రంకెలేసిన ఎద్దులు.. సై అన్న యువకులు

ABN , First Publish Date - 2022-01-18T14:11:26+05:30 IST

ప్రపంచ ప్రసిద్ధిచెందిన మదురై జిల్లా అలంగా నల్లూర్‌ జల్లికట్టు సోమవారం ఉత్సాహం గా సాగింది. కొవిడ్‌ నిబంధనలు, 2 వేల మందికి పైగా పోలీసుల భారీ బందోబస్తు నడుమ ఈ సంప్రదాయ సాహస జల్లికట్టు

రంకెలేసిన ఎద్దులు.. సై అన్న యువకులు

- కోలాహలంగా అలంగానల్లూర్‌ జల్లికట్టు

-  2 వేల మంది పోలీసులతో బందోబస్తు


ప్యారీస్‌(చెన్నై): ప్రపంచ ప్రసిద్ధిచెందిన మదురై జిల్లా అలంగా నల్లూర్‌ జల్లికట్టు సోమవారం ఉత్సాహం గా సాగింది. కొవిడ్‌ నిబంధనలు, 2 వేల మందికి పైగా పోలీసుల భారీ బందోబస్తు నడుమ ఈ సంప్రదాయ సాహస జల్లికట్టు పోటీలను నిర్వాహకులు పకడ్బందీగా నిర్వహించారు. ఆదివారం జరగాల్సిన ఈ పోటీలను సంపూర్ణ లాక్‌డౌన్‌ కారణంగా సోమవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.. ఈ పోటీల్లో పాల్గొనే యువకులు రెండు రోజుల ముందే ఆన్‌లైన్‌ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో 300 మంది యువకులు, 700 ఎద్దులను అనుమతించారు. ఒక రౌండ్‌కు 30 మంది యువకులు మైదానంలోకి దిగి రంకెలేస్తూ పరుగులు తీసిన పోట్లగిత్తలను అదుపు చేసేందుకు సాహసించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ తరఫున, ఆయన కుమారుడు ఎమ్మెల్యే ఉదయనిధి విజేతలకు, ఎవరికీ పట్టుబడని ఎద్దులకు విలువైన బహుమతులు అందజేశారు. ఉదయం 8 గంటలకు అలంగానల్లూర్‌లో ఏర్పాటుచేసిన జల్లికట్టు ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్‌, పశుసంవర్ధక శాఖ అధికారులు పరిశీలించారు. ఎద్దులను అదుపుచేసే క్రమంలో గాయపడిన యువకులను అప్పటికప్పుడు అంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రులకు తరలించారు. అదే విధంగా, పోట్లగిత్తల కోసం వెటర్నరీ శాఖ తరఫున ప్రత్యేక అంబులెన్స్‌, సిబ్బందిని మైదానం పరిసరాల్లో సిద్ధంగా ఉంచారు. ప్రారంభంలో వాడివాసల్‌ గుండా బయటకు పరుగులు తీసిన ఎద్దులు యువతకు సవాల్‌ విసిరాయి. ప్రేక్షకుల కరతాళ ద్వనులు, నిర్వాహకుల ప్రోత్సాహంతో యువకులు ధైర్య సాహసాలు ప్రదర్శించి, కొన్ని పోట్లగిత్తలను అదుపుచేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఈ ఏడాది కూడా గతంలోలాగే విజేతలకు కారు, బంగారు, వెండి నాణేలు, ద్విచక్రవాహనాలు, కుక్కర్‌, గ్రైండర్‌ తదితర ఎలక్ట్రికల్‌ వస్తువులు బహుమతిగా అందజేశారు.


పుదుకోట జిల్లాలో...

పుదుకోట జిల్లా అలంగుడి సమీపంలో ఉన్న వన్నియన్‌విడిదిలో సోమవారం జల్లికట్టు పోటీలను కొవిడ్‌ నిబంధనల ప్రకారం నిర్వహించారు. కలెక్టర్‌ కవిత రాము అధ్యక్షతన న్యాయశాఖ మంత్రి ఎస్‌.రఘుపతి, పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌, యువజన సంక్షేమం, క్రీడా శాఖ మంత్రి మెయ్యనాథన్‌ జెండా ఊపి పోటీలు ప్రారంభించారు. ఇందులో 700 ఎద్దులు, 250 మంది యువకులకు అనుమతించారు. పొగరు బోతు గిత్తలను అదుపుచేసే యత్నంలో కొందరు యువకులతో పాటు ప్రేక్షకుల్లో ఒకరికి గాయాలయ్యాయి. వారికి ఆ ప్రాంగణంలో వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. ఎద్దులు అదుపుచేసిన యువకులు, పట్టుబడని ఎద్దుల యజమానులకు రకరకాల బహుమతులు అందజేశారు. జిల్లా ఎస్పీ నేతృత్వంలో పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొన్నారు.


కీల్‌ముట్టుకూరులో ఒకరి మృతి

వేలూరు: కీల్‌ముట్టుకూరులో సోమవారం నిర్వహించిన జల్లికట్టు పోటీల్లో 200 మంది పాల్గొన్నారు. ఈ పోటీలు చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరాగా, ఎద్దు పొడవడంతో ఆరణికి చెందిన నామిదేవన్‌ (60) మృతిచెందాడు.




Updated Date - 2022-01-18T14:11:26+05:30 IST