ఖట్టర్ ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కోబోతోందా?

ABN , First Publish Date - 2021-03-05T17:12:18+05:30 IST

హర్యానా అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఓ వైపు రైతు ఉద్యమం జరుగుతున్న సందర్భంలో అసెంబ్లీ

ఖట్టర్ ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కోబోతోందా?

న్యూఢిల్లీ : హర్యానా అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఓ వైపు రైతు ఉద్యమం జరుగుతున్న సందర్భంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. 12 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ప్రసంగం తర్వాత ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది. మాజీ సీఎం హుడా నేతృత్వంలో నూతన సాగు చట్టాలపై చర్చకు పట్టుబట్టాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఇదే అంశాన్ని ఆధారంగా చేసుకొని ఖట్టర్ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ శిబిరం నిర్ణయించుకుంది. అయితే ఈ అవిశ్వాస తీర్మానాన్ని స్వీకరించాలా? వద్దా? అన్నది స్పీకర్ విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది. అయితే పార్లమెంట్‌ చేసిన చట్టాన్ని అసెంబ్లీలో చర్చకు తీసుకురావడం సభా నియమావళికి విరుద్ధమని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ ఓకే చెబితే మాత్రం కొన్ని రోజుల్లోనే ఖట్టర్ సర్కార్ అవిశ్వాసాన్ని ఎదుర్కోబోతోంది. అంతవరకూ వెళ్లకుండానే ఖట్టర్ సర్కార్ ప్రతి వ్యూహాన్ని సిద్ధం చేసింది. ప్రైవేట్ సెక్టార్‌ ఉద్యోగాల్లో యువతకు 75 శాతం ఉపాధి కల్పించడం, న్యాయ వివాదాల్లో ఉన్న పరిష్కరించి, నూతనంగా భర్తీ చేయడం లాంటి అంశాలను తెరపైకి తెచ్చి సభను తమను అనుకూలంగా మలుచుకోవాలని వ్యూహం వేశారు.


మరోవైపు అసెంబ్లీలో మొత్తం 90 సీట్లున్నాయి. అందులో రెండు ఖాళీ ఉండగా మొత్తం 88 సీట్లు. అందులో 40 బీజేపీ, 10 జేజేపీ, 30 కాంగ్రెస్. అయితే బీజేపీ, జేజేపీ సంకీర్ణ కూటమి కాబట్టి బీజేపీ ఖాతాలో మొత్తం 50 సీట్లున్నట్లు లెక్క. ఒకవేళ అవిశ్వాసమంటూ వస్తే బీజేపీ 45 మంది ఎమ్మెల్యేలు అవసరం. బీజేపీ, జేజేపీ, స్వతంత్రులు కలిస్తే బీజేపీకి మొత్తం 55 మంది ఎమ్మెల్యేల మద్దతుండేది. అయితే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రం బీజేపీపై అలకబూనారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాల విషయంలోనే వీరు అలకబూనారు. ఆరుగురు ఎమ్మెల్యేలు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నారు. మరో ఇద్దరు స్వతంత్రులు కూడా ప్రభుత్వానికి మద్దతివ్వడం లేదు. ప్రస్తుతం 47 మంది ఎమ్మెల్యేలు ఖట్టర్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ఒకవేళ గనక ప్రతిపక్ష కాంగ్రెస్ అవిశ్వాసాన్ని తీసుకొస్తే ఎవరెవరు ఖట్టర్‌కు బాసటగా నిలుస్తారన్నది వేచి చూడాలి.  

Updated Date - 2021-03-05T17:12:18+05:30 IST