జయహే.. మహిషాసురమర్దిని

ABN , First Publish Date - 2021-10-17T05:13:57+05:30 IST

దసరా సంబరాలను రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు శుక్రవారం అనందోత్సహాల మధ్య జరుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మహిషాసుర మర్ధిని అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.

జయహే.. మహిషాసురమర్దిని
సిరిసిల్లలో రావణ దహనం

 - భవానీ దీక్షల విరమణ

- ఆలయాల్లో ప్రత్యేక పూజలు

- శమీ దర్శనానికి తరలివచ్చిన జనం

-  ఘనంగా దసర ఉత్సవాలు 

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

దసరా సంబరాలను రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు శుక్రవారం అనందోత్సహాల మధ్య జరుపుకున్నారు.  జిల్లా వ్యాప్తంగా మహిషాసుర మర్ధిని అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వేములవాడ  రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో అమ్మవారితోపాటు మండలాల్లో అంబాభవానీ నిమజ్జనోత్సవాలు వైభవంగా సాగాయి. సిరిసిల్ల  లక్ష్మీ వేంకటేశ్వరస్వామి అశ్వ వాహనంపై మానేరు మాండవీయ నది తీరంలో శమీ దర్శనం నిర్వహించారు. అనంతరం మానేరు నది వద్ద  శమీ గద్దె వద్ద అలయ అర్చకులు పూజలు చేశారు. హిందూ ఉత్సవ సమితి ఆద్వర్యంలో రావణ దహనాన్ని నిర్వహించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాంస్కృతిక వేడుకలు ఘనంగా చేపట్టారు. ముఖ్య అతిధిగా చిత్తూరు జిల్లా గీతాశ్రమానికి చెందిన చిదానందగిరి స్వామి హాజరయ్యారు. సంస్కృతి సంప్రాదాయాలకు పండుగ విశిష్టతను తెలిపారు. శమీదర్శనం, రావణ దహానాన్ని వీక్షించడానికి వందలాది మంది  తరలివచ్చారు.హిందూ ఉత్సవ సమితి వేడుకల్లో అధ్యక్షుడు చేపూరి శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఆడెపు రవీందర్‌, కౌన్సిలర్లు వెల్దండి దేవదాస్‌, దార్నం అరుణ, పత్తిపాక పద్మ, టౌన్‌క్లబ్‌ మాజీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, గాజుల వేణు, సత్యం పాల్గొన్నారు. ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో జమ్మి చెట్టుతో శోభాయాత్ర నిర్వహించారు. ఉదయం పోలీస్‌ హెడ్‌ క్వార్టర్‌లో డీఎస్పీ చంద్రశేఖర్‌ ఆయుధ పూజలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ విజయదశమి పండుగ జిల్లా ప్రజలకు అన్ని రంగాల్లో విజయం చేకూర్చాలని కోరారు. శక్తికి ప్రతీకగా నిల్చే దుర్గామాత సమక్షంలో   ఆయుధాలకు ఎంతో శక్తి ఉంటుందన్నారు.  జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్‌లో ఆయుధ పూజలు చేపట్టారు. జిల్లా కేంద్రంతోపాటు మండలాల్లో దుర్గామాత శోభయాత్ర నిర్వహించి నిమజ్జనం చేశారు. అంబాభవానీ దీక్షపరులు దీక్షలను విరమించారు. 

 ప్రత్యేక శోభ 

దసరా శోభ పల్లెల్లో ప్రత్యేకతను నింపింది. వ్యవసాయ ట్రాక్టర్లు, తమ నాగళ్లు, పని ముట్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. కొవిడ్‌ నేపథ్యంలో వర్క్‌ఫ్రంహోంతో  ఉద్యోగులు ఇళ్లలోనే   ఉండడంతో పల్లెల్లో సందడి కనిపించింది. దసరా రోజు ఏది కొనుగోలు చేసినా శుభం కలుగుతుందని కొత్త వస్తువుల కొనుగోళ్లు చేపట్టారు. ద్వి చక్రవాహనాలు, కార్లు, ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. గృహాలకు ఉపయోగపడే టీవీలు, రిఫ్రిజిరేటర్‌ల కొనుగోళ్లతో దుకాణాలు కిటకిటలాడాయి.

Updated Date - 2021-10-17T05:13:57+05:30 IST