అనాథలను ఆదుకోవడం మన బాధ్యత

ABN , First Publish Date - 2021-08-03T07:06:28+05:30 IST

అనాథలను ఆదుకోవడం సమాజంలోని ప్రతిఒక్కరి బాధ్యతని ఉపరాష్ట్రపతి

అనాథలను ఆదుకోవడం మన బాధ్యత

 ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు


న్యూఢిల్లీ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): అనాథలను ఆదుకోవడం సమాజంలోని ప్రతిఒక్కరి బాధ్యతని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ బండా ప్రకాశ్‌ , తెలంగాణకు చెందిన గాదె ఇన్నయ్య నేతృత్వం లో పలువురు అనాథలు సోమవారం ఢిల్లీలో ఉపరాష్ట్రపతిని కలిసి అనాథ హక్కుల చట్టం తీసుకొచ్చేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ప్రభుత్వ పెద్దలతో, సంబంధిత మంత్రులతో చర్చిస్తానని వెంకయ్యనాయుడు వారికి హామీ ఇచ్చారు.


ఇది కేవలం చట్టాలతో రావాల్సిన మార్పు కాదని, వారికి కూడా హక్కులు ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తన కుమార్తె దీపా వెంకట్‌ ఐదుగురు అనాథ పిల్లలకు స్వర్ణభారత్‌ ట్రస్టు ద్వారా ఆశ్రయమిచ్చి, వారి బాగోగులు, చదువు విషయంలో చొరవ తీసుకుంటున్నారని వెల్లడించారు. ప్రభుత్వ పెద్దలతో చర్చిస్తానని ఇచ్చిన హామీ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో ఈ అంశంపై వెంకయ్య చర్చించారు. 



అనువాద టూల్‌ను పరిశీలించిన ఉపరాష్ట్రపతి

ఇంగ్లీషు నుంచి 11 భారతీయ భాషల్లోకి అనువాదం చేసే ఒక ప్రత్యేకమైన టూల్‌ పనితీరును వెంకయ్య నాయుడు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ పరిశీలించారు. ఈ టూల్‌ ఇంగ్లీషులోని ఆన్‌లైన్‌ కోర్సులను హిందీ, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, గుజరాతీ, కన్నడ, మలయాళం, పంజాబీ, అస్సామీ, ఒడియా భాషల్లోకి తర్జుమా చేస్తుందని ఒక అధికార ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2021-08-03T07:06:28+05:30 IST