శశికళ విడుదల రోజే ‘అమ్మ’ స్మారక మందిరం ప్రారంభం.. ఎందుకిలా..!?

ABN , First Publish Date - 2021-01-14T17:26:04+05:30 IST

శశికళ విడుదల రోజే ‘అమ్మ’ స్మారక మందిరం ప్రారంభం.. ఎందుకిలా..!?

శశికళ విడుదల రోజే ‘అమ్మ’ స్మారక మందిరం ప్రారంభం.. ఎందుకిలా..!?

చెన్నై : స్థానిక మెరీనాబీచ్‌లో నిర్మితమవుతున్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్మారక మందిరాన్ని ఈనెల 27వ తేదీన రాష్ట్ర ముఖ్య మంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నా యి. ఏప్రిల్‌ మాసంలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. దానికి సంబంధించిన ఎన్నికల కోడ్‌ ఫిబ్రవరి మాసంలో అమలులోకి వచ్చే అవకాశముంది. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక ఏ పార్టీ అధికారంలో వస్తుందో తెలియనందున, ఎన్నికల కోడ్‌ వచ్చే లోపే జయ స్మారక మందిరాన్ని అధికారపూర్వకంగా ప్రారంభించాలని ముఖ్య మంత్రి గట్టిగా భావిస్తున్నారు.


ఇందులో భాగంగా సాధ్య మైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను పురమా యించారు. ఆ పనులు పూర్తికావచ్చిన నేపథ్యంలో మంగళవారం ముఖ్యమంత్రి నేరుగా మెరీనాబీచ్‌కు వెళ్లి స్మారక మందిరాన్ని పరిశీలించిన విషయం తెలిసిందే. పనులు జరుగుతున్న తీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం.. ఈ నెల 27వ తేదీన ప్రారంభించాలని ముహూర్తం నిర్ణయించారు. ఫీనిక్స్‌ పక్షి పోలికతో రూపుదిద్దుకుంటున్న ఈ స్మారకమందిరం కోసం రూ.79.75 కోట్లు కేటాయించారు. ముఖద్వారంలో రెండు సింహాలు నిలబడి వుండి సందర్శకులను స్వాగతం పలికేలా రూపొందించారు. 15 మీటర్ల ఎత్తు, 30 మీటర్ల పొడవు, 43 మీటర్ల వెడల్పుతో రూపొందించిన ఫీనిక్స్‌ ఆకారానికి 500 టన్నుల ఉక్కు, 1,068 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను వినియోగించారు. ఇతరాలకు 30 టన్నుల ఉక్కు, 800 క్యూబిక్‌ మీటర్ల సిమెంట్‌ కాంక్రీట్‌ను ఉపయోగించారు. 


మోదీకి ఆహ్వానం

ఈ నెల 18వ తేదీన ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి.. జయ స్మారకమందిరం ప్రారంభోత్సవంలో పాల్గొనాలని కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఫిబ్రవరి మొదటివారంలో జరుగనున్న కావేరి-గుండారు పథకం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి కార్యాలయం ఇప్పటికే అంగీకరించినందున జయ స్మారకమందిరం ప్రారంభోత్సవంలో మోదీ పాల్గొనే అవకాశం లేదని అధికారవర్గాలు వివరించాయి.


శశికళ విడుదల రోజే ఎందుకు?

అక్రమాస్తుల కేసులో పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న జయ నెచ్చెలి శశికళ ఈనెల 27వ తేదీన విడుదల కానున్నారు. అయితే ఆ రోజే జయ స్మారక మందిరం ప్రారంభించడం ఉద్దేశపూర్వకమా, లేక యాదృచ్ఛికమా అన్నది అధికార, రాజకీయవర్గాల్లో చర్చనీయాం శంగా మారింది. శశికళ జైలుకు వెళ్లినరోజు జయ సమాధి వద్ద అంజలి ఘటిస్తూ చేసిన శపథం ఆమె ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిందనేది నిర్వివాదాంశమే. తన ను ఆ స్థితికి చేర్చిన వారిని అధోగతి పాల్జేస్తానని ఎర్రబా రిన కళ్లతో ఆమె అక్కడే ప్రకటించారు. అనంతరం ఆమె బహిరంగంగానే ఎడప్పాడిని, ఓపీఎస్‌ను ద్రోహులుగా అభివర్ణించారు. అందువల్ల ఆమె జైలు నుంచి విడుదల కాగానే వీరిద్దరిపైనే కక్ష సాధించే అవకాశముందని ఆమె గురించి బాగా తెలిసిన వారు చెబుతున్నారు. 


ఈ నేపథ్యంలో శశికళ జైలు నుంచి విడుదలయ్యే రోజే జయ స్మారకమందిరం ప్రారంభించడం ఈపీఎస్‌ వ్యూహంలో భాగమా లేక మరేదైనా అన్నదానిపై అన్నాడీఎంకేలో రకరకాల ఊహాగానాలు రేగుతున్నాయి. నిజానికి కోట్లాది రూపాయల అక్రమార్జన కేసులో దోషిగా మిగిలిన జయకు స్మారకమందిరం నిర్మించడమేంటని ప్రత్యర్థి పార్టీ డీఎంకేతో పాటు మిత్రపక్షమైన పీఎంకే కూడా అప్పట్లో అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని నిలదీసింది. దాంతో జయ స్మారకమందిర నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. దీనిపట్ల శశికళ మద్దతుదారులు కూడా ముఖ్యమంత్రి వైఖరిపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురైనా స్మారకమందిరం పూర్తి చేశామని, నిజమైన వారసుడిని తానేనన్న సంకేతాలను పంపడం కూడా ఈపీఎస్‌ ఉద్దేశమని తెలుస్తోంది. ఒకరకంగా ఇది శశికళపై ఎదురుదాడిలాంటిదని, ఆమె విషయంలో ఈపీఎస్‌ ఉద్దేశమేంటో తెలియాలన్న కారణంగానే ఆమె విడుదలైన రోజునే స్మారకమందిరం ప్రారంభోత్సవం పెట్టారని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.

Updated Date - 2021-01-14T17:26:04+05:30 IST