జల్‌జీవన్‌ నిధులు పక్కదారి

ABN , First Publish Date - 2021-08-26T05:20:21+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జల్‌జీవన్‌ పథకం నిధులు పక్కదారి పడుతున్నాయి. ఈ నిధులను రాష్ట్రం ప్రభుత్వం నవరత్నాలు పథకాలకు మళ్లిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఈ పనులు చేపట్టాల్సి ఉంది. దీనికోసం కేంద్రం పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తోంది. వీటితో పనులు చేపట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ నిధులను ఇతర పథకాలకు వినియోగిస్తోంది. పైగా తన వాటా నిధుల విడుదలలో జాప్యం చేస్తోంది. దీంతో జిల్లాలో జల్‌జీవన్‌ పనులు నిలిచిపోయాయి.

జల్‌జీవన్‌ నిధులు పక్కదారి
అల్లిమెరకకాలనీలో నిలిచిన ట్యాంకు నిర్మాణ పనులు

- ‘నవరత్నాలకు’ మళ్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

- నిలిచిన రూ.45 కోట్ల చెల్లింపులు

- జిల్లాలో స్తంభించిన పనులు

- ముందుకు రాని కాంట్రాక్టర్లు 

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జల్‌జీవన్‌ పథకం నిధులు పక్కదారి పడుతున్నాయి. ఈ నిధులను రాష్ట్రం ప్రభుత్వం నవరత్నాలు పథకాలకు మళ్లిస్తున్నట్లు ఆరోపణలు  వినిపిస్తున్నాయి. వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఈ పనులు చేపట్టాల్సి ఉంది. దీనికోసం కేంద్రం పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తోంది. వీటితో పనులు చేపట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ నిధులను ఇతర పథకాలకు వినియోగిస్తోంది. పైగా తన వాటా నిధుల విడుదలలో జాప్యం చేస్తోంది. దీంతో జిల్లాలో జల్‌జీవన్‌ పనులు నిలిచిపోయాయి. జిల్లాలో 2021-22 సంవత్సరానికిగాను జల్‌జీవన్‌ పథకం కింద 2,36,652 గృహాలకు కుళాయిల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటికే 1786 గ్రామాల్లో రూ.35.15 కోట్లతో పనులు చేపట్టేందుకు నిధులు మంజూరయ్యాయి. వీటిలో కేవలం 257 పనులు మాత్రమే పూర్తయాయి. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 50 శాతం నిధులకు.. రాష్ట్ర ప్రభుత్వం మరో 50 శాతం నిధులు మ్యాచింగ్‌ గ్రాంటుగా విడుదల చేసి ఈ పనులు చేపట్టాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల అమలుకు అధిక ప్రాధాన్యం ఇస్తుండడంతో జల్‌ జీవన్‌ నిధులను వాటికి దారి మళ్లిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత ఏడాది చేపట్టిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.45 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభు త్వం తన వాటా కింద విడుదల చేయాల్సిన 50 శాతం మ్యాచింగ్‌ నిధుల జాప్యంతో పనులు జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్క ఉద్దానం ప్రాజెక్టు పనులకే రూ.150 కోట్లు చెల్లించాల్సి ఉంది.


కాంట్రాక్టర్ల అవతారమెత్తుతున్న ఇంజనీర్లు

జల్‌జీవన్‌ మిషన్‌ పనుల కోసం ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్లు  అనేకసార్లు టెండర్లు పిలిచినా, కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఇప్పటికే చేపట్టిన పనులకు బిల్లులు రాకపోవడంతో కొత్త పనులకు వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇవి త్వరలోనే పూర్తవుతాయిని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు బయటకు చెబుతున్నా.. ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు నామినేషన్‌ పద్ధతిలో స్థానిక కమిటీల పేరుతో పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. రూ.5లక్షల లోపు పనులను కొందరు ఇంజనీర్లే కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి కానిచ్చేస్తున్నారు. ఇవి కూడా వేగవంతం కావడం లేదు. రూ.40 లక్షల అంచనాలతో 1,199 పనులు చేపట్టాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకొన్నారు. వీటిలో 579 పనులకు టెండర్లు పిలవగా.. కేవలం 171 పనులకు మాత్రమే దాఖలయ్యాయి. మిగిలిన పనులకు ఒక్క టెండరు కూడా పడలేదు. రెండో కేటగిరీ కింద అధికారులు రూ.40 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు అంచనాలతో 126 పనులకు ప్రతిపాదనలు తయారు చేశారు. వీటికి టెండర్లను ఆహ్వానిస్తే.. ఏడు పనులకు మాత్రమే కాంట్రాక్టర్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక రూ.2కోట్లు దాటి చేపట్టే మూడు రక్షిత పథకాలకు ప్రతిపాదనలు చేయగా... కేవలం 3 టెండర్లు మాత్రమే దాఖలయ్యాయి. ఇప్పటికే రెండు పర్యాయాలు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ప్రతి పనికి సంబంధించిన పూర్తి డేటాను ఎప్పటికప్పుడు జియో ట్యాగింగ్‌ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అప్పుడే బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉంది. ఈ నిబంధన వల్లనే పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. 


అరకొర పనులతో సరి!

హరిపురం : మందస మండలంలో జల్‌జీవన్‌ పథకం పనులు  అరకొరగానే కొనసాగుతున్నాయి. మండలంలో 48 ఓవర్‌హెడ్‌ ట్యాంకులు నిర్మాణంలోనే ఉన్నా... ఒక్కటీ పూర్తి కాలేదు. పైపులైన్లు కూడా కొన్నిచోట్ల ఇంకా ప్రారంభం కాలేదు.  ఈ విషయమై ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈఈ దుర్యోధన వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా, వర్షాలతో పనులు కొంత నెమ్మదించినా.. కొనసాగుతున్నాయన్నారు. గడువులోగా పూర్తి చేస్తామని తెలిపారు. 


టెండరు దశలోనే...

పలాస రూరల్‌ : పలాస మండలంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జలజీవన్‌ మిషన్‌ ప్రాజెక్టు పనులు ఇంకా టెండరు దశలోనే ఉన్నాయి. టెండర్లు పూర్తి కాకపోవడంతో పనులు నత్తనడకగా సాగుతున్నాయి. కేదారిపురం వద్ద, వజ్రపుకొత్తూరు మండలం బెండికొండ వద్ద ట్యాంకుల నిర్మాణానికి  పనులు ప్రారంభించారు. కానీ, ఇంకా పునాది దశలోనే  ఉన్నాయి.  ఇవి పూర్తిచేస్తే సుమారు 40 గ్రామాలకు తాగునీటి సమస్య తీరుతుంది. ఈ విషయంపై ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ రాజేష్‌ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా, పనులు చురుగ్గానే సాగుతున్నాయని తెలిపారు. కేదారిపురం వద్ద ట్యాంకు నిర్మిస్తామని చెప్పారు. 


వేగవంతం చేస్తాం

జల్‌జీవన్‌ పనులకు నిధుల కేటాయించకపోవడంతో బిల్లుల చెల్లింపులో జాప్యమవుతోంది. మరోపక్క కరోనా కారణంగా పనులు ముందుకు సాగడం లేదు.  కలెక్టర్‌ ఆదేశాల మేరకు మళ్లీ టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేశాం. ప్రస్తుతం చేపడుతున్నవి వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రతిరోజు సంబంధిత డీఈఈలతో మాట్లాడుతున్నాం. లక్ష్యాలకు అనుగుణంగా  పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశాం. 

- వీరభద్రరావు, ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌, శ్రీకాకుళం

Updated Date - 2021-08-26T05:20:21+05:30 IST