంగా ఇంకా  ప్రకటించినప్పటికీ అందుతున్న సమాచారం ప్రకారం వచ్చేనెల 1 నుంచి సాగుకు సాగర్‌ నుంచి నీరు ఇవ్వనున్నారు. 


సరిపడా నీరు అందేనా?

జిల్లాలో సాగర్‌ కుడి కాలువ కింద 4.43లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంది. అయితే అనేక సంవత్సరాలుగా నీటి సరఫరా సరిలేకపోవడంతో దాదాపు లక్ష ఎకరాలకుపైగా ఆయకట్టులో సాగర్‌ నీటితో సంబంధం లేకుండా పంటలు సాగు చేసుకుంటున్నారు. మిగిలిన 3.40లక్షల ఎకరాల్లో దాదాపు 60శాతం విస్తీర్ణంలో ఆరుతడి, 40శాతం విస్తీర్ణంలో మాగాణి సాగవుతోంది. సాగర్‌ కుడి కాలువకు డ్యామ్‌ నుంచి 132 టీఎంసీలు కేటాయింపు అధికారికంగా ఉండగా అందులో 43శాతం జిల్లాకు రావాలి. ఆ ప్రకారం జిల్లాకు 57 టీఎంసీలు నీరు ఇవ్వాలి. అయితే కృష్ణా ఎగువ ప్రాంతంలో భారీవర్షాలు కురిసి రెండు, మూడు సార్లు డ్యాంలు నిండి సముద్రానికి నీరు వెళ్లినప్పుడు తప్ప సాధారణ సమయాల్లో వాటా మేర జిల్లాకు రావడం లేదు. 


3.20లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని అంచనా

ఈ ఏడాది 3.20లక్షల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో పంటలసాగు జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు కనీసం 45టీఎంసీలు నీరు అవసరం. అలాగే తాగునీటికి మరో 12 టీఎంసీలు కావాలి. అలా 57 టీఎంసీలు వరకు అవసరం కాగా వాటా మేర నీరు వస్తే రెండింటికి సరిపోతుంది. అయితే వాటా మేర సక్రమంగా రాకపోవడంతో పాటు ప్రధాన కాలువకు చివరిప్రాంతం కావడంతో వేస్టేజీ 15 నుంచి 20 శాతం వరకు లెక్కిస్తున్నారు. అలా జిల్లాకు 65 నుంచి 67 టీఎంసీలు వస్తేనే అవసరాలు తీరుతాయి. గతేడాది ఆ మేర నీటి సరఫరా జరిగింది. అయితే ఈ ఏడాది ఎంతనీటిని ఇస్తారు, ఎప్పటినుంచి సాగుకు ఇస్తారన్నది తాజా పరిణామాల నేపథ్యంలో కేఆర్‌ఎంబీ తుది నిర్ణయం తీసుకోవాలి. దీంతో ఆధికారికంగా జలవనరులశాఖ దీనిపై మాట్లాడటం లేదు.


దాదాపు నిండిన రామతీర్థం

పదిరోజుల క్రితం డ్యాంలు నిండి నీటిని సముద్రానికి వదలడం, ఇప్పుడు కూడా శ్రీశైలం, సాగర్‌ డ్యాంలు పూర్తిస్థాయిలో నిండి ఉన్న నేపథ్యంలో పది రోజులుగా కాలువలకు నీటి సరఫరా జరుగుతోంది. ఆ నీటితో తాగునీటి వనరులను నింపుతున్నారు. అలా ఈ పదిరోజుల్లో జిల్లాకు 3 టీఎంసీలు సరఫరా జరిగినట్లు తెలుస్తుండగా అందులో ఇంచుమించు సగం నీరు రామతీర్థంకు చేరి రిజర్వాయర్‌ దాదాపుగా నిండినట్లు కనిపిస్తోంది. అక్కడి నుంచి సోమవారం ఒంగోలు నగరంలోని ఎస్‌ఎస్‌ ట్యాంకులకు నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 1 నుంచి సాగునీటిని ఇచ్చేలా ఇరిగేషన్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉన్నతస్థాయిలో అధికారికంగా ప్రకటించకపోవడంతో స్థానిక అధికారులు తమ దగ్గరకు వస్తున్న రైతులకు ఈ విషయాన్ని చెప్తున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో రైతులు నార్లు పోసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బోర్లు ఇతర వనరుల కింద నార్లు పోసిన వారు సాగుకు నీరిచ్చిన వెంటనే నాట్లు వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. 


Updated Date - 2021-08-25T06:04:38+05:30 IST