నిజాంసాగర్‌ పర్యాటకం హుళక్కేనా?

ABN , First Publish Date - 2022-04-09T05:27:16+05:30 IST

నిజాంసాగర్‌ ప్రాచీన పర్యాటక స్థలాలు కళాహీనంగా మారిపోతునే ఉన్నాయి. నీటి పారుదల శాఖ అధికారులు లక్షలు వెచ్చించినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.

నిజాంసాగర్‌ పర్యాటకం హుళక్కేనా?
గార్డెన్‌లో ఆనాటి పచ్చని పందిరి కళాహీనంగా ఉన్న దృశ్యం

- ఏడాది కిందట మరమ్మతులు చేశారు.. నిర్వహణ మరిచారు!

- కళాహీనంగా నిజాంసాగర్‌ పర్యాటకం

- ఇది తెలంగాణలోనే మొట్ట మొదటి నిజాంసాగర్‌ పర్యాటకం తీరు


నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 8: నిజాంసాగర్‌ ప్రాచీన పర్యాటక స్థలాలు కళాహీనంగా మారిపోతునే ఉన్నాయి. నీటి పారుదల శాఖ అధికారులు లక్షలు వెచ్చించినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. 2021లో ఆనాడు నైజాం ప్రభుత్వం నిజాంసాగర్‌ ప్రాజెక్టును నిర్మించింది. గార్డెన్లు, పర్యాటక కేంద్రాలను జాతికి అంకితం చేసింది. దాదాపు 40 సంవత్సరాలు ఈ ప్రాచీన కట్టడాలు, గార్డెన్లు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరంగా ఉండటంతో పర్యాటకులు సేద తీర్చుకునే వారు. కానీ, నీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా కాల క్రమేణా అవి కనుమరుగై పోయాయి. గత ఏడాది క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు నిజాంసాగర్‌కు పర్యటించి నాగమడుగుకు శంకుస్థాపన చేస్తారనే నెపంతో లక్షలు వెచ్చించి గుల్‌గస్త్‌ గార్డెన్‌ను ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. కానీ, అవి మూన్నాళ్లకే కళాహీనంగా మారాయి. పచ్చని చెట్లు, పౌంటెన్లు సైతం పని చేయకపోవడంతో నీళ్లు విరజిమ్మ లేకపోతున్నాయి. గార్డెన్‌లో ఉన్న పచ్చని పందిళ్లు, కాటేజీలు, స్వాగత తోరణాలు నిర్వహణ లేక కనుమరుగై పోతున్నాయి. గుల్‌గస్త్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న గుల్‌గస్త్‌ బంగ్లాను సీఎం కేసీఆర్‌ సేద తీరేందుకు ఈ బంగ్లాను ఎంతో సుందరంగా తీర్చిదిద్ది ఫర్నిచర్‌, విద్యుద్ధీకరణ తదితర పనులు చేసి ఈ బంగ్లాను కనువిందు చేశారు. కానీ, నిజాంసాగర్‌ ప్రాజెక్టును సీఎం కేసీఆర్‌ పర్యటించకపోవడం పట్ల అవి చూపరులకు కనువిందు చేస్తూనే ఉన్నాయి. గార్డెన్‌లో రాత్రివేళల్లో పట్ట పగలు లాగా ఉండేందుకు అప్పట్లో ప్రధాన ద్వారం, గార్డెన్‌లో ఐమ్యాక్స్‌ లైట్లను ఏర్పాటు చేసినా అవి మూన్నాళ్లకే పాడయ్యాయి. వీఐపీ అతిథి గృహాన్ని కూడా చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ఈ అతిథి గృహాన్ని సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా పునః ప్రారంభిస్తామని అధికారులు ప్రణాళిక రూపొందించారు. నాగమడుగుకు శంకుస్థాపన చేసేందుకు సీఎం కేసీఆర్‌ రాకపోవడం పట్ల రైతాంగం, ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. సీఎం రాకను పురస్కరించుకుని నిజాంసాగర్‌ ప్రాజెక్టు అందాలను తీర్చిదిద్దినప్పటికీ అవి అలంకారప్రాయంగా మారి కళాహీనంగా మారడం పట్ల పర్యాటకులు, ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గార్డెన్‌ నిర్వహణకు సిబ్బంది లేకపోవడంతో చెత్తా చెదారం పేరుకుపోయినా తొలగించాలనే ఆలోచన అధికార యంత్రాంగానికి లేకపోవడం గమనార్హం. నాగమడుగు ఎత్తిపోతల పథకానికి జక్కాపూర్‌ శివారులో లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టిన పైలాన్‌ చూపరులను వెక్కిరిస్తోంది. జక్కాపూర్‌ బస్టాండ్‌ నుంచి నాగమడుగు ఎత్తిపోతల పథకం వరకు వెళ్లేందుకు బీటి రోడ్డు నిర్మాణం కూడా చేశారు. ఎత్తిపోతల పథక నిర్మాణం పనులు కొనసాగుతూనే ఉన్నాయి కానీ, నిజాంసాగర్‌ పర్యాటకం కల సాకారం నెరవేరలేదని ఉభయ జిల్లాల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికార యంత్రాంగం స్పందించి నిజాంసాగర్‌ పర్యాటక, ప్రాచీన కట్టడాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

Updated Date - 2022-04-09T05:27:16+05:30 IST