Abn logo
Sep 29 2020 @ 00:26AM

‘సుద్దాల వాగుపై వంతెన నిర్మాణం ఉట్టిమాటేనా’

చెన్నూరు, సెప్టెంబరు 28 : మండలంలోని సుద్దాల వాగుపై వంతెన నిర్మాణం చేపడుతామని ఇచ్చిన హామీ ఉట్టిమాటేనా అని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్‌  ప్రశ్నించారు. సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో కిష్టంపేట జంక్షన్‌ వద్ద సుద్దాల వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతూ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ రెండు నెలల్లో వంతెన నిర్మాణ పనులు ప్రారంభిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు.


ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదని విమర్శించారు. వాగుపై వంతెన నిర్మిస్తామని చెప్పి నియోజకవర్గ ప్రజలను మభ్య పెడుతున్నారని  తెలిపారు. రెండు సంవత్సరాలు కావస్తున్నా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. వాగుపై వంతెన లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఆలం బాపు, జిల్లా కార్యదర్శి లక్ష్మణ్‌, నాయకులు  శంకర్‌, వెంకటేష్‌, సమ్మిరెడ్డి, సుశీల్‌కుమార్‌, శ్రీపాల్‌ , శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement