పంట నష్టం అంచనాలకు ప్రత్యేక బృందాలు

ABN , First Publish Date - 2020-12-01T05:39:59+05:30 IST

నివర్‌ తుఫాన్‌ పంట నష్టం అంచనాలను నేటి నుంచి ప్రత్యేక యాప్‌లో నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

పంట నష్టం అంచనాలకు ప్రత్యేక బృందాలు
ముట్లూరులో రైతులతో మాట్లాడుతున్న సివిల్‌ సప్లయీస్‌ ఎండీ సూర్యకుమారి, జేసీ దినేష్‌కుమార్‌ తదితరులు

నేటి నుంచి యాప్‌లో పేర్ల నమోదు

10లోపు నష్టం సర్వేను పూర్తిచేయాలి

వ్యవసాయ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌


గుంటూరు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): నివర్‌ తుఫాన్‌ పంట నష్టం అంచనాలను నేటి నుంచి ప్రత్యేక యాప్‌లో నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆరు ప్రత్యేక బృందాలు పంట నష్టం అంచనా వేస్తున్నాయి. వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది పంటనష్టం అంచనాలను సేకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తడిసిన పంటలను పరిశీలించి వీడియోలో రికార్డు చేస్తున్నారు. చేబ్రోలు, వట్టిచెరుకూరు మండలాల్లో సోమవారం సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ ఎండీ సూర్యకుమారి, జేసీ దినేష్‌ పర్యటించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రైతుల నుంచి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. జిల్లాలో 44 మండలాల్లోని 497 గ్రామాల్లో సూమారు రెండు లక్షల హెక్టార్లలో వరి, మినుము, పెసర పంటలు, 30 మండలాల్లో సుమారు ఆరువేల హెక్టార్లలో మిర్చి, పసుపు, బొప్పాయి, తమలపాకు, అరటి, కూరగాయల తోటలు వాననీటిలో  మునిగినట్లు వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. సర్వే పూర్తయితే నష్టం పెరుగుతోందని అధికారులు తెలిపారు.  ఈ నెల10వ తేదీలోపు అంచనాల సేకరణ, సర్వే పూర్తి చేయాలని వ్యవసాయ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ సోమవారం  సెట్‌ కాన్ఫరెన్స్‌లో అదికారులను ఆదేశించారు.  ఇదిలాఉంటే పంట పొలాల్లోకి చేరిన వాననీటిని తొలగించటానికి  అధికారులు  కసరత్తు చేస్తున్నారు. పొక్లెయిన్‌,  ఆయిల్‌ ఇంజన్లు, మోటార్లు, పైపులతో పంటకాలువల్లో పూడిక, తూటుకాడ, వాననీటిని తాత్కాలికంగా తొలగిస్తున్నారు.


ప్రత్తిని ఎండబెట్టి తీసుకురావాలి

ప్రత్తి రైతులు వర్షాలకు తడిసిన ప్రత్తిని ఎండలో ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని జాయింట్‌ కలెక్టర్‌(రైతుభరోసా) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు. జిల్లాలోని 42 జిన్నింగ్‌ మిల్లులు, తాడికొండ, సత్తెనపల్లి, నరసరావుపేట, క్రోసూరు మార్కెట్‌యార్డుల్లో ప్రత్తి కొనుగోలు కేంద్రాలు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చామని, వీటిని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. 

Updated Date - 2020-12-01T05:39:59+05:30 IST