డాక్టర్లు ఎందుకవుతున్నారంటే.. : వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హెల్త్ సెక్రటరీ

ABN , First Publish Date - 2021-01-09T02:46:20+05:30 IST

వైద్యులపై జార్ఖండ్ ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నితిన్ కులకర్ణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పెద్ద మొత్తంలో

డాక్టర్లు ఎందుకవుతున్నారంటే.. : వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హెల్త్ సెక్రటరీ

రాంచీ: వైద్యులపై జార్ఖండ్ ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నితిన్ కులకర్ణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పెద్ద మొత్తంలో కట్నం పొందేందుకే జనం వైద్య వృత్తిని ఎంచుకుంటున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. డాక్టర్ నితిన్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆయనపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను కోరింది. 


గత నెల 30న జార్ఖండ్‌లో కొత్తగా నియమితులైన వైద్యులను ఉద్దేశించి డాక్టర్ నితిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘పని చేయక్కర్లేదు కాబట్టి కొందరు డాక్టర్లు అవుతున్నారు. కొందరు మాత్రం ఎక్కువ కట్నం సంపాదించొచ్చని వైద్య వృత్తిని ఎంచుకుంటున్నారు’’ అని అన్నారు. ఆయన వ్యాఖ్యలు వైరల్ కావడంతో జార్ఖండ్ డాక్టర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కులకర్ణిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కులకర్ణి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అవమానకరమైనవని ఐఎంఏ ఆవేదన వ్యక్తం చేసింది. ఆయనపై సత్వరమే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరింది. ఈ మేరకు ఆయనకు లేఖ రాసింది.


కరోనా కాలంలో వైద్య సమాజం విశేష సేవలు అందించిందని ఐఎంఏ ఆ లేఖలో పేర్కొంది. కరోనా పోరులో వైద్యులు ముందున్నారని తెలిపింది. ఈ క్రమంలో 734 మందిని కోల్పోయామని, అయినప్పటికీ సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నామని వివరించింది.కాగా, ఐఎంఏ ప్రతినిధి బృందం, జార్ఖండ్ హెల్త్ సర్వీసెస్ అసోసియేషన్ కలిసి ఆరోగ్య మంత్రి బన్నా గుప్తాను కలిసి డాక్టర్ నితిన్ కులకర్ణిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనున్నాయి.

Updated Date - 2021-01-09T02:46:20+05:30 IST