గోద్రా అల్లర్ల కేసును మళ్లీ చర్చలోకి తెచ్చిన జకియా జాఫ్రి

ABN , First Publish Date - 2021-11-11T02:41:30+05:30 IST

2012లో సిట్ ఇచ్చిన రిపోర్ట్ అసమగ్రంగా ఉందని, తమకు న్యాయం లభించే వరకు పోరాడుతానని ఆమె చెబుతోంది. ఈమె తరపున సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ వాదనలు వినిపిస్తున్నారు. ఆనాటి కేసును మళ్లీ విచారించాని జకియా తరపున కపిల్ సిబాల్ కోర్టుకు విన్నవించారు..

గోద్రా అల్లర్ల కేసును మళ్లీ చర్చలోకి తెచ్చిన జకియా జాఫ్రి

గాంధీనగర్: గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్ల కేసును జకియా జాఫ్రి (81) అనే మహిళ మరోసారి చర్చలోకి తీసుకువచ్చారు. ఈ కేసులో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని ఆమె సవాల్ చేస్తున్నారు. గుజరాత్ అల్లర్లలో ఆమె భర్త, కాంగ్రెస్ ఎంపీ ఎషాన్ జాఫ్రి మరణించారు. 2012లో సిట్ ఇచ్చిన రిపోర్ట్ అసమగ్రంగా ఉందని, తమకు న్యాయం లభించే వరకు పోరాడుతానని ఆమె చెబుతోంది. ఈమె తరపున సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ వాదనలు వినిపిస్తున్నారు. ఆనాటి కేసును మళ్లీ విచారించాని జకియా తరపున కపిల్ సిబాల్ కోర్టుకు విన్నవించారు.


2002 ఫిబ్రవరి 27న గోద్రా సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఎస్-6 అనే బోగి కాలిపోయి 59 మంది మరణించారు. ఆ మర్నాడు గుజరాత్ వ్యాప్తంగా తీవ్రమైన అల్లర్లు చెలరేగాయి. సుమారు 2000 మంది చనిపోయారని చెబుతున్న ఈ అల్లర్లలో అహ్మదాబాద్‌లోని గుల్బర్గ సొసైటీలో 68 మంది చనిపోయారు. కాగా, ఈ కేసుపై విచారణ చేపట్టిన సిట్ సుమారు పదేళ్ల పాటు దర్యాప్తు చేసి 2012 ఫిబ్రవరిలో రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్‌ను ఆధారం చేసుకుని ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా మరో 63 మందికి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.


కాగా, అల్లర్లు జరిగి అటు ఇటుగా 20 ఏళ్లు అవుతున్నా తమకు న్యాయం జరగలేదని జకియా వాపోతున్నారు. జకియా తరపున కోర్టు ముందు వాదనలు వినిపించిన కపిల్ సిబాల్ ‘‘పోలీసుల నిర్లక్ష్యం వల్లే ప్రజలను ఊచకోత కోశారు. ఈ కేసును విచారణలోకి తీసుకోవాలని అని నేను కోరుతున్నాను. శాంతిభద్రతల అంశంపై లోతుగా దర్యాప్తు జరగాలి. బ్యూరోక్రాటిక్ అధికారుల సంక్లిష్టత, ఉద్దేశపూర్వక ద్వేషపూరిత ప్రసంగాలు, హింసను ప్రోత్సహించడం లాంటి అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగాలి’’ అని అన్నారు.

Updated Date - 2021-11-11T02:41:30+05:30 IST