ఈటల ముఖ్యమంత్రి పదవిని కోరుకోవడం కరెక్టేనా?

ABN , First Publish Date - 2021-06-14T05:49:11+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ఎన్టీ రామారావును చంద్రబాబు నాయుడు ఎలా వెన్నుపోటు పోడిచాడో అదేవిధంగా ఈటల రాజేందర్‌ ముఖ్యమంత్రి పదవి కోరుకోవడం కరెక్టేనా అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ప్రశ్నించారు.

ఈటల ముఖ్యమంత్రి పదవిని కోరుకోవడం కరెక్టేనా?

-నల్ల చట్టాలను తయారు చేసిన బీజేపీలో చేరడం సిగ్గుచేటు 

- కరీంనగర్‌ను హుజూరాబాద్‌లా అభివృద్ధి చేస్తా

- మంత్రి గంగుల కమలాకర్‌

హుజూరాబాద్‌, జూన్‌ 13: రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ఎన్టీ రామారావును చంద్రబాబు నాయుడు ఎలా వెన్నుపోటు పోడిచాడో అదేవిధంగా ఈటల రాజేందర్‌ ముఖ్యమంత్రి పదవి కోరుకోవడం కరెక్టేనా అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ప్రశ్నించారు. ఆదివారం హుజూరాబాద్‌ మండలం సింగాపూర్‌ కిట్స్‌ కళాశాల ఆడిటోరియంలో మండల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ హుజూరాబాద్‌ ప్రజలు ఐదేళ్లు పాలించమంటే మధ్యలోనే వదిలేసిన వ్యక్తి ఈటల రాజేందర్‌ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈటలను పక్కన కూర్చొబెట్టుకుంటే ఆ సీటు ఎప్పుడు వస్తాదా అని ఈటల ఎదురుచూశారన్నారు. సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రమ్మంటే పోలేదని పదే పదే చెబుతున్న ఈటల ఆయనకు సద్దులు మోశారన్నారు. నల్ల చట్టాలను తయారు చేసిన బీజేపీలోకి ఈటల రాజేందర్‌ వెళ్లడం సిగ్గు చేటన్నారు. ఈటలను బీజేపీలోకి ఆహ్వానించే ముందు ఆయన కడిగిన ముత్యమా... మలిన పడ్డా ముత్యమా అని బండి సంజయ్‌ ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. రాములోరి గుడి కట్టించే బీజేపీ నాయకులు దేవరయాంజల్‌ భూములను కబ్జా చేసిన వ్యక్తిని ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తనను ఓడించేందుకు టీఆర్‌ఎస్‌ పెద్దలు డబ్బులు పంపారని ఆరోపించిన ఈటల పెద్దమ్మ గుడి వద్దకు వచ్చి ప్రమాణం చేసి ఎవరు పంపారో చెప్పాలన్నారు. ఈటల తన రాజీనామాతో పాటు అక్రమించిన 40ఎకరాల భూమిని పేద వారికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈటల రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలు విముక్తి పొందారన్నారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతిసింది ఈటలనే అన్నారు. కరీంనగర్‌లాగా హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. హుజూరాబాద్‌లో 80 శాతం మంది టీఆర్‌ఎస్‌ పార్టీ వైపు ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హుజూరాబాద్‌ నియోజకవర్గం ఇష్టమన్నారు. సమావేశంలో ఎంపీ కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్సీ బస్వరాజ్‌ సారయ్య, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, కొడూరి సత్యనారాయణరావు, మేయర్‌ సునీల్‌రావు, వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, బండ శ్రీనివాస్‌, గందె రాధిక, కొలిపాక నిర్మల, ఇరుమల్ల రాణి. పడిదం బక్కారెడ్డి పాల్గొన్నారు.

- మంత్రి గంగులకు ఘన స్వాగతం..

హుజూరాబాద్‌ నియోజకవర్గానికి మొట్ట మొదటిసారిగా విచ్చేసిన మంత్రి గంగుల కమలాకర్‌కు సింగాపూర్‌ గ్రామ శివారులో టీఆర్‌ఎస్‌ నాయకుడు దొంత రమేష్‌ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గంగులను శాలువాతో సత్కరించారు. అనంతరం తన అనుచరులతో వంద మోటర్‌ సైకిళ్లతో ర్యాలీగా తీసుకొచ్చారు.

Updated Date - 2021-06-14T05:49:11+05:30 IST