పరిహారం ఉత్తిదేనా?

ABN , First Publish Date - 2022-09-20T06:20:00+05:30 IST

ఈ యేడు ఎన్నో ఆశలతో వానాకాలం పంటల సాగుకు శ్రీకారం చుట్టినా.. వరదల ఉధృతికి పంటలు నేలమట్టమయ్యాయి. కళ్ల ముందే పంటలు వరదనీటిలో కొట్టుకుపోవడంతో రైతులు గుండెలు బాధుకున్నా రు. అధిక వర్షాలతో నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం చెల్లిం చి ఆదుకుంటామని అధికార పార్టీ నేతలు, జిల్లా అధికారులు హామీలిచ్చి నా.. ఆచరణ సాధ్యం కావడం లేదు.

పరిహారం ఉత్తిదేనా?
నేరడిగొండలో వరదనీటికి దెబ్బతిన్న పత్తి(ఫైల్‌)

జిల్లాలో ఈ యేడు లక్షా 3వేల 305 ఎకరాల్లో పంట నష్టం

రూ.72.85 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు గుర్తించిన అధికారులు 

అంచనాలకే పరిమితమైన వ్యవసాయ శాఖ అధికారులు

కేంద్ర బృందం పరిశీలించినా.. ఫలితం శూన్యం

కలెక్టర్‌ ప్రత్యేక చొరవ చూపాలంటున్న బాధిత రైతులు

నాలుగేళ్లుగా పంట నష్ట పరిహారం కోసం తప్పని ఎదురుచూపులు

ఆదిలాబాద్‌, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఈ యేడు ఎన్నో ఆశలతో వానాకాలం పంటల సాగుకు శ్రీకారం చుట్టినా.. వరదల ఉధృతికి పంటలు నేలమట్టమయ్యాయి. కళ్ల ముందే పంటలు వరదనీటిలో కొట్టుకుపోవడంతో రైతులు గుండెలు బాధుకున్నా రు. అధిక వర్షాలతో నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం చెల్లిం చి ఆదుకుంటామని అధికార పార్టీ నేతలు, జిల్లా అధికారులు హామీలిచ్చి నా.. ఆచరణ సాధ్యం కావడం లేదు. రెండు మాసాలు గడిచిపోతున్నా.. ప్రభుత్వం పంట నష్టపరిహారం ఊసెత్తడమే లేదు. ఇప్పటి వరకు ఎలాం టి ఆదేశాలు లేవన్న కారణంగా వ్యవసాయ శాఖాధికారులు పంటల  సర్వే పనులను పూర్తిగా పక్కన పెట్టేశారు. కేవలం ప్రాథమిక అంచనాలతోనే సరిపెట్టారు. జిల్లా సాధారణ వర్షపాతం 1193 మి.మీ.లు కాగా, ఈ యేడు 1444.5 మి.మీ.ల అధిక వర్షపాతం కురిసింది. ఈ యేడు జూలై లోనే భారీ వర్షాలు కురిశా యి. దీంతో జిల్లావ్యాప్తంగా లక్షా 3వేల 305 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. దీనికి గాను రూ.72.85 కోట్ల మేర నష్టం వాటినట్లు అధికారులు గుర్తించారు. కానీ ఇప్పటి వరకు నయా పైసా చేతికందక పోవడంతో అన్నదాతలు అప్పుల పాలవుతున్నారు. అప్పు చేసి మరీ ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తున్నారు. దీంతో అదనంగా పెట్టుబడుల భారం పెరిగిపోతోంద ని రైతులు వాపోతున్నారు. రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్టపరిహారం చెల్లించి జిల్లా రైతులను ఆదుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే పోటీ పడి మరీ పంటలను పరిశీలించిన అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పంట నష్టపరిహారంపై నోరు మెదపకపోవడం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 2018నుంచి ఇప్పటి వరకు జిల్లా రైతులకు పంట నష్ట పరిహారం అందడమే లేదు.

ప్రభుత్వ ఆదేశాలు కరువు

జిల్లాలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల సర్వేను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలను జారీ చేయలేదని అధికారులు పేర్కొంటున్నారు. కేవలం ప్రాథమిక అంచనాలతోనే సరిపెడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పంటలు దెబ్బతిన్న పక్షం రోజుల్లోనే సర్వే పనులు చేపట్టి పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు లేవన్న కారణంగా అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే పనులు చేపట్టడం లేదు. ఎందు కంటే పంటల సర్వే చేపట్టి పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందిస్తే నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుందని.. దీని కారణంగానే సర్వేను నిలిపి వేశారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ సర్వే ఆధారంగానే రైతు సంఘాల నేతలు కోర్టును ఆశ్రయిస్తే పరిహారం చెల్లించక తప్పదంటున్నారు. ఇలాంటి ఇబ్బందుల కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం సర్వేను చేపట్టకుండా అడ్డుకుంటుందన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. అలాగే పంట కాలం 45 రోజులు మించితేనే నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. కానీ ఈ యేడు జిల్లా లో జూలై మొదటి వారం నుంచి రెండో వారం పూర్తయ్యే వరకు ఎడతెరి పి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. దీంతో వరదల ఉధృతి పెరిగి పం టలు నేలమట్టమయ్యాయి. కొన్నిచోట్ల వరదనీరు చేరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పాక్షికంగా, పూర్తిగా పంటలు కొట్టుకుపోవడంతో రైతుల కు తీవ్రనష్టం వాటిల్లింది. పెట్టుబడులు నీళ్లపాలు కావడంతో ఈ యేడు పంటల సాగు కలిసి వచ్చేలా కనిపించడం లేదంటున్నారు.

9 మండలాల్లో భారీ నష్టం

జిల్లాలోని 18 మండలాలకు గాను తొమ్మిది మండలాల్లో అతి భారీ వర్షాలు కురవడంతో తీవ్రనష్టం జరిగినట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తుంది. మరో ఏడు మండలాల్లో అధిక వర్షాలు, రెండు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. దీంతో జిల్లావ్యాప్తంగా 363 గ్రామాల లో 29,805 మంది రైతుల పంటలకు భారీ నష్టం జరిగింది. ఇందులో 67 వేల 945 ఎకరాలలో పత్తి పంట, 8170 ఎకరాలలో కంది పంట, 27185 ఎకరాలలో సోయా పంటకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశా రు. అప్పట్లోనే నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు కేంద్ర అధికారుల బృందం జిల్లాలో పర్యటించింది. ప్రధానంగా ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, నేరడిగొండ మండలాల్లో కేంద్ర అధికారు ల బృందం పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించింది. అయినా ఏమాత్రం ప్రయోజనమే లేకుండాపోయింది. కేంద్ర బృందం రాకతో జిల్లా రైతులు పరిహారం కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో అందని ద్రాక్షగానే మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. పంటల సర్వే పూర్తిస్థాయి నివేదిక లేదన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించేందుకు ముందుకు రావడం లేదంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపితేనే కేంద్రం ఇన్‌పుట్‌ సబ్సిడీని చెల్లించే అవకాశం ఉందని రైతు సంఘాల నేతలు పేర్కొంటున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంతో పాటు రైతు బీమాను అంది స్తోంది. అంతేకాకుండా  ఈ పథకాల కారణంగా ఈ యేడు కూడా పంట నష్ట పరిహారం చెల్లించే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

గతంలో రూ.12 కోట్లు మంజూరు

గతంలో జిల్లా కలెక్టర్‌గా పని చేసిన దివ్యదేవరాజన్‌ ప్రత్యేక చొరవ తీసుకుని వ్యవసాయ శాఖాధికారులతో వరదలకు దెబ్బతిన్న పంటలను సర్వే చేయించారు. ఈ సర్వే ఆధారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక అందించి రూ.12 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని మంజూరు చేయించారు. దీంతో జిల్లా రైతులకు కొంతమేలు జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పంట నష్ట పరిహారం చెల్లించిన దాఖలాలు కనిపించడం లేదు. ప్రతియేటా జిల్లాలో భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతింటున్న రైతులను ఆదుకునేందుకు అధికారులు ప్రయత్నించడమే లేదు. అలాగే పంటల బీమాకు కూడా అవకాశం లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తుంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతున్న రైతులు దిక్కులు చూసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నిబంధనల ప్రకారం నీటి వసతి ఉన్న హెక్టార్‌కు రూ13వేల 500, మెట్ట భూములకు రూ.6 వేలు పంట నష్ట పరిహారం చెల్లించే అవకాశం ఉంది. 

ఎలాంటి ప్రభుత్వ ఆదేశాలు లేవు

: పుల్లయ్య, జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయా శాఖాధికారి

ఈ యేడు కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను సర్వే చేయాలని, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలను జారీ చేయలేదు. దీని కారణంగానే సర్వే పనులను చేపట్టలేక పోయాం. ప్రాథ మిక అంచనాల్లో లక్షా 3వేల 305 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు గుర్తించాం. కానీ వరదనీరు తగ్గుముఖం పట్టడంతో నష్టం తీవ్రత తగ్గింది. పూర్తిగా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం పూర్తిస్థాయి నివేదిక కోరలేదు. ప్రాథమిక రిపోర్టును మాత్రం పంపించడం జరిగింది.

Updated Date - 2022-09-20T06:20:00+05:30 IST