కేంద్రంపై గులాం నబీ ఆజాద్ ఘాటు విమర్శలు

ABN , First Publish Date - 2021-11-28T00:25:14+05:30 IST

జమ్మూ-కశ్మీరును ఓ రాష్ట్రం నుంచి కేంద్ర పాలిత ప్రాంతం

కేంద్రంపై గులాం నబీ ఆజాద్ ఘాటు విమర్శలు

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరును ఓ రాష్ట్రం నుంచి కేంద్ర పాలిత ప్రాంతం స్థాయికి తగ్గించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తీవ్రంగా మండిపడ్డారు. సాధారణంగా కేంద్ర పాలిత ప్రాంతాన్ని రాష్ట్రంగా మార్చుతారని, కానీ జమ్మూ-కశ్మీరు విషయంలో రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతం స్థాయికి దిగజార్చారని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది డీజీపీని పోలీసు కానిస్టేబుల్‌గానూ, ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేగానూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పట్వారీగానూ మార్చడం వంటిదని చెప్పారు. వివేకంగలవారు ఎవరూ ఇలా చేయబోరన్నారు. కుల్గాంలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  


ఇదిలావుండగా, గులాం నబీ ఆజాద్ గత నెలలో మాట్లాడినపుడు జమ్మూ-కశ్మీరులో పరిస్థితులు అధికరణ 370ని రద్దు చేయడానికి పూర్వమే బాగుండేవని చెప్పారు. ఈ అధికరణను రద్దు చేసిన తర్వాత జమ్మూ-కశ్మీరులో పరిస్థితులు మారుతాయని తమకు చెప్పారన్నారు. అభివృద్ధి జరుగుతుందని, ఆసుపత్రులు వస్తాయని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారన్నారు. కానీ ఇవేమీ ఇప్పుడు జరగడం లేదని పేర్కొన్నారు. వాస్తవానికి వివిధ ముఖ్యమంత్రుల పరిపాలనా కాలంలోనే చాలా బాగుండేదన్నారు. 


Updated Date - 2021-11-28T00:25:14+05:30 IST