సందట్లో సడేమియా...ఉద్యోగాలు అమ్మేశారు

ABN , First Publish Date - 2020-05-23T10:51:42+05:30 IST

ప్రపంచమంతా కరోనా మహమ్మారితో అట్టుడికిపోతోంది. వైరస్‌ కట్టడికి ప్రభుత్వాలు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి.

సందట్లో సడేమియా...ఉద్యోగాలు అమ్మేశారు

మూడు నెలల కాలానికి 170 మంది పారిశుధ్య కార్మికుల నియామకం 

పర్మనెంట్‌ చేస్తామంటూ వసూళ్ళు ? 

చక్రం తిప్పిన ఆ ఇద్దరు...


కడప (ఆంధ్రజ్యోతి), మే 22: ప్రపంచమంతా కరోనా మహమ్మారితో అట్టుడికిపోతోంది.  వైరస్‌ కట్టడికి ప్రభుత్వాలు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి. దేశం, రాష్ట్రం ఆపత్కాల పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. సందట్లో సడేమియా అన్నట్లు... ఇలాంటి విపత్కర సమయంలో కూడా కొందరు సొమ్ము చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కడప కార్పొరేషన్‌లో తాత్కాలిక పద్ధతిన విధుల్లోకి తీసుకున్న 170 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల నియామకాల్లో గోల్‌మాల్‌ జరిగింది. కరోనా వైరస్‌ కట్టడికి భౌతికదూరంతో పాటు మెరుగైన పారిశుధ్య చర్యలు చేపట్టాల్సి ఉంది. నగరాలు, పట్టణాల్లో పారిశుధ్య సిబ్బంది కొరత ఉండడంతో తాత్కాలిక పద్ధతిన నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  కడప నగరంలో మెరుగైన పారిశుధ్యం కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు 170 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని 90 రోజుల కాల పరిమితితో విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించారు. కష్టకాలంలో అనుకోకుండా వచ్చిన ఉద్యోగాలను అదృష్టంలా భావించి కొందరు పోటీ పడ్డారు. తాత్కాలిక ఉద్యోగాల కోసం ఎగబడుతున్న ఆత్రుతను కొందరు సద్వినియోగం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగాలకు బేరం పెట్టి విక్రయించినట్లు ఆరోపణలున్నాయి. 


చక్రం తిప్పిన ఆ ఇద్దరు...

తాత్కాలిక ఉద్యోగాల నియామకంలో ఇద్దరు చక్రం తిప్పినట్లు సమాచారం. 90 రోజుల కాలపరిమితితో విధుల్లోకి తీసుకుంటున్న వారి నుంచి డబ్బులు వసూలు చేయాలని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ఇద్దరి సూచన మేరకు కొందరు వసూళ్ళకు పాల్పడినట్లు తెలుస్తోంది. తాత్కాలిక ఉద్యోగాల నియామకాలకు డబ్బులు ఇవ్వడం ఎందుకని కొందరు సందేహం వ్యక్తం చేస్తే... అవి తాత్కాలికం ఎందుకవుతాయి, మనం వాటిని పర్మినెంట్‌ చేయిస్తామని చెప్పి వసూళ్ళు చేయాలని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ఇద్దరి భరోసాతో కొందరు వసూళ్ళు చేసినట్లు చెబుతున్నారు. దాదాపు రూ.కోటికి పైగా వసూళ్ళు అయినట్లు కార్పొరేషన్‌ సర్కిల్‌లో ప్రచారం జోరుగా సాగుతుంది. ఆ సొమ్మును వాటాలు వేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరి నుంచే భరోసా రావడంతో ఉద్యోగాలు రెగ్యులర్‌ అవుతాయన్న నమ్మకంతో అప్పొసోప్పొ చేసి కొందరు డబ్బులు చెల్లించినట్లు తెలుస్తోంది. 


కార్పొరేషన్‌కు సంబంధం లేదు : శ్రీనివాసులరెడ్డి, ఎంహెచ్‌వో 

పారిశుధ్య కార్మికుల నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ఎంహెచ్‌వో శ్రీనివాసులరెడ్డి దృష్టికి తీసుకెళ్ళింది. నియామకాల్లో డబ్బు వసూలు చేశారన్న ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 90 రోజుల వర్కు ఆర్డర్‌తో సొసైటీల ద్వారా 170 మంది పారిశుధ్య సిబ్బందిని విధుల్లోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆ నియామకాలకు కార్పొరేషన్‌ సంబంధం లేదు. అవి తాత్కాలిక ఉద్యోగాలు మాత్రమే. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే వర్క్‌ఆర్డర్‌ను పొడిగిస్తామని,  లేకుంటే 90 రోజులు మాత్రమే పనిచేయాల్సి ఉంది. 

Updated Date - 2020-05-23T10:51:42+05:30 IST