జలకళ ఏదీ..?

ABN , First Publish Date - 2020-12-01T06:31:23+05:30 IST

కరువు జిల్లాలో రైతుల పొలాల్లో జలకళ కనిపించట్లేదు. ఉచిత బోర్ల పథకానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. రెండు నెలల క్రితం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జలకళ పథకాన్ని ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో మాత్రం పథకం ముందుకు సాగట్లేదు.

జలకళ ఏదీ..?

ఉచిత బోర్ల పథకానికి ఆదిలోనే హంసపాదు 

రెండు నియోజకవర్గాలకు కాంట్రాక్టర్లు కరువు

వేధిస్తున్న జియాలజిస్టుల కొరత 

ఇప్పటిదాకా 10 బోర్లే వేసిన వైనం

సాఫ్ట్‌వేర్‌ మార్పునకు దరఖాస్తుల స్వీకరణ నిలిపివేత

అధికార పార్టీ వర్గానికే ప్రాధాన్యత

అనంతపురం వ్యవసాయం, నవంబరు 30: కరువు జిల్లాలో రైతుల పొలాల్లో జలకళ కనిపించట్లేదు. ఉచిత బోర్ల పథకానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. రెండు నెలల క్రితం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జలకళ పథకాన్ని ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో మాత్రం పథకం ముందుకు సాగట్లేదు. ఇప్పటిదాకా ఆశించిన స్థాయిలో రైతుల పొలాల్లో బోర్లు వేయలేకపోయారు. సంబంధిత ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్ల ముందస్తు ప్రణాళిక లోపమే ఇందుకు కారణమన్న విమర్శలున్నాయి.

జిల్లావ్యాప్తంగా ఇప్పటి దాకా కేవలం 10 బోర్లు మాత్రమే వేశారు. సాఫ్ట్‌వేర్‌ మార్పునకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పక్షం రోజులుగా నిలిపేశారు. ఎన్ని రోజుల్లో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేస్తారో తెలియని అయోమయం నెలకొంది. దీంతో కరువు రైతులకు నిరీక్షణ తప్పట్లేదు. ఎప్పటిలోగా రైతుల పొలాల్లో బోర్లు వేస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. తొలుత ఐదెకరాల్లోపు భూమి కలిగిన రైతులు ఉచిత బోర్లకు అర్హులుగా నిర్ణయించారు. రైతుల నుంచి వ్యతిరేకత రావటంతో ఆ నిబంధనను సడలించారు. ఇప్పటిదాకా బోరు వేసుకోని రైతులకు ఎంత విస్తీర్ణం భూమి ఉన్నా.. అర్హులుగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో ప్రాధాన్యతలో ఇదివరకు బోరు వేసుకుని, ఎండిపోయినా ఉచిత బోర్లు వేసేందుకు అనుమతించాలని ఉత్తర్వులు అందాయి.


కాంట్రాక్టర్లు కరువు

జిల్లాలో ఉచిత బోర్లు వేసేందుకు నియోజకవర్గానికి ఒక కాంట్రాక్టర్‌ను నియమించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 12 నియోజకవర్గాలకు కాంట్రాక్టర్లను నియమించారు. హిందూపురం, మడకశిరకు నేటికీ ఎవరినీ నియమించపోవటం గమనార్హం. దీనిపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ జలకళ ప్రారంభం రోజే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో బోర్లు వేసేందుకు కాంట్రాక్టర్‌కు అడుగుకు రూ.130 నుంచి రూ.140 చెల్లించేలా ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరకు ఆయా నియోజకవర్గాల్లో బోర్లు వేయటం కష్టమనే అభిప్రాయంతో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆ రెండు నియోజకవర్గాలకు రీ టెండర్లు పిలిచేందుకు ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు.


వేధిస్తున్న జియాలజిస్టుల కొరత

ప్రభుత్వ నిబంధనల మేరకు ఆయా నియోజకవర్గాల్లో దరఖాస్తు చేసుకున్న రైతుల పొలాల్లో ముందస్తుగా పాయింట్లు పెట్టేందుకు జియాలజిస్టులను కాంట్రాక్టర్లు సమకూర్చుకోవాలి. టెండర్‌ ఖరారుతో  జియాలజి్‌స్టలను కాంట్రాక్టర్లే నియమించుకుని, వేతనం ఇ వ్వాలని నిర్ణయించారు. జియాలజిస్టులను నియమించుకోవటంలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఒక్కో బోరు పాయింట్‌ పెట్టేందుకు రూ.5 వేలు ఇవ్వాలని జియాలజిస్టులు డి మాం డ్‌ చేస్తున్నట్లు తెలిసింది. ముందస్తు ప్రణాళిక లు లేకపోవటంతోనే ఈ సమస్య తలెత్తిందన్న అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. తద్వారా ఇ ప్పటిదాకా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన రైతుల పొలాల్లో బోరు పాయింట్‌ పెట్టడంలో తీవ్ర జాప్యమవుతోంది.


అధికార పార్టీ వర్గానికే ప్రాధాన్యత

ఉచిత బోర్ల కోసం అర్హులైన రైతులు స్థానిక సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా 15,200 మంది దాకా రైతులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. జిల్లాలో ఇప్పటిదాకా దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువశాతం అధికార పార్టీ నేతలు సిఫార్సు చేసిన జాబితాలోని వారే ఉన్నారన్న విమర్శలున్నాయి. పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీ స్థానిక నాయకులు చెప్పిన వారితోనే సచివాలయాల్లో దరఖాస్తు చే సేందుకు అవకాశం ఇస్తున్నట్లు విమర్శలున్నాయి. నేరుగా ఎవరైనా రైతులు వెళితే పట్టించుకోవట్లేదన్న ఆరోపణలున్నాయి. మరికొన్ని చోట్ల ముందుగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చినా, ఆ తర్వాత నేతలు చెప్పి జాబితాలోని వారినే ఓకే చేస్తున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటివరకు బోర్లు వేసుకోని, అర్హులైన రైతులకు అన్యాయం వాటిల్లుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


అర్హులైన రైతులకు న్యాయం చేస్తాం

నిబంధనల మేరకు కలకళ పథకంలో అర్హులైన ప్రతి రైతుకూ ఉచితంగా బోరు వేయిస్తాం. కొన్ని రోజులుగా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేస్తుండటంతో దరఖాస్తుల స్వీకరణ ఆపేశారు. త్వరలో పునఃప్రారంభిస్తాం. కొత్త వెర్షన్‌లో ఎన్ని అడుగుల లోతుకు బోర్లు వేస్తున్నారన్న సమాచారం నేరుగా తెలిసిపోతుంది. పారదర్శకత కోసమే సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేస్తున్నారు. జియాలజిస్టుల కొరత ఉన్న మాట వాస్తవమే. దానిని అధిగమించి, పథకాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

- వేణుగోపాల్‌రెడ్డి, పీడీ, డ్వామా

Updated Date - 2020-12-01T06:31:23+05:30 IST