జగన్‌.. ఏమిటిది

ABN , First Publish Date - 2020-09-23T07:21:09+05:30 IST

‘ఢిల్లీ పిలుపు’ మేరకు జగన్‌ మంగళవారం ఆకస్మికంగా హస్తినకు బయలుదేరి వెళ్లారు. మంగళవారం రాత్రి ఆయన

జగన్‌.. ఏమిటిది

దూకుడు తగ్గించండి..

   న్యాయ వ్యవస్థపైనే దాడి చేస్తారా?

ప్రభుత్వమే టార్గెట్‌ చేయడమా!?

పార్లమెంటునూ వాడుకుంటారా?

ఇలా రచ్చకెక్కడం మంచిది కాదు

పిలిపించి మందలించిన అమిత్‌ షా

వివరణ ఇచ్చేందుకు జగన్‌ ప్రయత్నం

పట్టించుకోని కేంద్ర హోంమంత్రి


న్యాయవ్యవస్థపై వ్యూహాత్మక దాడికి దిగుతున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘దూకుడు తగ్గించండి’ అని సూటిగానే చెప్పినట్లు సమాచారం.


న్యూఢిల్లీ/అమరావతి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ‘ఢిల్లీ పిలుపు’ మేరకు జగన్‌ మంగళవారం ఆకస్మికంగా హస్తినకు  బయలుదేరి వెళ్లారు.  మంగళవారం రాత్రి ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సుమారు 40 నిమిషాలపాటు భేటీ అయ్యారు. రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడల సంగతి ఎలా ఉన్నా....  మొత్తంగా న్యాయ వ్యవస్థను, అందులోనూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సైతం కించపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని అమిత్‌షా ప్రస్తావించినట్లు తెలిసింది.


‘‘న్యాయమూర్తులపై బహిరంగ వ్యాఖ్యానాలు చేయడం, అందుకు పార్లమెంటును కూడా ఉపయోగించుకోవడం సరైంది కాదు.  ఇలాంటి విషయాల్లో సున్నితంగా వ్యవహరించాలి. రచ్చకెక్కడం మంచిది కాదు’’ అని జగన్‌కు అమిత్‌షా చెప్పినట్లు తెలిసింది. న్యాయ వ్యవస్థతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, పరిపాలన సాగించడమే క్లిష్టంగా మారుతోందని జగన్‌ వివరించేందుకు ప్రయత్నించగా.. అమిత్‌షా వినిపించుకోలేదని సమాచారం. భారత దేశంలో న్యాయవ్యవస్థకు అత్యున్నత గౌరవం ఇస్తుండగా.. చరిత్రలో ఎక్కడా, ఎప్పుడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వమే కోర్టులను టార్గెట్‌ చేయడం ఏమిటని అమిత్‌షా నిలదీసినట్లు తెలిసింది. 


‘‘ఏదైనా ఉంటే న్యాయస్థానాల్లో అప్పీల్‌ చేసి తేల్చుకోవాలి. ఇది మాత్రం పద్ధతి కాదు’’ అని కఠినంగానే చెప్పినట్లు సమాచారం. సోషల్‌ మీడియాలో వైసీపీ నేతలు కోర్టులకు తప్పుడు ఉద్దేశాలు ఆపాదించడం, ఆ తర్వాత పార్టీ నేతలు ఒక్కొక్కరుగా బయటకొచ్చి న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడం, దానికి ప్రభుత్వం వత్తాసుగా నిలవడం ఈ భేటీలో ప్రధానంగా చర్చకొచ్చినట్లు తెలిసింది. సీఎంగా ఉన్న వ్యక్తి విచక్షణారహితంగా వ్యవహరించడం తగదని అమిత్‌షా మందలించినట్లు తెలుస్తోంది.

మరోవైపు.. ప్రజా ప్రతినిధులపై నమోదైన ఆర్థిక నేరాలు, క్రిమినల్‌ కేసులను ఏడాదిలోపు పరిష్కరించాలని సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, జగన్‌ తనపై ఉన్న కేసుల అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది.



సీబీఐ విచారణ జరపండి: జగన్‌ 


రాజధాని పరిధిలో టీడీపీ నేతలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, దానిపై సీబీఐ విచారణకు ఆదేశిస్తే నిజానిజాలు తెలుస్తాయని జగన్మోహన్‌ రెడ్డి అమిత్‌ షాకు చెప్పారు. ఫైబర్‌ గ్రిడ్‌ వ్యవహారంలో కూడా టెండర్ల నియమ నిబంధనలకు వ్యతిరేకంగా కాంట్రాక్టు ఖరారు చేశారని, దీనిపై కూడా సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన కోరారు. ఇటీవల జరిగిన అంతర్వేది రథం దహనంపైనా సీబీఐ దర్యాప్తునకు అంగీకరించాలని విన్నవించారు.


  అయితే.. అమిత్‌ షా ఈ విషయాలపై పెద్దగా స్పందించకుండా రాష్ట్రంలో జరుగుతున్న ఇతర పరిణామాల గురించి ఆరా తీసినట్లు సమాచారం. కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించినట్లు తెలిసింది. అలాగే...  రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులపై తమకు అందిన సమాచారం గురించి ప్రశ్నించగా... జగన్‌ తనవైపు నుంచి వివరణ ఇచ్చినట్లు తెలిసింది.


నేడు మరో విడత... 

మంగళవారం రాత్రి 40 నిమిషాలపాటు అమిత్‌ షాతో జగన్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశం అసంపూర్తిగా ముగియడంతో.. ఆయా అంశాలపై మరింత సమగ్రంగా చర్చించేందుకు మరోసారి తనతో భేటీ కావాలని... బుధవారం ఉదయం 10.30 గంటలకు రావాలని జగన్‌ను అమిత్‌షా ఆదేశించినట్లు సమాచారం.




పిలిపించి... మందలించి!

‘కేంద్ర మంత్రులకు పలు అంశాలపై వినతిపత్రాలు ఇచ్చేందుకు’ అని పైకి చెప్పినప్పటికీ.. కేంద్రమే జగన్‌ను ఢిల్లీకి పిలిపించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా జగన్‌ సర్కారు, ఆ పార్టీ నేతలు న్యాయ వ్యవస్థపైనా వ్యక్తిగత దాడులకు దిగుతుండటాన్ని తీవ్రంగా పరిగణించింది.


అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును కూడా ఇందుకు ఉపయోగించుకోవడం కేంద్రం ఆగ్రహానికి కారణమైంది. కోర్టులపై వైసీపీ సభ్యులు  చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించినప్పటికీ.. ఆ తర్వాత పార్లమెంటు ఆవరణలోనే మీడియా ముందు అవే  వ్యాఖ్యలు చేయడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించినట్లు తెలిసింది. వెంటనే వచ్చి కలవాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదేశం మేరకే... మంగళవారం జగన్‌ హుటాహుటిన  ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం.




అమిత్‌ షాతో ఒక్కరే... 

రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్రంతో చర్చించేందుకు అధికార బృందంతోపాటు  కేంద్ర మంత్రులను కలవడం సహజం. కానీ, జగన్‌ ఈసారి అడ్వొకేట్లను కూడా ఢిల్లీకి తీసుకెళ్లడం గమనార్హం. సీఎంతోపాటు అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ సుబ్రహ్మణ్యం, న్యాయవాది భూషణ్‌(సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చలమేశ్వర్‌ కుమారుడు), రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పేషీ అధికారులు ప్రవీణ్‌ప్రకాశ్‌, కృష్ణ మోహన్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు.  అమిత్‌ షా వద్దకు వెళ్లినప్పుడు జగన్‌తోపాటు ఎంపీ బాలశౌరి, ప్రవీణ్‌ప్రకాశ్‌, ఓఎస్డీ కృష్ణ మోహన్‌రెడ్డి మాత్రమే కారులో ఉన్నారు. విజయ సాయిరెడ్డి, మిథున్‌రెడ్డి జగన్‌ను ఢిల్లీ విమానాశ్రయంలోనే కలుసుకున్నారు. తన వెంట అమిత్‌షా వద్దకు రావద్దని వీరిద్దరికీ జగన్‌ అక్కడే చెప్పారు. చివరగా.. జగన్‌ ఒక్కరే అమిత్‌ షాతో సమావేశమయ్యారు.


 ఆ ఇద్దరితో పీఎంవో చర్చలు

న్యాయ వ్యవస్థపై లోక్‌సభలో మిథున్‌ రెడ్డి, రాజ్యసభలో విజయ సాయిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రికార్డుల నుంచి తొలగించిన తర్వాత కూడా మీడియా ముందు వారు ఇవే వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు జగన్‌తో అమిత్‌షా సమావేశం జరుగుతుండగానే.. ఏపీ భవన్‌లో ఉన్న ఈ ఇద్దరు వైసీపీ ఎంపీలతో  పీఎంవో అధికారులు వీడియో ద్వారా సమావేశం నిర్వహించారు.

‘‘రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు’’ అని వైసీపీ వర్గాలు చెబుతున్నప్పటికీ.. పీఎంవో ఇలా సమావేశం జరపడం అసాధారణ పరిణామం! సమావేశం తర్వాత వీరిద్దరూ దాని గురించి వివరించేందుకు జన్‌పథ్‌లో ఉన్న జగ న్‌ నివాసానికి వెళ్లారు.


Updated Date - 2020-09-23T07:21:09+05:30 IST