జేసీ వర్సెస్‌ డీఎంహెచ్‌వో

ABN , First Publish Date - 2020-07-18T09:53:04+05:30 IST

విజయవాడలోని రాష్ట్రస్థాయి కొవిడ్‌ ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యవైఖరి జిల్లా జాయింట్‌ కలెక్టరు (అభివృద్ధి), జిల్లా ..

జేసీ వర్సెస్‌ డీఎంహెచ్‌వో

ట్రూనాట్‌ యంత్రాలను వినియోగించకపోవడంపై జేసీ సీరియస్‌ 

తనను విధుల నుంచి తప్పించాలని అంతే సీరియస్‌గా డీఎంహెచ్‌వో లేఖ


(ఆంధ్రజ్యోతి - విజయవాడ/ మచిలీపట్నం): విజయవాడలోని రాష్ట్రస్థాయి కొవిడ్‌ ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యవైఖరి జిల్లా జాయింట్‌ కలెక్టరు (అభివృద్ధి), జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి మధ్య వివాదానికి దారితీసింది. ఈ ఇద్దరు ఉన్నతాధికారులు ఎవరి వాదనలు వారు వినిపిస్తూ, కలెక్టరుకు, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. ఆ వివరాలు సోషల్‌ మీడియా ద్వారా బయటకు రావడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. గురువారం విజయవాడలో కరోనాపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా ప్రత్యేక అధికారి సిద్ధార్థ జైన్‌ వైద్య ఆరోగ్యశాఖ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీవ్రస్థాయిలో మండిపడినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జేసీ (అభివృద్ధి) శివకుమార్‌ స్పందిస్తూ.. ‘విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిలో ట్రూనాట్‌ యంత్రాలను ఇన్‌స్టాల్‌ చేయాలని, కరోనా పరీక్షలను వేగవంతం చేయాలని 15 రోజులుగా కలెక్టరు పదేపదే సూచిస్తుంటే, డీఎంహెచ్‌వో, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌, ట్రూనాట్‌ ల్యాబ్‌ ఇన్‌చార్జ్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పరీక్షల ఫలితాలు పెండింగ్‌లో ఉండిపోతున్న కారణంగా మార్చురీలో ఉన్న మృతదేహాలను దహన సంస్కారాలకు పంపించడం కూడా సాధ్యం కావడం లేదు. ప్రజలకు వేగంగా పరీక్షలు నిర్వహించలేకపోతున్నాం. దీంతో సామాన్య ప్రజలు ఎంత బాధపడుతున్నారో అందరికీ తెలుసు.


అధికారుల నిరంతర పర్యవేక్షణ ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కాబట్టి రేపు మధ్యాహ్నానికల్లా జీజీహెచ్‌లో ట్రూనాట్‌ యంత్రాలను అమర్చడానికి మీ ముగ్గురికీ (డీఎంహెచ్‌వో, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌, ట్రూనాట్‌ ల్యాబ్‌ ఇన్‌చార్జి) చివరి అవకాశం ఇస్తున్నాను. వాటిని వినియోగంలోకి తీసుకురాకపోతే మీకు ఎలాంటి షోకాజ్‌ నోటీసులు ఇవ్వను. నేరుగా మీ ముగ్గురిపై సెక్షన్‌ 188 ఐపీసీ కింద పోలీసు కేసు పెడతా. మీరు ప్రభుత్వ సూచనలను పాటించడం లేదు.’ అంటూ హెచ్చరించారు. ఆ మేరకు కలెక్టరు, వైద్యఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌, కమిషనర్‌లకు కూడా ఆయన కాపీలు పంపించారు. ఇదే సమాచారాన్ని అధికారుల వాట్సాప్‌ గ్రూపులో పోస్టు చేయడంతో డీఎంహెచ్‌వో సీరియస్‌గా స్పందించారు. ‘మీరు గ్రూపులో పోస్టు చేసిన సందేహాన్ని చూసి నేను చాలా అవమానానికి గురయ్యారు. నా వయసు, నా ఆరోగ్య పరిస్థితిని కూడా విస్మరించి ప్రతిరోజూ 18 గంటలు పనిచేస్తున్నాను. ట్రూనాట్‌ ల్యాబ్‌ పూర్తిగా ఆ ల్యాబ్‌ ఇన్‌చార్జి అయిన డీటీసీవో నియంత్రణలో ఉంది.


అడిషనల్‌ డీఎంహెచ్‌వో, డిప్యూటీ డీఎంహెచ్‌వో పోస్టులు ఖాళీగానే ఉన్నప్పటికీ.. వారి కార్యకలాపాలను కూడా జాగ్రత్తగా చూసుకోవడానికి నేను పరిమితికి మించి పనిచేస్తున్నాను. నా పనితీరుతో సంతృప్తి చెందకపోతే నన్ను కొవిడ్‌ విధుల నుంచి తప్పించండి. ఇప్పటికే తీవ్రమైన ఒత్తిడితో సతమతమవుతున్నాను. ఇది ఫిర్యాదు కాదు.. గ్రౌండ్‌ రియాలిటీ.’ అని జేసీకి డీఎంహెచ్‌వో రమేష్‌ లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని కలెక్టరు ఇంతియాజ్‌కు, స్పెషలాఫీసరు సిద్ధార్థజైన్‌కు పంపినట్లు పేర్కొన్నారు. కొవిడ్‌ విధుల్లో కిందిస్థాయి అధికారుల నిర్లక్ష్యం.. ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య వివాదానికి దారితీయడం చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2020-07-18T09:53:04+05:30 IST