సబ్సిడీలన్నీ కౌలు రైతులకే చెందాలి

ABN , First Publish Date - 2021-07-29T05:30:00+05:30 IST

పంటలకు ఇచ్చే అన్ని రకాల సబ్సిడీలు కౌలు రైతులకే చెందాలని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.

సబ్సిడీలన్నీ కౌలు రైతులకే చెందాలి

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
ప్రత్తిపాడు, జూలై 29: పంటలకు ఇచ్చే అన్ని రకాల సబ్సిడీలు కౌలు రైతులకే చెందాలని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. దీనివల్ల కౌలు రైతులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని ఆయన చెప్పారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో ఆయన కౌలుకు తీసుకున్న 12 ఎకరాల పొలంలో గురువారం వరినాట్లకు  శ్రీకారం చుట్టారు. రైతులు, రైతు కూలీలతో కలిసి వరినాట్లు వేశారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌలు రైతులకు భూమి యజ మానులకు దక్కాల్సిన రాయితీలపై స్పష్టత ఉండాలన్నారు. రైతు స్థాయిని పెంచితే అందరూ సాగుపట్ల ఆకర్షితులవుతారని చెప్పారు. ఇందుకు స్వాతంత్య్రం దినోత్సవం రోజున ప్రతి జిల్లా కలెక్టరేట్‌లోనూ రైతులతో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్క రింపజేయాలన్నారు. దీని వల్ల రైతుల్లో ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయన్నారు. రైతులందరూ ఒకే పంట వేయడం వల్ల ఉత్పత్తి పెరిగి డిమాండ్‌ తగ్గి గిట్టుబాటు లేకుండా పోతుందన్నారు. దీనిని అధిగమించేందుకు రైతులు జోనింగ్‌ విధానం అవలంబించాలన్నారు. రైతులకు అవగాహన కల్పించి వారికి నచ్చజెప్పి సంసిద్ధులను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వేర్వేరు పంటల సాగు వల్ల వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగి వ్యవసాయం లాభసాటిగా మారుతుందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 2.50 లక్షల రకాల వరి విత్తనాలు ఉన్నాయని, వీటిలో 97 శాతం విత్తనాలు నశించిపోతున్నాయని... కేవలం 3 శాతం విత్తనాలే విని యోగంలో ఉన్నాయని తెలిపారు. హైబ్రీడ్‌ విత్తనాల మోజులో పడి దేశీయ విత్తనాలను నిర్లక్ష్యం చేస్తున్నారని, దేశవాళీ విత్తనాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని    గుంటూరు జిల్లా ఆకొంది మండలం కొల్లుపర గ్రామానికి చెందిన బాపన్న, లక్ష్మీనర్సారావు, బాపట్ల ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ (రైతుగా మారిన) లక్ష్మీనరసింహారావు చెప్పారు. ఆసుపత్రులకు వెళ్లకుండా బతకడానికి మంచి ఆహారం తీసుకోవాలని,  రక్తజోడి, మల్లెపూలు తదితర రకాల దేశవాళీ విత్తనాలను వినియోగించాలన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి రైతులు సమన్వయంతో పనిచేయాలని... ప్రపంచం కోరుకునే విధంగా పంటల సాగు చేపట్టాలని తెలిపారు. డ్రోన్‌ సహాయంతో మందుల పిచికారీ విధానాన్ని గోపిరాజు వివరించారు. సమావేశంలో రైతులు చెక్కపల్లి నూకరాజు, చెక్కపల్లి సత్తిరాజు, సానా నూకరాజు నాయుడు, దంతులూరి బోసు, వాసురాజు, సిద్దా కొండలరావు, బైరా రాజు, కౌలు పొలం యజమాని ఇందుకూరి మురళీకృష్ణంరాజు, జేడీ ఫౌండేషన్‌ ప్రతినిధులు, మండల రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-29T05:30:00+05:30 IST