కరోనా కలవరం.. హైదరాబాద్‌లో జూలై టెన్షన్..!

ABN , First Publish Date - 2020-07-02T14:48:28+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా కలవరం రోజురోజుకూ రెట్టింపవుతోంది. జూలైలో కేసుల తీవ్రత పెరుగుతుందని ఆందోళన వ్యక్తమైంది.

కరోనా కలవరం.. హైదరాబాద్‌లో జూలై టెన్షన్..!

జూలై టెన్షన్‌ మొదలు...

మొదటి రోజే 881 పాజిటివ్‌ కేసులు

తీవ్రస్థాయికి కరోనా మహమ్మారి

రికార్డు స్థాయిలో కేసులు నమోదు 


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి) : గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా కలవరం రోజురోజుకూ రెట్టింపవుతోంది. జూలైలో కేసుల తీవ్రత పెరుగుతుందని ఆందోళన వ్యక్తమైంది. ఊహించినట్లుగానే జూలై ఒకటో తేదీన రికార్డుస్థాయిలో 881 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆర్యోగ శాఖ అధికారులు ప్రకటించారు. తొలిరోజుల్లో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వైరస్‌ నగరం నలుమూలలా విస్తరించింది. అన్ని వర్గాలవారు, చిన్నాపెద్దా అందరూ వైరస్‌ బారిన పడుతున్నారు. చాలామంది పాజిటివ్‌ల్లో లక్షణాలు అంతగా బయటపడటం లేదు. చివరి నిమిషంలో తెలుస్తుండటంతో అప్పటికే పరిస్థితి పూర్తిగా విషమించి చనిపోతున్నారు. మరికొందరు కరోనాను జయించి మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. గ్రేటర్‌లో మార్చిలో తొలి కరోనా కేసు నమోదు అయింది. మే చివరి వరకు కూడా పదులు, వందల్లోనే పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తర్వాత కరోనా పంజా విసిరింది.


రాష్ట్రవ్యాప్తంగా వంద, రెండు వందలకే పరిమితమైన కేసులు ఇప్పుడు రోజుకు వెయ్యికి పైగా చేరాయి. అందులో 90 శాతం కేసులు నగరానివే ఉంటున్నాయి. జూన్‌ మొత్తంగా 11.080మందికి కరోనా వైరస్‌ సోకినట్లు రికార్డులు చెబుతున్నాయి. జూలై మొదటి రోజే రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడం, మరో పక్క జూలై అంటే సీజనల్‌ వ్యాధులు ప్రభలే కాలం కావడంతో గ్రేటర్‌ వాసులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే గ్రేటర్‌ పరిధిలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారని ప్రచారం జరుగుతోంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు బయటపడుతున్న నేపథ్యంలో చాలా మంది నగరాన్ని వదిలి సొంత ఊర్లకు వెళ్తున్నారు. మరికొందరు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 

Updated Date - 2020-07-02T14:48:28+05:30 IST